Begin typing your search above and press return to search.

చెంపదెబ్బ వివాదం : ఆ కేంద్రమంత్రిని అరెస్ట్ చేస్తారా !

By:  Tupaki Desk   |   24 Aug 2021 7:32 AM GMT
చెంపదెబ్బ వివాదం : ఆ కేంద్రమంత్రిని అరెస్ట్ చేస్తారా !
X
మహారాష్ట్ర రాజకీయం మరోసారి ఆసక్తిగా మారింది. తాజాగా స్వాతంత్ర దినోత్సవ ప్రసంగంలో దేశానికి స్వాతంత్రం వచ్చిన సంవత్సరం చెప్పడంలో తడబడిన మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రేను చెంపదెబ్బ కొడతానంటూ కేంద్రమంత్రి నారాయణ్ రాణే చేసిన వ్యాఖ్యలతో వివాదం మొదలైంది. స్వాతంత్ర దినోత్సవ ప్రసంగంలో ఉద్ధవ్ థాక్రే స్వాతంత్రం వచ్చిన సంవత్సరం చెప్పేందుకు తడబడిన నేపథ్యంలో తాను అక్కడే ఉంటే లాగి చెంపదెబ్బ కొట్టేవాడినంటూ కేంద్రమంత్రి నారాయణ్ రాణే తాజాగా నిర్వహించిన జన ఆశీర్వాద యాత్రలో వ్యాఖ్యానించారు.

దీనితో ఈ వ్యాఖ్యలు తీవ్ర సంచలనంగా మారాయి. మహారాష్ట్ర ముఖ్యమంత్రిని ఉద్దేశించి కేంద్రమంత్రి చేసిన వ్యాఖ్యలు కావడం, బీజేపీ, శివసేన మధ్య ఉద్రిక్తతలను మరింత పెంచింది. దీంతో నారాయణ్ రాణే వ్యాఖ్యలపై శివసేన కార్యకర్తలు ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ నేప‌థ్యంలో సొంత రాష్ట్రంలో జ‌న అశీర్వాద యాత్ర‌ను చేస్తున్న రాణేను పోలీసులు అరెస్టు చేయ‌వ‌చ్చ‌నే ప్ర‌చారం జరుగుతోంది. దీంతో కేంద్రమంత్రిని మహారాష్ట్ర ప్రభుత్వం అరెస్ట్ చేయిస్తుండటం సంచలనం రేపే అవకాశాలున్నాయి. దీనిపై కేంద్ర హోంశాఖ ఎలా స్పందిస్తుందో చూడాల్సి ఉంది

ప్రధాని నరేంద్ర మోడీ కేబినెట్ తాజా విస్తరణలో చోటు సంపాదించిన నారాయణ రాణేకు దూకుడుగా వ్యాఖ్యలు చేసే నేతగా పేరుంది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రేపై ఆయన చేసిన తాజా వ్యాఖ్యలపై పోలీసులు ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. శివసేన యూత్ వింగ యువసేన నేతల ఫిర్యాదు మేరకు ఈ ఎఫ్ఐఆర్ దాఖలైంది. దీనిపై చర్యల్లో భాగంగా పోలీసులు ఇవాళ రాణే అరెస్టుకు సిద్దమవుతున్నారు. అదే జరిగితే మహారాష్ట్రలో శివసేన, బీజేపీ మధ్య సాగుతున్న వార్ మరింత ముదిరే అవకాశముంది.

ఇదిలా ఉంటే..నారాయ‌న్ రాణే రాజ‌కీయ ప్ర‌స్థాన‌మే శివ‌సేన‌తో మొద‌లైంది. సేన ద్వారానే ఆయ‌న ఎమ్మెల్యే అయ్యారు. అంతే కాదు.. చాలా కాలం కింద‌ట‌ బీజేపీ, సేన సంకీర్ణ ప్ర‌భుత్వంలో ఆయ‌న కొన్ని రోజుల పాటు మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రిగా కూడా చేశారు. ఆ త‌ర్వాత ఠాక్రేల‌తో విబేధించి సేన‌ను వీడారు. కాంగ్రెస్ పార్టీలో చేరారు. అక్క‌డ మంత్రిగా చేశారు. ఆపై సొంత పార్టీ, అటుపై బీజేపీలోకి వెళ్లారు. శివ‌సేన‌లో పుట్టి పెరిగి, ఇప్పుడు ఉద్ధ‌వ్ ఠాక్రే చెంప ప‌గ‌ల గొట్టే వాడినంటూ రాణే చేసిన వ్యాఖ్యలపై శివసేన నేతలు , కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ప్ర‌స్తుతం ఆయ‌న కొంక‌ణ్ ప్రాంతంలోని చిప్లున్‌లో ఉండ‌టంతో రాణెను అరెస్ట్ చేయ‌డానికి నాసిక్ పోలీసులు అక్క‌డి వెళ్లారు. ఈ వివాదంపై నాసిక్ పోలీస్ క‌మిష‌న‌ర్ దీప‌క్ పాండే స్పందించారు. ఇది చాలా తీవ్ర‌మైన అంశం. ఇప్ప‌టికే కేంద్ర మంత్రిపై త‌గిన చ‌ర్య‌లు తీసుకోవ‌డానికి ఓ బృందం వెళ్లింది. ఆయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ కోర్టులో హాజ‌రు ప‌రుస్తాం. కోర్టు నిర్ణ‌యం ప్ర‌కారం ముందుకు వెళ్తాం అని క‌మిష‌న‌ర్ అన్నారు.