Begin typing your search above and press return to search.

అసెంబ్లీకి టీడీపీ ఎంఎల్ఏలు హాజరవుతారా ? లేదా ?

By:  Tupaki Desk   |   25 Feb 2022 6:16 AM GMT
అసెంబ్లీకి టీడీపీ ఎంఎల్ఏలు హాజరవుతారా ? లేదా ?
X
మార్చి మొదటివారంలో మొదలయ్యే బడ్జెట్ సమావేశాలకు హాజరు కావాలా వద్దా అనే విషయంలో తెలుగుదేశంలో పెద్ద చర్చే జరిగింది. చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో సమావేశమైన ముఖ్య నేతల మధ్య అసెంబ్లీకి హాజరయ్యే విషయమై సుదీర్ఘమైన చర్చ జరిగింది. దీనికి కారణం ఏమిటంటే గత సమావేశాల్లో వైసీపీ-టీడీపీ సభ్యుల మధ్య జరిగిన గొడవ అందరికీ తెలిసిందే. ఆ సమయంలో చంద్రబాబు మాట్లాడుతూ తాను ముఖ్యమంత్రి హోదాలో మాత్రమే మళ్ళీ సభలోకి అడుగుపెడతానని భీషణ ప్రతిజ్ఞ చేశారు.

మరి పార్టీ అధినేత హాజరు కానపుడు మిగిలిన సభ్యులు ఏమి చేయాలి ? అనేది పెద్ద అనుమానం. చంద్రబాబు హాజరు కాకపోతే మిగిలిన ఎంఎల్ఏలు కూడా హాజరు కారని అప్పట్లోనే పెద్ద ప్రచారం జరిగింది. లేదు లేదు అసెంబ్లీకి చంద్రబాబు మాత్రమే హాజరుకారని మిగిలిన వాళ్ళు హాజరవుతారనే కౌంటర్ ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయమై ఇటు చంద్రబాబు కానీ అటు అచ్చెన్నాయుడు కూడా ఏమీ తేల్చలేదు.

అలాంటిది ఇపుడు ఇదే విషయమై చర్చ జరిగింది. మెజారిటీ నేతలైతే అసెంబ్లీకి హాజరు కావాల్సిందే అని చెప్పారు. చంద్రబాబు హాజరు కానంత మాత్రాన ఏమైంది ? మిగిలిన సభ్యులు హాజరవ్వాల్సిందే అని అభిప్రాయపడ్డారట. రాష్ట్రంలో అనేక సమస్యలున్నపుడు సభకు వెళ్ళకపోతే చర్చలు జరిగే అవకాశం ఉండదని నేతలు చెప్పారట. అయితే మరికొందరేమో అసెంబ్లీకి హాజరైనా సమస్యలను చర్చించే అవకాశం అధికార పార్టీ ఇస్తుందా అనే డౌటును వ్యక్తం చేశారట.

అందరి అభిప్రాయాలు విన్న చంద్రబాబు సమావేశాన్ని వాయిదా వేశారట. తొందరలోనే తెలుగుదేశం పార్టీ శాసనసభాపక్ష సమావేశం నిర్వహించి అందులో నిర్ణయం తీసుకుందామని చంద్రబాబు చెప్పారు. మొత్తానికి అసెంబ్లీకి వెళ్ళాలని మెజార్టీ నేతలు అభిప్రాయపడ్డారు. మరి ఎంఎల్ఏలు ఏమి చెబుతారో చూడాలి. వైసీపీ అవకాశం ఇచ్చినా ఇవ్వకపోయినా సమస్యలు లేవనెత్తేందుకు ప్రయత్నించటం తప్ప మనం చేయగలిగేది ఏమీ లేదని నేతలంటున్నారు.