Begin typing your search above and press return to search.

మండలి ఎపిసోడ్ లో జగన్ ఆ అప్షన్ కు వెళ్లనున్నారా?

By:  Tupaki Desk   |   27 Jan 2020 4:20 AM GMT
మండలి ఎపిసోడ్ లో జగన్ ఆ అప్షన్ కు వెళ్లనున్నారా?
X
ఒకసారి డిసైడ్ అయితే.. అంతే అన్నట్లుగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీరు ఉంటుందన్న అభిప్రాయం ఉంది. ఏ విషయం మీద ఒక స్థిర నిర్ణయానికి వచ్చే ముందు దాని గురించి వివరంగా సమాచారం సేకరించిన తర్వాత.. వేగంగా నిర్ణయం తీసుకోవటం లో జగన్ ది ప్రత్యేకమైన శైలిగా చెబుతుంటారు. ఏపీ రాజధానిని మూడు నగరాల్లో ఏర్పాటు చేయాలన్న ఆలోచన కావొచ్చు.. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిషు మీడియం ఏర్పాటు చేయాలన్న విషయం లోనూ ఆయన విపరీతమైన వేగాన్ని ప్రదర్శిస్తుంటారు.

తాజాగా శాసనమండలి రద్దు అంశాన్ని ఆయన తీవ్రంగా పరిగణలోకి వచ్చారు. తనను అదే పనిగా చికాకు పెట్టేందుకు.. పాలనకు అడ్డుగా మారిన మండలికి మంగళం పాడేందుకు జగన్ డిసైడ్ అయినట్లు గా చెప్పాలి. ఇందుకోసం సోమవారం ప్రత్యేకంగా మంత్రి మండలి నిర్ణయం తీసుకోవటం తో పాటు.. ఏపీ అసెంబ్లీ సైతం ఈ అంశం మీద తీర్మానం చేసే వీలుందని చెబుతున్నారు.

అయితే.. మండలి రద్దు అంత ఈజీ కాదని.. కేంద్రానికి నేరుగా సంబంధం లేకున్నా.. ఈ ఎపిసోడ్ పూర్తి కావాలంటే కేంద్ర ప్రభుత్వ సానుకూలత చాలా అవసరమన్న వాదన వినిపిస్తోంది. ఒక అంచనా ప్రకారం మండలి ని రద్దు చేయించాలంటే దాదాపు రెండేళ్లు పడుతుందన్న మాట వినిపిస్తున్నా.. వాస్తవంలో అంత కంటే తక్కువ సమయం లోనూ మండలిని మూసేయొచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

రాజధానుల విషయంలో కేంద్రం జోక్యం చేసుకోకుండా ఉండటమే కాదు.. తాను డిసైడ్ అయినట్లుగా మూడు రాజధానుల విషయంలో తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్న విషయాన్ని తన ప్రకటనతో స్పష్టం చేసిందని చెప్పాలి. ఇలాంటి వేళ.. రాష్ట్ర ప్రభుత్వం డిసైడ్ అయిన మండలి రద్దు విషయంలోనూ కేంద్రం తన వంతు సాయాన్ని అందిస్తుందని భావిస్తున్నారు. ఇందుకోసం అవసరమైతే ప్రధాని మోడీ తో పాటు.. కేంద్రమంత్రి అమిత్ షా తో ప్రత్యేకం గా భేటీ అయ్యేందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి డిసైడ్ అయినట్లు గా తెలుస్తోంది.

మండలికి మంగళం పాడించాలన్న పట్టుదల తో ఉన్న సీఎం జగన్.. తాను అనుకున్నట్లే రాష్ట్ర పెద్దల సభను రద్దు చేయాలనుకుంటే.. అందుకు తగ్గట్లే కేంద్రం సైతం రియాక్ట్ అయ్యేందుకు అవసరమైన గ్రౌండ్ ను ప్రిపేర్ చేస్తున్నట్లు గా తెలుస్తోంది. ఇంతకీ మండలి ఉంటుందా? ఉండదా? అన్న ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పాలంటే మాత్రం.. కాలం మాత్రమే ఈ అంశం పై క్లారిటీ ఇవ్వగలదని చెప్పక తప్పదు.