Begin typing your search above and press return to search.

ఉస్మానియాది పెద్ద జబ్బేం కాదని తేల్చిన ఇంటాక్

By:  Tupaki Desk   |   10 Aug 2015 4:53 AM GMT
ఉస్మానియాది పెద్ద జబ్బేం కాదని తేల్చిన ఇంటాక్
X
జలుబు.. దగ్గు.. జ్వరం లాంటి జబ్బులకే బైపాస్ సర్జరీ చేయాల్సిన అవసరం ఉందా? ప్రస్తుతం హైదరాబాద్ లోని చారిత్రక ఉస్మానియా ఆసుపత్రి విషయంతో తెలంగాణ సర్కారు ఇదే రీతిలో వ్యవహరిస్తుందన్నది తాజా ఆరోపణ. అవసరం లేని దాన్ని.. కూల్చేయటమే లక్ష్యంగా పెట్టుకోవటంపై ఇప్పటికే పలు ప్రజాసంఘాలు.. సీనియర్ వైద్యులు.. ఉస్మానియా అలూమీతో పాటు.. పలువురు ప్రైవేట్ ఆర్కిటెక్ట్ లు సైతం ఉస్మానియా ఆసుపత్రి కూలిపోయే పరిస్థితుల్లో లేదని.. నిర్మాణ పరంగా బలంగా ఉందన్న వాదనను వినిపించటం తెలిసిందే.

తాజాగా ఇండియన్ నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్ అండ్ కల్చర్.. సింఫుల్ గా చెప్పాలంటే ఇంటాక్ సంస్థ ప్రతినిధులు ఉస్మానియా ఆసుపత్రి ని పరిశీలించి.. అధ్యయనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నిర్మాణ పరంగా ఉస్మానియా ఆసుపత్రి మంచి స్థితి లోనే ఉన్నట్లుగా తేల్చారు.

ఇంటాక్ హైదరాబాద్ చాఫ్టర్ సభ్యులు తాజాగా ఉస్మానియా ను సందర్శించి.. దాని నాణ్యత అంశంపై మదింపు చేశారు. నిర్మాణ పరంగా ఉస్మానియా ఆసుపత్రి మంచి స్థితిలో ఉందని స్పష్టం చేశారు. హెరిటేజ్ సంపదను తాము కాపాడతామని.. ఇందుకోసం ప్రభుత్వంతో చర్చలు జరుపుతామని.. హెరిటేజ్ సందపను కాపాడాలని కోరతామని.. అప్పటికి ప్రభుత్వం తన ప్రయత్నాలు మానుకోకపోతే.. కోర్టుల ద్వారా అడ్డుకొని ఆసుపత్రిని కాపాడతామని చెబుతున్నారు.

తాను ఏమనుకుంటారో.. అది పూర్తయ్యేవరకూ మొండిపట్టుదలతో వ్యవహరించే కేసీఆర్ లాంటి నేతతో ఇంటాక్ సభ్యులు తాము అనుకున్నది సాధిస్తారా అంటే.. వారి ట్రాక్ రికార్డు చూస్తే ఇంటాక్ గత చరిత్ర తెలుస్తుందని చెబుతున్నారు.

ఉస్మానియా ఆసుపత్రి మాదిరే.. కర్ణాటక లోని చారిత్రక సంపద అయిన అటార కచేరిని కాపాడుకునే విషయంలో ఇంటాక్ చేసిన పోరాటాన్ని గుర్తు చేస్తున్నారు. ఈ చారిత్రక కట్టడాన్ని 1980లలో కూల్చాలని ప్రయత్నించటం.. దాన్ని హైకోర్టుకు వెళ్లి నిలువరించటంతో పాటు.. పాత కట్టడాల విషయంలో విస్పష్టమైన తీర్పు వచ్చేలా చేశారన్న పేరుంది. కానీ.. మారిన పరిస్థితుల్లో తెలంగాణలోకూడా ఇంటాక్ తన సత్తా చాటుతుందా? అన్నది ప్రశ్నార్థకంగా మారిందన్న భావన ఉంది.