Begin typing your search above and press return to search.

ఖమ్మం బరిలో షర్మిల ముందస్తు టెస్ట్?

By:  Tupaki Desk   |   15 April 2021 4:30 PM GMT
ఖమ్మం బరిలో షర్మిల ముందస్తు టెస్ట్?
X
‘ఉట్టికి ఎగురలేనమ్మా.. స్వర్గానికి నిచ్చెన వేస్తుందట..’ అని వెనుకటికి ఏం సాధించలేని మహిళలను పట్టుకొని ఇలా సామెతలు ప్రయోగించేవారు. ఇప్పుడు తెలంగాణలో వైఎస్ షర్మిలపై కూడా ప్రతిపక్షాలు ఇదే సా‘మోత’ మోగిస్తున్నాయి. షర్మిల తెలంగాణలో పెట్టిన ఖమ్మం సభకు పెద్దగా స్పందన రాలేదని... ఆమె ఎంత క్రియాశీలకంగా మారుతుందని అనుకున్నా ప్రజల్లో ఆదరణ మాత్రం దక్కడం లేదన్న ప్రచారం ఉంది.

ఇక తెలంగాణలోని అధికార, ప్రతిపక్షాలు సైతం షర్మిలను పట్టించుకోవడం లేదు. తాజాగా తెలంగాణలోని నిరుద్యోగుల కోసం ఇందిరాపార్క్ వద్ద షర్మిల నిరసనకు కూర్చుంది. కేసీఆర్ పై విమర్శలు గుప్పించింది. అయినా పెద్దగా స్పందన లేదంటున్నారు.

కొత్త పార్టీ ప్రకటించకుండానే తెలంగాణలో తన ప్రభావం చూపించాలనుకుంటున్న షర్మిల కోరిక తీరకుండానే కేసీఆర్ సర్కార్ అప్రమత్తమైందట.. నిజానికి వరంగల్, ఖమ్మం సహా ఐదు మున్సిపాలిటీల ఎన్నికలకు ఇంకాస్త టైం తీసుకుంటారని అనుకున్నా.. సడెన్ గా తెలంగాణ సర్కార్ మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వేసింది. తెలంగాణలో మరో ఐదేళ్ల దాకా ఇవే చివరి ఎన్నికలు. దీంతో కొత్తగా పార్టీ పెట్టబోతున్న షర్మిల ఇందులో పోటీచేద్దామని భావించినా పార్టీ పెట్టకపోవడం.. గుర్తు లేకపోవడంతో ఆమె ఆశలు అడియాశలయ్యాయి.

అయితే గతంలో వైసీపీకి ఆయువుపట్టుగా ఉన్న ఖమ్మం జిల్లా, ఖమ్మం మున్సిపాలిటీలో పోటీచేయాలని షర్మిలను ఆమె అనుచరవర్గం గట్టిగా కోరుతోందట.. గుర్తు లేకున్నా.. ఒక స్వతంత్రులుగా పోటీచేద్దామని.. గెలిచి తెలంగాణలో తొలి ముద్ర వేద్దామని కోరుతున్నారట.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి షర్మిల నిరూపించుకోవాలంటే ఇదే చివరి ఎన్నిక కావడంతో ఖమ్మం మున్సిపాలిటీలో పోటీచేద్దామని ఆమెపై ఒత్తిడి తెస్తున్నారట ఖమ్మం బ్యాచ్.

తెలంగాణలో కెల్లా వైఎస్ షర్మిలకు అంతో ఇంతో బలం ఉన్నది ఖమ్మం జిల్లానే . పాలేరు నుంచి పోటీచేస్తానని ఇప్పటికే షర్మిల చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే ఖమ్మం మున్సిపాలిటీలో స్వతంత్రులుగా పోటీచేసి తెలంగాణలో సత్తా చాటాలని వైఎస్ షర్మిల వర్గం పట్టుదలగా ఉందట.. ఖమ్మంలో వైసీపీకి, షర్మిలకు పట్టు ఉండడంతో ముందస్తుగా ఇక్కడ బరిలోకి దిగి నిరూపించుకోవాలనుకుంటోదట.. వచ్చే సాధారణ ఎన్నికలకు ముందు ఖమ్మంలో పోటీచేస్తే ఆదరణ దక్కుతుందా? దక్కకపోతే ఏం చేయాలి? రాజకీయ అడుగులు ఎలా వేయాలి? ఆదరణ లేకపోతే పార్టీ పెట్టాలా? వద్దా? అనేది నిర్ణయించుకునేందుకు ఖమ్మం మున్సిపోల్స్ ట్రయల్స్ గా ఉపయోగపడుతాయని షర్మిల వ్యూహకర్తలు భావిస్తున్నారట..

ఇప్పటికే ఖమ్మం ఎంపీ సీటును గతంలో వైసీపీ గెలిచింది. ఖమ్మం మున్సిపల్ లోని రెండు కార్పొరేట్ సీట్లను గెలిచింది. బలంగా ఉన్న ఆ చోట షర్మిల నిలబడితే తెలంగాణలో కలబడొచ్చని.. లేదంటే చాప చుట్టేయవచ్చని భావిస్తున్నారట.. మరి షర్మిల అడుగులు ఎటువైపు పడుతాయన్నది వేచిచూడాలి.