Begin typing your search above and press return to search.

తెలంగాణ రాజ‌కీయం త‌ల‌కిందులుగా అవుతుందా?

By:  Tupaki Desk   |   18 April 2022 9:35 AM GMT
తెలంగాణ రాజ‌కీయం త‌ల‌కిందులుగా అవుతుందా?
X
తెలంగాణ రాజ‌కీయాలు ర‌స‌వ‌త్త‌రంగా మారుతున్నాయి. అధికార టీఆర్ఎస్‌కు పోటీగా బీజేపీ, కాంగ్రెస్ పుంజుకోవ‌డంపై దృష్టి సారించాయి. దీంతో త్రిముఖ పోటీ త‌ప్పేలా లేదు. కానీ జాతీయ స్థాయిలో కాంగ్రెస్ ప‌రిణామాల నేప‌థ్యంలో తెలంగాణ రాజ‌కీయాలు మారే అవ‌కాశం ఉంద‌ని నిపుణులు అంటున్నారు.

ప్ర‌ముఖ ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిషోర్ కాంగ్రెస్లో చేరితే అప్పుడు రాష్ట్ర రాజ‌కీయాలు మ‌రిన్ని మ‌లుపులు తిర‌గ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. ఇప్ప‌టికే కాంగ్రెస్ హైక‌మాండ్‌తో ప్ర‌శాంత్ కిషోర్ స‌మావేశ‌మ‌య్యారు. ఆ పార్టీ తిరిగి పుంజుకోవ‌డం కోసం సూచ‌న‌లు చేశారు. మ‌రోవైపు ఆయ‌న త్వ‌ర‌లోనే హ‌స్తం గూటికి చేరే అవ‌కాశం ఉంద‌ని మ‌రోసారి ప్ర‌చారం జోరందుకుంది.

కాంగ్రెస్‌, టీఆర్ఎస్ పొత్తు..ప్ర‌స్తుతం తెలంగాణ‌లో అధికార టీఆర్ఎస్ కోసం పీకే టీమ్ ప‌నిచేస్తోంది. కేసీఆర్‌ను మూడోసారి సీఎం చేసేందుకు పీకే వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆయ‌న కాంగ్రెస్‌లో చేరితే కేసీఆర్ కోసం ప‌ని చేయ‌రు. అప్పుడు ఆయ‌న స‌ల‌హాలు కాంగ్రెస్ అధిష్ఠానం పాటిస్తుంది. ఈ నేప‌థ్యంలో బీజేపీపై ప‌గ‌తో ఉన్న పీకే.. తెలంగాణ‌లో ఆ పార్టీ పుంజుకోకుండా అడ్డుకునే అవ‌కాశం ఉంది. అందుకు టీఆర్ఎస్‌, కాంగ్రెస్ పొత్తు తెర‌పైకి తెచ్చే వీలుంద‌ని విశ్లేష‌కులు భావిస్తున్నారు. అందుకు కోమ‌టిరెడ్డి, ఉత్త‌మ్ కుమార్ రెడ్డి, వీహెచ్ లాంటి సీనియ‌ర్లు ఒకే చెప్పే అవ‌కాశం ఉంది. ఎందుకంటే వీళ్ల‌కు రేవంత్ రెడ్డి సీఎం కావొద్దు అని ఉంద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి.

రేవంత్ క‌ష్టం వృథా..ఒక‌వేళ పీకే సూచ‌న మేర‌కు తెలంగాణ‌లో కాంగ్రెస్‌, టీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంటే అప్పుడు టీపీసీసీ అధ్య‌క్షుడిగా రేవంత్ రెడ్డి క‌ష్టం మొత్తం వృథా అయిన‌ట్లే. పొత్తులో భాగంగా మ‌ళ్లీ సీఎం కేసీఆర్ కావ‌డం ఖాయ‌మ‌నే అభిప్రాయాలున్నాయి. ఒక‌వేళ కాంగ్రెస్ పార్టీకి మంచి ఫ‌లితాలు వ‌చ్చినా రేవంత్ సీఎం అయ్యే అవ‌కాశ‌మే ఉండ‌దు. ఒక‌వేళ ఈ రెండు పార్టీల పొత్తు నేప‌థ్యంలో ఎన్నిక‌ల నాటికి రేవంత్‌కు బీజేపీ నుంచి పిలుపు వ‌స్తే ఆయ‌న ఏం చేస్తారు అనేది కూడా ఆసక్తిక‌రంగా మారింది.

మ‌రోవైపు బీజేపీ జోరుకు బ్రేక్ వేసేందుకు పీకే ప్ర‌య‌త్నిస్తున్నారు. రాష్ట్రంలో ఆయ‌న టీమ్ సేక‌రించిన స‌మాచారం ప్ర‌కారం బీజేపీ హిందుత్వాన్ని బ‌లంగా ప్ర‌చారం చేసే అవ‌కాశం ఉంది. ఆ పార్టీని ప‌రోక్షంగా ఎంఐఎం బీ టీమ్‌గా ప‌ని చేస్తుంద‌ని పీకే అనుకుంటున్నార‌ని టాక్‌. అలా అయితే కాంగ్రెస్‌కే దెబ్బ ప‌డుతుంది కాబ‌ట్టి టీఆర్ఎస్‌తో పొత్తు ఉండ‌ద‌ని రాష్ట్ర వ్య‌వ‌హారాల ఇంఛార్జీ మాణికం ఠాగూర్ చెబుతున్నారు.

కానీ ఎన్నిక‌ల నాటికి ప‌రిస్థితి ఎలా మారుతుందో చెప్ప‌లేమని విశ్లేష‌కులు అంటున్నారు. ఇక కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్‌రెడ్డి పార్టీలోనే కొన‌సాగుతాన‌ని క‌చ్చితంగా చెప్ప‌డం లేదు. టీఆర్ఎస్‌పై పోరాడే పార్టీలోకి వెళ్తాన‌ని ఆయ‌న గ‌తంలో స్ప‌ష్టం చేశారు. ఒక‌వేళ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్‌, టీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంటే ఆయ‌న క‌చ్చితంగా బీజేపీలో చేరే అవ‌కాశం ఉంది. మ‌రి ఎలాంటి ప‌రిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి.