Begin typing your search above and press return to search.

కాంగ్రెస్‌ కు ఊహించ‌ని మ‌ద్ద‌తు ద‌క్కిందే!

By:  Tupaki Desk   |   3 Nov 2017 7:20 AM GMT
కాంగ్రెస్‌ కు ఊహించ‌ని మ‌ద్ద‌తు ద‌క్కిందే!
X
గుజరాత్‌ ఎన్నికల్లో నిర్ణాయ‌క శ‌క్తిగా భావిస్తున్న పాటిదార్ల నుంచి కాంగ్రెస్ పార్టీకి ఊహించ‌ని మ‌ద్ద‌తు ల‌భించింది. ప‌టేళ్ల రిజ‌ర్వేష‌న్ల‌పై ఆ పార్టీ వైఖ‌రి స్ప‌ష్టం చేయ‌కుండానే ప‌టీదార్ ఉద్యమనేత హార్దిక్‌ పటేల్ త‌మ మ‌ద్ద‌తు హ‌స్తానికేన‌ని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ పార్టీ పాటిదార్ల కు బహిరంగంగానే మద్దతు తెలియజేస్తున్నందునే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు. ‘ఇప్పుడు మా పటేళ్లంతా బీజేపీ పతనానికే మద్దతు తెలుపుతున్నారు. ప్రజలు తెలివైన వారు. బీజేపీకి ఓటు వేయ‌కూడ‌ద‌నుకుంటే.. ఆ ఓటు ఎవరికి వేయాలో (పరోక్షంగా కాంగ్రెస్‌ ను ప్రస్తావిస్తూ) వారికి తెలుసు’ అని హార్దిక్ ప‌టేల్‌ అన్నారు. త‌ద్వారా రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీని సాగనంపాలని పాటిదార్లకు పిలుపునిచ్చారు. రిజర్వేషన్లు 50% మించకూడదన్న సుప్రీంకోర్టు తీర్పు మేరకు పటేళ్లకు ఓబీసీ హోదా కల్పించే విషయమై ఎటువంటి హామీ రాకుండానే ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీకి లొంగిపోయారని హార్దిక్‌ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆయ‌న‌ అమ్ముడు పోయారని ఆరు పాటిదార్ల సంఘాలు దుమ్మెత్తిపోశాయి.

అయితే త‌న నిర్ణ‌యాన్ని హార్దిక్ ప‌టేల్ స‌మ‌ర్థించుకున్నారు. 2015లో ఓబీసీ కోటాలో రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ పాటిదార్లు ఆందోళన ప్రారంభించినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ త‌మ‌కు మద్దతుగా నిలిచిందని గుర్తు చేశారు. గురువారం ఆయన గుజ‌రాత్‌ లోని సౌరాష్ట్ర ప్రాంతంలో సుడిగాలి పర్యటన చేశారు. ఈ సంద‌ర్భంగా ఒక వార్తా చానెల్‌ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ‘అధికారంలో ఉన్న బీజేపీని ఇంటికి సాగనంపాలని నా సామాజిక వర్గం ప్రజలకు పిలుపునిచ్చాను. బీజేపీ ఓడిపోవడానికే నా సామాజిక వర్గం ప్రత్యక్షంగా మద్దతు ఇస్తుంది' అని చెప్పారు.

మీరు కాంగ్రెస్‌కు ఓటేయాల‌ని పిలుపునిచ్చారా? అని ప్రశ్నిస్తే హార్దిక్ పటేల్ స్పందిస్తూ.. ‘ప్రజలు చాలా తెలివైన వారు. నేను బీజేపీని ఓడించాలని చెబితే.. ఎవరికి ఓటేయాలో వారికి తెలుసు' అని చెప్పారు. తాను అమ్ముడుపోయానని కొన్ని పాటిదార్ల‌ సంఘాలు చేసిన ఆరోపణలను కొట్టిపారేశారు. వారు పాటిదార్లకు నిజమైన ప్రతినిధులు కార‌ని, వారి వెనుక‌ బీజేపీ నేత‌లున్నార‌ని ఆరోపించారు. ఎప్ప‌టి నుంచో బాస‌ట‌గా నిలిచిన పాటిదార్లకు బీజేపీ ద్రోహం చేసిందని విమ‌ర్శించారు.మ‌రోవైపు.. పాటిదార్ల రిజర్వేషన్ల అంశంపై హార్దిక్ పటేల్‌ సారథ్యంలో ‘పాస్' ప్రతినిధి బృందంతో చర్చలు జరిపేందుకు కాంగ్రెస్ సీనియర్ నేత‌ కపిల్ సిబాల్ వచ్చే వారం గుజరాత్ రానున్న‌ట్లు స‌మాచారం. గ‌త 22 ఏళ్లుగా రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మ‌రోసారి అధికారంలోకి వ‌చ్చి గుజ‌రాత్‌పై త‌న ప‌ట్టు నిలుపుకొనేలా ఆ పార్టీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్‌ షా వ్యూహ‌ర‌చ‌న చేస్తున్నారు.