Begin typing your search above and press return to search.

ఆర్ఎస్.. స‌క్సెస్ అయ్యేనా?

By:  Tupaki Desk   |   28 July 2021 10:30 AM GMT
ఆర్ఎస్.. స‌క్సెస్ అయ్యేనా?
X
పీడిత‌, అణ‌గారిన‌, సామాజిక వ‌ర్గాల ప్ర‌జ‌ల అభ్యున్న‌తి కోసం వాళ్ల జీవితాల్లో వెలుగు నింపడ‌మే ల‌క్ష్యంగా చ‌దువుకున్న నేత‌లు వ్య‌వ‌స్థ‌లో ఉన్న‌త స్థానాల్లో ఉన్న వాళ్లు రాజ‌కీయాల్లో అడుగుపెడుతుంటారు. త‌మ ప‌ద‌వుల‌ను సైతం వ‌దులుకుని ప్ర‌జ‌ల త‌ర‌పున పోరాటం చేసేందుకు ముందుకు వ‌స్తుంటారు. కానీ ఒక్క‌సారి రాజ‌కీయాల నిజ స్వ‌రూపం తెలిశాక‌.. ఇత‌ర వ‌ర్గాల నుంచి స‌హ‌కారం లేక చివ‌ర‌కు ఏమీ చేయ‌లేని స్థితికి చేరుకుంటారు. ఇప్పుడు బ‌హుజ‌నుల ప‌క్షాన పోరాడేందుకు రాజ‌కీయాల్లోకి వ‌స్తున్నాన‌ని ప్ర‌క‌టించిన‌ మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్‌.. స‌రికొత్త ప్ర‌యాణంలో స‌క్సెస్ అందుకుంటారా? లేదా మిగ‌తా వాళ్ల‌లాగే మిగిలిపోతారా అన్న‌ది ప్ర‌శ్నార్థ‌కంగా మారింది.

గ‌తంలో జ‌య‌ప్ర‌కాశ్ నారాయ‌ణ (జేపీ), ల‌క్ష్మీ నారాయ‌ణ (జేడీ).. ఇప్పుడు ప్ర‌వీణ్ కుమార్ సివిల్ స‌ర్వీసెస్‌లో ప‌ద‌వుల‌ను మ‌ధ్య‌లోనే వ‌దిలేసి ప్ర‌జ‌లకు సేవ చేసేందుకు రాజ‌కీయాల్లోకి వ‌చ్చారు. ఐఏఎస్‌లుగా జేపీ, జేడీ, ఐపీఎస్‌గా ఆర్ఎస్ కెరీర్లో ఎలాంటి మ‌చ్చ‌లు లేవ‌నే చెప్పాలి. అవినీతి మ‌ర‌క‌లు, ఎలాంటి ప‌క్ష‌పాతం లేకుండా త‌మ బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించారు. కానీ రాజ‌కీయ నేత‌ల వైఖ‌రి కార‌ణంగానే త‌మ ఉద్యోగాల‌పై అసంతృప్తితో బ‌య‌ట‌కు వ‌చ్చి ప్ర‌జ‌ల‌కు సేవ చేయాల‌ని నిర్ణ‌యించుకున్నారు. దేశం మారాలంటే రాజ‌కీయాలు మారాల‌ని నాయ‌కుల్లో మార్పు రావాల‌ని విశ్వ‌సించి త‌మ ఉద్యోగాల‌కు రాజీనామా చేశారు. కానీ జేపీ, జేడీ ల‌క్ష్యం మాత్రం నెర‌వేర‌లేదు.

రెండు ద‌శాబ్దాల‌కు క్రిత‌మే స‌ర్వీసును వ‌దిలేసిన జేపీ లోక్‌సత్తా స్వ‌చ్ఛంద సంస్థ‌ను ప్రారంభించారు. త‌ర్వాత దాన్ని రాజ‌కీయ పార్టీగా మార్చారు. స్వ‌చ్చంద సంస్థ‌గా సంస్క‌ర‌ణ‌ల వేదిక‌గా లోక్‌స‌త్తా విజ‌య‌వంత‌మైన‌ప్ప‌టికీ పార్టీగా మాత్రం నిల‌దొక్కుకోలేక‌పోయింది. మ‌రోవైపు జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ వ్య‌క్తిగ‌తంగా గొప్ప పేరు తెచ్చుకున్నారు. కొన్ని గ్రామాల‌ను ద‌త్త‌త తీసుకుని స్వ‌యం ఉపాధి, మ‌హిళ‌ల్లో చైత‌న్యం క‌లిగించే కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించారు. ఆ త‌ర్వాత ప‌ద‌విని వ‌దిలేసి రాజ‌కీయాల్లోకి వ‌చ్చారు. జ‌న‌సేన పార్టీలో చేరి 2019 లోక‌స‌భ ఎన్నిక‌ల్లో విశాఖప‌ట్నం నుంచి పోటీచేసి ఓడిపోయారు. ఆ త‌ర్వాత జ‌న‌సేన‌కు రాజీనామా చేసి ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల‌కు దూరంగా ఉంటున్నారు.

ఇప్పుడేమో తాజాగా ఆరేళ్ల స‌ర్వీస్ మిగిలి ఉన్న‌ప్ప‌టికీ ప‌ద‌వికి రాజీనామా చేసిన ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ బ‌హుజ‌న్‌ స‌మాజ్ పార్టీ (బీఎస్పీ)లో చేరుతున్నారు. వ‌చ్చే నెల 8న న‌ల్గొండ‌లో బ‌హిరంగ స‌మావేశంలో బీఎస్పీ తీర్థం పుచ్చుకోనున్నారు. బ‌హుజ‌నుల అభ్యున్న‌తి కోసం మాయావ‌తి నాయ‌క‌త్వంలో ప‌నిచేసేందుకు సిద్ధ‌మ‌య్యారు. ఆయ‌న ఐపీఎస్ అయిన‌ప్ప‌టికీ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాల‌యాల‌ అభివృద్ధి కోసం ప‌నిచేశారు. గురుకులాల‌ను అత్యుత్త‌మంగా తీర్చిదిద్దార‌నే పేరు ఆయ‌న‌కు ఉంది. స్వేరోస్ పేరుతో స‌మాంత‌ర వ్య‌వ‌స్థ‌ను న‌డిపారు. కానీ ఇప్పుడు రాజ‌కీయాల ద్వారానే ప్ర‌జ‌ల‌కు న్యాయం చేసే అవ‌కాశం ఉంద‌ని భావించిన ఆయ‌న స్వ‌చ్ఛంద ప‌ద‌వీ విర‌మ‌ణ తీసుకున్నారు. దీంతో టీఆర్ఎస్‌లో చేర‌తార‌ని కొత్త‌ పార్టీ పెడ‌తార‌నే ప్ర‌చారం సాగింది. కానీ ఇప్పుడు అనూహ్యంగా బీఎస్పీలో చేరాల‌ని నిర్ణ‌యించుకున్నారు. కానీ అటు జాతీయ రాజ‌కీయాల్లో పెద్ద‌గా ప్రభావం చూప‌లేక‌పోతున్న ఆ పార్టీకి తెలంగాణ‌లో అస‌లేమాత్రం ఉనికి లేదంటే అతిశ‌క‌యోక్తి కాదు. ఈ నేప‌థ్యంలో ఇలాంటి పార్టీలో చేరి ప్ర‌వీణ్ కుమార్ త‌న ల‌క్ష్యాన్ని ఎలా చేరుకుంటారో చూడాలి.