Begin typing your search above and press return to search.

కన్నయ్య.. ఖలీద్ లకు హిందుత్వ ఫత్వా

By:  Tupaki Desk   |   28 March 2016 9:08 AM GMT
కన్నయ్య.. ఖలీద్ లకు హిందుత్వ ఫత్వా
X
అసహనం పెరిగిపోతుందంటూ వామపక్ష వాదులు.. కాంగ్రెస్ నేతలు ఓపక్క విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే. ఇంకోవైపు..బాధ్యతగా ఉండాల్సిన వారు సైతం నోటికి పని చెబుతూ ఆగ్నికి అజ్యం పోసేలా వ్యవహరిస్తున్న పరిస్థితి. ప్రత్యర్థులు ఇరుకున పడేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసినప్పుడు.. వారి ఉచ్చులో పడకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉన్నా.. అలాంటిదేమీ లేకుండా వ్యవహరించటం హిందుత్వవాదులకు ఒక అలవాటుగా మారింది. సెక్యులరిజం పేరిట స్వార్థ రాజకీయాల్ని పెంచి పోషించే పార్టీలకు చెక్ చెప్పేలా వ్యవహరించాల్సిన అవసరం ఉన్నా.. అలాంటి విషయాల్లో అనుసరించాల్సిన వ్యూహం పక్కాగా లేకపోవటంతో హిందుత్వం అంటే అదేదో భూతమన్న భావన కలిగించేలా వ్యవహరిస్తున్నారు.

తాజాగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న జేఎన్ యూ వర్సిటీ విద్యార్థి సంఘం నేత కన్నయ్య కుమార్.. దేశ ద్రోహం ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉమర్ ఖలీద్ లపై హిందుత్వ వాదులు ఫత్వా తరహా ప్రకటన ఒకటి చేశారు. ఉత్తరప్రదేశ్ లోని లోకల్ రాజకీయ పార్టీ అయిన యూపీ నవనిర్మాణ సేన ఒక వార్నింగ్ ఇచ్చింది. మార్చి 31 లోపు కన్నయ్య.. ఉమర్ ఖలీద్ లు ఢిల్లీ విడిచి వెళ్లాలని.. లేదంటూ జేఎన్ యూ క్యాంపస్ మీద దాడి చేసి హతమారుస్తామని యూపీ నవ నిర్మాణ సేన జాతీయ అధ్యక్షుడు అమిత్ జ్ఞానీ వార్నింగ్ ఇచ్చారు.

భారత సైన్యంపై కన్నయ్య కుమార్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యల్ని ఆయన తీవ్రస్థాయిలో ఖండించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు జమ్మూకాశ్శీర్ లో సైనికులు యువతులను సామూహిఖ మానభంగం చేశారంటూ దారుణ వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో.. కన్నయ్యను చంపేస్తానని.. అమిత్ హెచ్చరిస్తున్నారు. ఒకవేళ చంపటం కుదరకపోతే తాను రాజకీయాలకు దూరం అవుతానని స్పష్టం చేశారు. దుర్గాష్టమి లోపు వారిద్దరిని కాల్చిచంపుతానని చెబుతున్నారు. ఈ తరహా వ్యాఖ్యలు ఏ మాత్రం మంచివి కావన్న విషయం అమిత్ కు చెప్పేవారెవరు..?