Begin typing your search above and press return to search.

శశికళ మరోసారి చిక్కుల్లో పడక తప్పదా?

By:  Tupaki Desk   |   19 Oct 2022 3:30 PM GMT
శశికళ మరోసారి చిక్కుల్లో పడక తప్పదా?
X
తమిళనాడు ముఖ్యమంత్రిగా, అన్నాడీఎంకే అధినేత్రిగా ఉంటూ జయలలిత కన్నుమూసిన సంగతి తెలిసిందే. అనారోగ్యంతో నాడు అపోలో ఆస్పత్రిలో దాదాపు నెల రోజులకుపైగానే జయలలిత చికిత్స తీసుకున్నారు. జయలలిత మరణించిన వ్యవహారానికి సంబంధించి గత అన్నాడీఎంకే ప్రభుత్వం జస్టిస్‌ ఆర్ముగస్వామి కమిషన్‌ను విచారణకు నియమించింది.

ఈ కమిషన్‌ జయలలిత మరణంపై దాదాపు 150 మందిని విచారించి తాజాగా తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌కు నివేదికను అందజేసిన సంగతి తెలిసిందే. ప్రధానంగా జయ నెచ్చెలి శశికళతోపాటు మరో ముగ్గురిపై అనుమానాలు ఉన్నాయని ఆర్ముగస్వామి కమిషన్‌ రిపోర్టులో పేర్కొంది.

దీంతో తమిళనాడు మాజీ సీఎం, దివంగత జయలలిత మరణంపై కమిషన్‌ ఇచ్చిన రిపోర్టు ఆ రాష్ట్రంలో హీట్‌ పెంచుతోంది. జయ మరణంలో ముఖ్యంగా జయ నెచ్చెలి శశికళ, నాటి ఆరోగ్య శాఖ మంత్రి విజయ్‌భాస్కర్, జయ వ్యక్తిగత వైద్యుడు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామ్మోహన్‌రావులపై అనుమానం వ్యక్తం చేసింది. వీరిపై దర్యాప్తు ప్రారంభించాలని ప్రభుత్వానికి సూచించింది.

ఈ నేపథ్యంలో ఇప్పటికే అక్రమాస్తుల కేసులో జైలుశిక్ష అనుభవించి వచ్చిన శశికళ మరోమారు తీవ్ర చిక్కుల్లో పడక తప్పదని తెలుస్తోంది. డీఎంకే ప్రభుత్వం శశికళ, తదితరులను విచారణకు పిలిపిస్తే ఆమె మరోమారు పీకల్లోతు ఇబ్బందుల్లో కూరుకుపోక తప్పదని అంటున్నారు.

ప్రస్తుతం అన్నాడీఎంకే ప్రతిపక్షంలో ఉంది. వచ్చే ఎన్నికల నాటికి అన్నాడీఎంకేను తన అదుపులోకి తీసుకుని ముఖ్యమంత్రిని కావాలని శశికళ ఉవ్విళ్లూరుతున్నారు. ఇప్పటికే అన్నాడీఎంకే పన్నీరు సెల్వం, పళనిస్వామిల మధ్య విభేదాలతో కునారిల్లుతోంది. జయలలిత మరణం తర్వాత ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన పళనిస్వామి పార్టీపై పట్టు సాధించారు. పార్టీ కార్యకలాపాలన్నీ ఆయన ఆధ్వర్యంలోనే సాగుతున్నాయి.

గత ఎన్నికల్లో పార్టీ పరాజయం పాలయ్యాక అన్నాడీఎంకేపై పెత్తనం కోసం మాజీ ముఖ్యమంత్రులు పళనిస్వామి, పన్నీరుసెల్వం ప్రయత్నించారు. అయితే ఎక్కువ మంది పార్టీ ప్రతినిధులు, ఎమ్మెల్యేలు పళనిస్వామి వైపే నిలబడ్డారు. మరోవైపు పన్నీరు సెల్వంను, ఎంపీగా ఉన్న ఆయన కుమారుడిని పళనిస్వామి పార్టీ నుంచి తొలగించారు. ఈ వ్యవహారంలో పన్నీరు సెల్వం సుప్రీంకోర్టు, మద్రాస్‌ హైకోర్టులను ఆశ్రయించినా ఫలితం దక్కలేదు.

పార్టీపై సస్పెండ్‌ అయ్యాక పన్నీరు సెల్వం ఒకప్పుడు తాను విభేదించిన శశికళకు చేరువ అయ్యారు. శశికళను కూడా గతంలోనే పార్టీ నుంచి బహిష్కరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పన్నీరు సెల్వం, శశికళ కలసి తమకు మద్దతు ఇచ్చే నేతలతో అన్నాడీఎంకేపై పట్టు కోసం ప్రయత్నిస్తారు.

ఈ సమయంలోనే పులిమీద పుట్రలా జయలలిత మరణంపై కమిషన్‌ నివేదిక సమర్పించడం, జయ మరణంలో వేళ్లన్నీ శశికళవైపే కమిషన్‌ చూపించడంతో శశికళ మరోమారు ఇబ్బందుల్లో పడ్డారు. వారిపై విచారణ కూడా నిర్వహించాలని కమిషన్‌ సూచించడంతో అన్నాడీఎంకేను తన చేతుల్లోకి తీసుకోవడం, ముఖ్యమంత్రిని కావాలనునే ఆమె ఆశయాలు నెరవేరకపోవచ్చని చెబుతున్నారు.


మరోవైపు జయలలిత మరణంలో వేళ్లన్నీ తన వైపే చూపిస్తుండటంతో శశికళ కూడా స్పందించారు. ఆమె మరణంలో తనకెలాంటి పాత్ర లేదన్నారు. కమిషన్‌ తనపై అనుమానం వ్యక్తం చేయడంపై మండిపడ్డారు. తాను రాజకీయాల్లో చురుగ్గా ఉండకూడదనే డీఎంకే ప్రభుత్వం ఇలా చేస్తోందని శశికళ తాజాగా ఆరోపణలు సంధించారు.

జయలలిత మరణంలో ఏ విచారణ అయినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆమె ప్రకటించారు. దాదాపుగా 30 ఏళ్ల పాటు జయలలితతో ఉన్నానని.. ఆమె చికిత్సలో ఎప్పుడూ జోక్యం చేసుకోలేదని స్పష్టం చేశారు. తనపై వచ్చిన ఆరోపణలు అన్ని అబద్ధాలే అని ఆమె అన్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.