Begin typing your search above and press return to search.

రాహుల్ డేరింగ్ స్టేట్ మెంట్ విన్నారా?

By:  Tupaki Desk   |   31 Jan 2018 11:47 AM GMT
రాహుల్ డేరింగ్ స్టేట్ మెంట్ విన్నారా?
X
కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ అప్పుడే ఎన్నిక‌ల బ‌రిలోకి దిగిపోయిన‌ట్లుగా క‌నిపిస్తోంది. మొన్న‌టి గుజ‌రాత్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ప్ర‌ధాని న‌రేంద్ర మోదీకి ముచ్చెమ‌ట‌లు ప‌ట్టించిన రాహుల్‌... ఇప్పుడు దేశంలోని ప‌లు రాష్ట్రాల‌కు జ‌ర‌గ‌నున్న ఎన్నికల్లోనూ బీజేపీకి చుక్కలు చూపించ‌డం ఖాయంగానే క‌నిపిస్తోంది. ఎన్నిక‌ల షెడ్యూల్ వెలువ‌డిన రాష్ట్రాల్లో త‌మ పార్టీ అభ్య‌ర్థుల విజ‌యం కోసం నిర్వ‌హిస్తున్న ప్ర‌చారాన్ని ఇప్ప‌టికే ప్రారంభించిన రాహుల్ గాంధీ... నేడు మేఘాల‌య‌కు వెళ్లారు. అక్క‌డ లాంఛ‌నంగా ఎన్నిక‌ల ప్ర‌చారాన్ని ప్రారంభించేసిన రాహుల్‌... త‌మ పార్టీని గెలిపించాల‌ని అక్క‌డి ప్ర‌జ‌ల‌కు విజ్ఞ‌ప్తి చేశారు. అదే స‌మ‌యంలో కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ స‌ర్కారుపై ఆయ‌న నిప్పులు చెరిగారు. వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల అంశాన్ని కూడా ప్ర‌స్తావించిన రాహుల్‌... తాము అధికారంలోకి రావ‌డం ఖాయ‌మ‌ని, అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే ఇప్పుడు కొత్త‌గా అమ‌ల్లోకి వ‌చ్చిన గూడ్స్ అండ్ స‌ర్వీస్ ట్యాక్స్ (జీఎస్టీ)ని స‌మూలంగా మార్చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. సంక్లిష్టంగా ఉన్న జీఎస్టీ ప‌న్ను విధానాన్ని స‌ర‌ళ‌త‌రం చేస్తామ‌ని కూడా రాహుల్ పేర్కొన్నారు.

ఇదిలా ఉంటే... యూపీఏ అధికారంలో ఉండ‌గానే జీఎస్టీ బిల్లు రూప‌క‌ల్ప‌న‌కు అడుగులు ప‌డిన విష‌యం తెలిసిందే. అయితే పార్లమెంటులో జీఎస్టీ బిల్లుకు ఆమోదం ల‌బించే దిశ‌గా కాంగ్రెస్ పార్టీ చ‌ర్య‌లు చేప‌ట్టే లోగానే... 2014 ఎన్నిక‌లు ముంచుకొచ్చేశాయి. ఎన్నిక‌ల హ‌డావిడిలో ప‌డిపోయిన యూపీఏ... ఆ బిల్లును అంత‌గా ప‌ట్టించుకున్న పాపాన పోలేదు. ఈలోగా 2014లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని యూపీఏ ఘోర ప‌రాజ‌యం పాలు కావ‌డం, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ స‌ర్కారు అధికారం చేప‌ట్ట‌డం జ‌రిగిపోయింది. యూపీఏ క‌దిపిన పన్నుల విధాన‌మే అయిన‌ప్ప‌టికీ... దానిని అమ‌లు చేసే విష‌యంలో బీజేపీ స‌ర్కారు ఎలాంటి బేష‌జాల‌కు పోలేద‌నే చెప్పాలి. అయితే.. యూపీఏ హ‌యాంలో రూపొందిన బిల్లుకు ఎన్డీఏ ప‌లు మార్పులు చేర్పులు చేసింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

ఈ నేప‌థ్యంలో జీఎస్టీని త‌మ పార్టీ ప్ర‌భుత్వ‌మే ప్ర‌తిపాదించినా... ఆ బిల్లుకు మార్పులు చేర్పులు చేశార‌ని ఆరోప‌ణ‌లు గుప్పించిన రాహుల్ గాంధీ... జీఎస్టీని గ‌బ్బ‌ర్ సింగ్ ట్యాక్ప్‌ గా అభివ‌ర్ణించిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఒక‌వేళ కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని యూపీఏ అధికారంలోకి వ‌స్తే... రాహుల్ ప్ర‌ధాని కావ‌డం ఖాయ‌మేన‌ని - అప్పుడు జీఎస్టీ రూపురేఖ‌లు మారిపోవ‌డ‌మో - లేదంటే స‌ద‌రు ప‌న్ను విధానాన్ని ఏకంగా ఎత్తివేయ‌డమో జ‌రుగుతుంద‌న్న వాద‌న వినిపిస్తోంది. ఈ దిశ‌గానే యోచిస్తున్న రాహుల్ కూడా తాము అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే సంక్లిష్టంగా ఉన్న జీఎస్టీ ప‌న్ను విధానాన్ని పూర్తిగా స‌ర‌ళీకృతం చేసేస్తామ‌ని చెప్పారు. మ‌రి రాహుల్ వ్యాఖ్య‌ల‌పై బీజేపీ స‌ర్కారు ఎలా స్పందిస్తుందో చూడాలి.