Begin typing your search above and press return to search.

బాణం గుచ్చుకుంటుందా...?

By:  Tupaki Desk   |   4 Jan 2022 3:30 AM GMT
బాణం గుచ్చుకుంటుందా...?
X
ప్రత్యర్ధిని చిత్తు చేయడానికే ఎవరైనా బాణాన్ని ఎక్కుపెట్టేది. కొన్ని సార్ అలా వదిలిన బాణాలు రివర్స్ అయి ప్రయోగించిన వారి మీదకే దూకుడుగా దూసుకువచ్చేస్తాయి. ఇదంతా ఎందుకంటే ఇపుడు ఏపీ రాజకీయాలో హాట్ హాట్ డిస్కషన్ ఒకటి సాగుతోంది. వైఎస్సార్ ఫ్యామిలీలో విభేదాలు ఉన్నాయన్నది బహిరంగ రహస్యం. అయితే అదిపుడు ఇంకా పెరిగి పెద్దది అయ్యేట్లుగా ఉందని అంటున్నారు. వైఎస్సార్ ముద్దుల తనయ, ఏపీ సీఎం జగన్ సోదరి అయిన వైఎస్ షర్మిల తాజాగా మీడియాతో అన్న మాటలను బట్టి చూస్తే వైఎస్సార్ లెగసీని తానూ అందిపుచ్చుకుంటాను అన్నట్లుగానే అర్ధం చేసుకోవాలి.

ఆమె ఈసరికే తెలంగాణాలో పార్టీని పెట్టారు. గట్టిగానే అక్కడ పోరాడుతున్నారు. అయితే వైఎస్సార్ మూలాలు అన్నీ కూడా ఏపీలోనే ఉన్నాయి. దాంతో పాటు తెలంగాణాలో ఎక్కువ పార్టీలు ఉన్నాయి. టీయారెస్ బలంగా ఉంది. తెలంగాణావాదం కూడా ఇంకా పూర్తిష్తాయిలో ఉంది. షర్మిల ఎంతగా తాను తెలంగాణా కోడలు అని చెప్పుకున్నా కూడా దానికి జనాల అక్సెప్టెన్స్ కూడా దొరికే చాన్స్ లేదని జరిగిన పరిణామాలు చెబుతున్నాయి.

ఇక ఏపీలో జగన్ కి ఉన్న వెసులుబాటు కాంగ్రెస్ మొత్తం కుప్ప కూలి వైసీపీలోకి వచ్చేయడం. అదే తెలంగాణాలో చూసుకుంటే మాత్రం కాంగ్రెస్ ఏపీ కంటే బలంగా ఉంది. రేపో మాపో అధికారంలోకి వస్తామన్న నమ్మకం కూడా ఆ పార్టీకి ఉంది. దాంతో షర్మిల పార్టీకి కాంగ్రెస్ నుంచి జంపింగులు లేవు, ఆశలు పెట్టుకున్నట్లుగా జనాల ఆదరణ కూడా కనిపించడంలేదు. దాంతో ఆమె పునరాలోచించుకుంటోందా అన్న చర్చ అయితే ఉంది.

మనసులో లేకపోతే మాట బయటకు రాదు అంటారు, మీడియా అడిగినా కూడా ఆమెకు ఏపీ రాజకీయాలపైన ఆసక్తి లేకపోతే అక్కడా పార్టీని పెడతాను అని ఎందుకు అంటారన్న చర్చ అయితే బాగానే సాగుతోంది. నిజానికి ఏపీలో జగన్ వైఎస్సార్ వారసుడిగా ఉన్నారు. రాజన్న పాలన తన అన్న తెస్తాడు అని 2019 ఎన్నికల వేళ షర్మిల ఊరూ వాడా తిరిగి చాటారు. తెలంగాణాలో రాజన్న రాజ్యం తేవడానికే పార్టీ పెడుతున్నట్లుగా ఆమె మొదట్లో చెప్పుకున్నారు. అదే మాటను వైఎస్ విజయమ్మ కూడా చెప్పారు. మరి ఇపుడు ఏపీలో పార్టీని పెడతాను అంటే అక్కడ రాజన్న రాజ్యం లేదని షర్మిల అనుకుంటున్నారు అని భావించాలా అన్న ధర్మ సందేహాలు అయితే వైసీపీ నేతలలొ కలుగుతున్నాయ‌ట.

ఇక జగనన్న వదిలిన బాణాన్ని అని అప్పట్లో షర్మిల పాదయాత్ర చేశారు. ఆమె బాణం సైతం ప్రత్యర్ధులకు బాగానే గుచ్చుకుంది. చంద్రబాబు సహా టీడీపీని నిలువరించడానికి అయితేనేని, వైసీపీ గట్టిగా నిలబడడానికి అయితేమేని షర్మిల చేసిన కృషి చాలానే ఉంది. అయితే దానికి తగిన రాజకీయ వాటా అయితే ఆమెకు దక్కలేదు అన్న బాధ ఉంది అంటారు. ఆ అసంతృప్తితోనే ఆమే తెలంగాణాలో పార్టీ పెట్టారు అని కూడా ప్రచారంలో ఉంది.

ఇపుడు ఆమె కరెక్ట్ దిశగా దూసుకువస్తున్నారా అన్న చర్చ కూడా సాగుతోంది. ఏపీలో పార్టీని పెడతాను అంటే నేరుగా జగన్ని ఢీ కొనడమే అని అంటున్నారు. మరి ఒకనాడు అన్నని గెలిపించనమి ప్రచారం చేసిన షర్మిల ఇపుడు జగన్ని ఓడించమని తన పార్టీని గెలిపించమని ప్రచారం చేస్తారా అన్న ప్రశ్నలు కూడా వస్తున్నాయి. ఏది ఏమైనా జగన్ వదిలిన బాణం తిరిగి ఆయనకే గుచ్చుకుంటుందా అన్నదే ఇక్కడ అందరికీ కలుగుతున్న అతి పెద్ద డౌట్. కాలం గడిస్తే తప్ప దీనికి జవాబు దొరకదేమో. ఏది ఏమైనా షర్మిల ఏపీలో పార్టీ ఎందుకు పెట్టకూడదు అని ఒక హింట్ అయితే ఇచ్చారు. మరి కధ అక్కడితో ఆగుతుందా ముందుకు సాగుతుందా అన్నది చూడాల్సిందే.