Begin typing your search above and press return to search.

వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రాధాన్యత రేవంత్ రెడ్డికి వస్తుందా..?

By:  Tupaki Desk   |   5 Jan 2023 7:32 AM GMT
వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రాధాన్యత రేవంత్ రెడ్డికి వస్తుందా..?
X
తెలంగాణ కాంగ్రెస్ పరిస్థితి రోజు రోజుకు ఆందోళనకరంగా మారుతోంది. ఆ పార్టీని ఇతర పార్టీలు ప్రభావం చేయకముందే సొంత కుంపటిలో చల్లారని అసంతృప్తి నెలకొంది. సీనియర్లు, జూనియర్లు విడిపోయిన తరువాత ఎవరి దారి వారిదే అన్నట్లు గా ప్రవర్తిస్తున్నారు. వీరందరిని ఒక్కటి చేయాల్సిన అధిష్టానం కూడా పట్టించుకోకపోవడంతో వచ్చే ఎన్నికల నాటికి ఎటువంటి పరిస్థితుల్లో ఉంటుందోనని కేడర్ ఆందోళన చెందుతోంది. అయితే రేవంత్ కామెంట్స్ ఇటీవల మార్పులు చోటు చేసుకున్నాయి. ఆయన ఎక్కువగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి గురించి మాట్లాడుతున్నారు. అంటే అసంతృప్తి చల్లార్చడానికి ఆయన వైఎస్ ను వాడుతున్నారా..? అనేది చర్చనీయాంశంగా మారింది.

ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తరువాత కాంగ్రెస్ విచ్చుకుపోతోంది. 2014లో కాంగ్రెస్ పై ఉన్న అభిమానంతో ఆ పార్టీకి ఓట్లు బాగానే వచ్చాయి. ఈ నేపథ్యంలో కొందరు ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. అయితే వీరిలో చాలా మంది అధికార టీఆర్ఎస్ మాయలో పాడి కాంగ్రెస్ జెండాను పక్కనబెట్టారు. ఇప్పుడు గులాబీ కండువా కప్పుకొని మంత్రి పదవులు అనుభవిస్తున్నారు. కాంగ్రెస్ పేరు చెప్పుకొని గెలిచినవారు తమ పదవులకు రాజీనామా చేయాలని రేవంత్ రెడ్డి అప్పుడప్పుడు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికిప్పుడు వారు రేవంత్ వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకునే అవకాశం లేదు.

మరోవైపు ఇటీవల కాంగ్రెస్ లో వివాదాలు ముదిరాయి. సీనియర్లు, జూనియర్లు విడిపోయారు. వీరిని చక్కదిద్దేందుకు అధిష్టానం దిగ్విజయ్ సింగ్ ను పంపించినా సమస్య పరిష్కారం కాలేదు. త్వరలో ప్రియాంకా గాంధీ వస్తుందని అంటున్నారు.

కానీ ప్రస్తుతానికైతే పార్టీకి సంబంధించి ఏ కార్యక్రమం నిర్వహించిన అందరూ హాజరు కావడం లేదన్నది కనిపిస్తోంది. ఈ తరుణంలో రేవంత్ రెడ్డి తన వ్యూహం మార్చారు. 2004లో ఒంటి చేత్తో అధికారాన్ని తీసుకొచ్చిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరును రేవంత్ రెడ్డి పదే పదే తీస్తున్నారు.

వైఎస్ రాజశేఖర్ రెడ్డి తెలంగాణకు ఎంతో చేశారని, ఆయన ఆశయాలు కొనసాగించేందుకు కాంగ్రెస్ ను కాపాడాలని అంటున్నారు. వాస్తవానికి తెలంగాణలో చాలా చోట్ల వైఎస్ అభిమానులు ఉన్నారు. ఆ నేపథ్యంలోనే రాజశేఖర్ రెడ్డి కూతురు షర్మిల ఉత్తర తెలంగాణలో 3 వేల కిలోమీటర్లు పాదయాత్ర చేయగలిగింది. కొన్ని కారణాల వల్ల ఆ పాదయాత్ర ఆగిపోయింది. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి వైఎస్ పేరును వాడుకుంటూ పార్టీని చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు.

వైఎస్ హయాంలో కాంగ్రెస్ లో ఎలాంటి అసంతృప్తి రానివ్వలేదు. ప్రభుత్వంపై కూడా వ్యతిరేకత రాకుండా చూసుకున్నారు. అయితే ఆయన ప్రశేశపెట్టిన కొన్ని పథకాలపై ఇప్పటికీ చాలా మంది లబ్ధి పొందుతున్నారు. అందువల్ల ఆయన ఆశయాలు కొనసాగించాలంటే కాంగ్రెస్ ను ఆదరించాలని అంటున్నారు. ఇదే సమయంలో వైఎస్ రాజన్న రాజ్యం తీసుకొస్తానని వ్యాఖ్యలు చేయడం పార్టీ కేడర్లోనూ చర్చనీయాంశంగా మారింది. కానీ సీనియర్లు రేవంత్ రెడ్డి వ్యూహంతో మారుతారా..? అనేది తెలియాల్సిన అంశం.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.