Begin typing your search above and press return to search.

టీఆర్ ఎస్ ను ఓడించేందుకు సీటు త్యాగం!

By:  Tupaki Desk   |   4 Aug 2018 8:22 AM GMT
టీఆర్ ఎస్ ను ఓడించేందుకు సీటు త్యాగం!
X
రాజకీయాల్లో బలం - బలగం ఉన్నప్పుడే విజయం సాధిస్తాం.. దాన్ని బేస్ చేసుకునే పోటీ పడాలి. మనకంటే బలవంతుడైన వాడున్నప్పుడు బలాన్ని పెంచుకోవాలి.. లేదంటే తప్పుకొని మనకంటే బలవంతులకు సైడ్ ఇవ్వాలి.. ఇప్పుడీ స్ట్రాటజీని బాగా వంటిపంటించుకున్నాడు సీనియర్ కాంగ్రెస్ నేత., వనపర్తి సిట్టింగ్ ఎమ్మెల్యే చిన్నారెడ్డి. 2014 ఎన్నికల్లో ఈయన ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్ రెడ్డి పై చిన్నారెడ్డి గెలిచాడు. కానీ ఇప్పుడు 2019 ఎన్నికల వేళ నిరంజన్ రెడ్డి చాలా బలం పుంజుకొని గెలుపు అవకాశాలను మెరుగుపరుచుకున్నాడు. ఈసారి ఎలాగైనా గెలవడానికి శాయశక్తుల ప్రయత్నిస్తున్నాడు.

బలమైన నిరంజన్ రెడ్డిని వరుసగా రెండోసారి ఓడించడం కష్టమని చిన్నారెడ్డి భావిస్తున్నాడు. ప్రస్తుతం వనపర్తి నియోజకవర్గంలో త్రిముఖ పోరు నెలకొంది. కాంగ్రెస్ నుంచి చిన్నారెడ్డి - టీఆర్ ఎస్ నుంచి నిరంజన్ రెడ్డి - టీడీపీ నుంచి రావుల చంద్రశేఖర్ రెడ్డి బరిలో ఉన్నారు. ముగ్గురు ధీటైన అభ్యర్థులే కావడంతో పోటీ తీవ్రంగా ఉంది. ఈ నేపథ్యంలో రావుల పోటీపడితే ఓట్లు చీలి తాను ఓడిపోతానని నిర్ణయించుకున్న చిన్నారెడ్డి ఏకంగా తాను తప్పుకొని రావులను వనపర్తి నుంచి పోటీచేయించాలని ప్రతిపాదన చేశాడట.. కానీ కాంగ్రెస్ లో చేరితేనే అని మెలిక పెట్టాడట.. దీనికి రావుల ఒప్పుకోలేదని సమాచారం.

అయితే వచ్చే 2019 ఎన్నికల్లో కాంగ్రెస్-టీడీపీ పొత్తు పెట్టుకుంటే వనపర్తి సీటును రావులకు చిన్నారెడ్డి వదులకుంటాడా లేదా అన్నది సస్పెన్స్ గా మారింది. ఎలాగైనా నిరంజన్ రెడ్డిని ఇక్కడ గెలవనీయకూడదని కంకణం కట్టుకున్న చిన్నారెడ్డి తన సీటును త్యాగం చేయడానికి ముందుకొచ్చినా రావుల కలవడానికి ఒప్పుకోకపోవడంతో ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో ఎలా ముందుకెళ్లాలని తీవ్రంగా ఆలోచిస్తున్నాడట.. చూడాలి మరి వనపర్తిలో చివరకు ఎవరు పోటీచేస్తారు. ఎవరు గెలుస్తారనేది ఆసక్తిగా మారింది..