Begin typing your search above and press return to search.

అలిగిన ఆ నేత‌.. బీజేపీలో ఉంటారా?

By:  Tupaki Desk   |   25 March 2022 2:30 AM GMT
అలిగిన ఆ నేత‌.. బీజేపీలో ఉంటారా?
X
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో బీజేపీ ప‌రిస్థితి అంతంత‌మాత్రంగానే ఉంది. ప్ర‌స్తుతం జ‌న‌సేన‌తో పొత్తులో ఉన్న ఆ పార్టీ ఎన్నిక‌ల స‌మ‌యం నాటికి ఏం చేస్తుందో తెలీదు. మ‌రోవైపు టీడీపీతో పొత్తుకు బీజేపీ స‌సేమిరా ఒప్పుకోవ‌డం లేదు. జ‌న‌సేన త‌న మార్గంలో తాను వెళ్తోంది.

ఈ నేప‌థ్యంలో రాష్ట్రంలో బ‌లోపేతం కోసం బీజేపీ ఒంట‌రిగానే అడుగులు వేస్తున్న‌ట్లు క‌నిపిస్తోంది. కానీ ఆ పార్టీల సీనియ‌ర్ నేత‌ల అల‌క‌ల ప‌ర్వం ఇబ్బందిగే మారే ప్ర‌మాదం ఉంద‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు. తాజాగా క‌ర్నూలు జిల్లా సీనియ‌ర్ బీజేపీ నేత బైరెడ్డి రాజ‌శేఖ‌ర్‌రెడ్డి పార్టీ తీరుపై అలిగిన‌ట్లు స‌మాచారం.

క‌డ‌ప‌లో పార్టీ బ‌లోపేతం కోసం ఇటీవ‌ల బీజేపీ అక్క‌డ సీమ‌భేరి స‌భ నిర్వ‌హించింది. కానీ ఈ స‌భ‌లో బైరెడ్డి రాజశేఖ‌ర్‌రెడ్డికి మాట్లాడే అవ‌కాశం ఇవ్వ‌లేదు. రాయ‌ల‌సీమ ప్ర‌గ‌తి కోసం రాజ‌కీయ జీవితాన్ని త్యాగం చేసిన త‌న‌కు మాట్లాడే అవ‌కాశం ఇవ్వ‌క‌పోవ‌డంపై ఆయ‌న ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. కేవ‌లం అధికార పార్టీని రెచ్చ‌గొట్టే ప్ర‌సంగాల‌కే బీజేపీ ప‌రిమితం కావ‌డంపై ఆయ‌న ఆగ్ర‌హం వ్యక్తం చేసిన‌ట్లు స‌మాచారం.

సీమ ఉద్య‌మంలో సుదీర్ఘ అనుభ‌వం క‌లిగిన రాజ‌శేఖ‌ర్‌రెడ్డికి మాట్లాడే అవ‌కాశం ఇవ్వ‌నందుకు వ్య‌క్తిగ‌తంగా సోము వీర్రాజు క్ష‌మాప‌ణ‌లు కూడా చెప్పారు. కానీ అంత‌టితో బైరెడ్డి కోపం చ‌ల్లార‌లేద‌ని తెలిసింది. అందుకే ఆయ‌న ఇటీవ‌ల క‌ర్నూలులో నిర్వ‌హించిన బీజేపీ కార్య‌వ‌ర్గ స‌మావేశాల‌కు ఆయ‌న గైర్హాజ‌ర‌య్యారు.

బీజేపీ ద‌క్షిణాది రాష్ట్రాల ఇంఛార్జీ సుప్ర‌కాశ్‌, రాష్ట్ర ఇంఛార్జీ సునీల్ దియోధ‌ర్‌, మ‌ధుక‌ర్‌, రాష్ట్ర అధ్య‌క్షుడు సోము వీర్రాజు లాంటి కీల‌క నేత‌లు పాల్గొన్న స‌మావేశంలో బైరెడ్డి లేక‌పోవ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. మ‌రోవైపు ఆ స‌భ‌లో బైరెడ్డి త‌న‌య శ‌బ‌రి మాట్లాడేందుకు మైక్ తీసుకుంటే రెండు నిమిషాల్లోనే ముగించాల‌ని అదే జిల్లాకు చెందిన సీనియ‌ర్ నేత అన‌డం కొత్త వివాదానికి దారి తీసింది.

ఇలా వ్య‌వ‌హ‌రించిన నాయ‌కుల తీరు త‌మ కుటుంబాన్ని అవ‌మానప‌ర‌చ‌డ‌మేన‌ని శ‌బ‌రి ఆవేద‌న వ్య‌క్తం చేసిన‌ట్లు స‌మాచారం. ఈ నేప‌థ్యంలో బైరెడ్డి రాజ‌శేఖ‌ర్‌రెడ్డి, శ‌బ‌రి బీజేపీలో కొన‌సాగ‌డంపై అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. వాళ్లు పార్టీలో జ‌రిగే అవ‌మానాన్ని భ‌రించ‌లేక గుడ్‌బై చెప్పే అవ‌కాశం ఉంద‌ని నిపుణులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.