Begin typing your search above and press return to search.

శ్రీదేవికి ఈసారి షాకేనా?

By:  Tupaki Desk   |   19 July 2022 2:30 AM GMT
ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధాని ప్రాంతం ఉన్న తాడికొండ నియోజ‌క‌వ‌ర్గంలో ఈసారి ప్ర‌స్తుత వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఉండ‌వ‌ల్లి శ్రీదేవికి సీటు ద‌క్క‌ద‌నే చ‌ర్చ జోరుగా సాగుతోంది. వైద్యురాలుగా ఉన్న శ్రీదేవి 2019లో గుంటూరు జిల్లా తాడికొండ ఎస్సీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే ఆరంభంలోనే ప‌లు వివాదాల్లో చిక్కుకున్నారు.

ఆమె అనుచరులే పేకాట శిబిరాలు నిర్వ‌హిస్తున్నార‌ని విమ‌ర్శ‌లు చెల‌రేగాయి. ముఖ్యంగా సొంత పార్టీ నేత‌లే ఆమెపై బ‌హిరంగంగా మీడియా స‌మావేశాలు పెట్టి నిప్పులు చెరిగారు. ఎమ్మెల్యే శ్రీదేవి వేధిస్తోంద‌ని.. ఆమె వేధింపులు తాళ‌లేక ఆత్మ‌హ‌త్య‌కు చేసుకుంటాన‌ని మండ‌ల స్థాయి నేత ఒక‌రు సోష‌ల్ మీడియాలో పెట్టిన వీడియో తీవ్ర స్థాయిలో వైర‌ల్ అయ్యింది.

మ‌రోవైపు త‌మ స‌మ‌స్య‌ల‌ను ప‌ట్టించుకోవ‌డం లేద‌ని రాజ‌ధాని రైతులు ఆమెపై తీవ్ర ఆగ్ర‌హంతో ఉన్నారు. రాజ‌ధాని ప్రాంతం ఉన్న తుళ్లూరు, మేడికొండూరు, తాడికొండ, ఫిరంగిపురం మండ‌లాలు ఈ నియోజ‌క‌వ‌ర్గంలో ఉన్నాయి. దీంతో ఆమెను రాజ‌ధాని రైతులు నిల‌దీస్తున్నారు.

ఇంకోవైపు కృష్ణాన‌దీ నియోజ‌క‌వ‌ర్గంలో గుండా సాగుతోంది. ఈ నేప‌థ్యంలో ఇసుక తవ్వ‌కాల విష‌యంలో ఉండ‌వ‌ల్లి శ్రీదేవికి, బాప‌ట్ల ఎంపీ నందిగం సురేష్ కి మ‌ధ్య తీవ్ర స్థాయి విభేదాలు ఉన్నాయి. అటు శ్రీదేవి, ఇటు నందిగం సురేష్ ఇద్ద‌రూ మాదిగ సామాజిక‌వ‌ర్గానికి చెందిన‌వారే. నందిగం సురేష్ స్థానిక ఎంపీ కాన‌ప్ప‌టికీ ఆయ‌న స్వగ్రామం తాడికొండ నియోజ‌క‌వ‌ర్గంలోనే ఉంది. ఇసుక తవ్వ‌కాల‌తో ఎంపీ, ఆయ‌న అనుచ‌రులు భారీగా వెన‌కేసుకుంటున్నార‌ని శ్రీదేవి పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేసిన‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి. అంతేకాకుండా త‌న నియోజ‌క‌వ‌ర్గంలో వేలుపెడుతూ త‌నపై అస‌మ్మ‌తిని ఎగ‌దోస్తున్నార‌ని ఫిర్యాదు చేశారు.

ఈ నేప‌థ్యంలో తాడికొండ‌లో రానున్న ఎన్నిక‌ల్లో బాప‌ట్ల ఎంపీ నందిగం సురేష్‌, మాజీ మంత్రి , ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య‌వ‌ర‌ప్ర‌సాద్‌, గుంటూరు జెడ్పీ చైర్‌ప‌ర్స‌న్ హెనీ క్రిస్టియానా పోటీ చేయాల‌ని చూస్తున్నారు. ఉండ‌వ‌ల్లి శ్రీదేవి స్థానికంగానూ అందుబాటులో ఉండ‌టం లేద‌ని.. ఎక్కువ హైద‌రాబాద్ లోనే ఉంటున్నార‌ని చెబుతున్నారు. ఈ నేప‌థ్యంలో ఈసారి శ్రీదేవికి టికెట్ రాద‌ని అస‌మ్మ‌తి వ‌ర్గం ప్ర‌చారం చేస్తోంద‌ని అంటున్నారు.

మ‌రోవైపు డొక్కా మాణిక్య‌వ‌ర‌ప్ర‌సాద్ 2004, 2009లలో తాడికొండ‌ నుంచి కాంగ్రెస్ త‌ర‌పున గెలుపొందారు. వివాద‌ర‌హితుడిగా, మృదు స్వ‌భావిగా డొక్కాకు పేరుంది. కొంత‌కాలం మంత్రిగానూ ప‌నిచేశారు. ప్ర‌స్తుతం వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీగా ఉన్నారు.

మ‌రోవైపు త‌న‌కు తాడికొండ టికెట్ ఇస్తాన‌ని ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ హామీ ఇచ్చారంటూ గుంటూరు జెడ్పీ చైర్‌ప‌ర్స‌న్ హెనీ క్రిస్టియానా చెప్పుకుంటున్నార‌ని తెలుస్తోంది. తాడికొండ‌లో ప‌ర్య‌టిస్తూ.. పార్టీ బ‌లోపేతానికి కృషి చేయాల‌ని సీఎం ఆదేశించార‌ని ఆమె అంటున్నారు. ఇక సిటింగ్ ఎమ్మెల్యే ఉండ‌వ‌ల్లి శ్రీ‌దేవి మాత్రం మ‌రోసారి టికెట్ త‌న‌కే అని ధీమాగా ఉన్నారు.

ఇక ఎంపీ నందిగం సురేష్ ముఖ్య‌మంత్రికి అత్యంత స‌న్నిహితుడిగా పేరుంది. అతి సాధార‌ణ కార్య‌క‌ర్త‌గా ఉన్న త‌న‌ను ఎంపీని చేసిన ఘ‌న‌త జ‌గ‌న్ దేన‌ని వీలున్న‌ప్పుడ‌ల్లా నందిగం సురేష్ ఆకాశానికి ఎత్తుతున్నారు. ఈసారి అసెంబ్లీకి పోటీ చేసి మంత్రి కావాల‌ని ఉబ‌లాట‌ప‌డుతున్నార‌ని తెలుస్తోంది.