Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ వ్యూహం ఫలిస్తుందా ?

By:  Tupaki Desk   |   19 Jan 2022 4:27 AM GMT
కాంగ్రెస్ వ్యూహం ఫలిస్తుందా ?
X
కాంగ్రెస్ పార్టీ పెద్ద వ్యూహానే రచించినట్లుంది. అసెంబ్లీ పోలింగును ఫిబ్రవరి 14 నుంచి 20కి మార్చటం వెనుక దళితుల ఓట్లకు కాంగ్రెస్ గాలమేసినట్లే ఉంది చూస్తుంటే. ఫిబ్రవరి 16వ తేదీన ఉత్తరప్రదేశ్ లోని బెనారస్ లో ప్రతి ఏడాది గురు రవిదాస్ జయంతి జరుగుతుంది. ఈ జయంతికి పంజాబ్ లోని దళితులు పెద్ద ఎత్తున హాజరవుతారు. అయితే ఈసారి అసెంబ్లీ ఎన్నికలు రావటంతో ఇబ్బంది ఎదురైంది. దాంతో అసెంబ్లీ ఎన్నికలనే వాయిదా వేసుకోవాలని దళిత సంఘాలు కోరాయి.

దళిత సంఘాల తరపున ముఖ్యమంత్రి చరణ్ జీత్ సింగ్ చన్నీ కేంద్ర ఎన్నికల కమీషన్ కు సిఫారసు చేయడం కేంద్ర ఎన్నికల కమీషన్ పోలింగ్ తేదీని మార్చటం అంతా అయిపోయింది. ఎప్పుడైతే చన్నీ సిఫారసు చేశారో వెంటనే బీజేపీ కూడా మద్దతు పలకటం ఇంకా ఆశ్చర్యం. ఇదంతా ఎందుకు జరిగిందంటే కేవలం దళితుల ఓట్ల కోసమే అని అర్ధమైపోతోంది. పంజాబ్ నుంచి బెనారస్ కు 20 లక్షల మంది దళితులు వెళ్ళటమంటే మామూలు విషయం కాదు.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఎన్నికల తేదీని మార్చటం వెనుక చన్నీ ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకున్నారట. ఎందుకంటే ఆయన కూడా దళితుడే కాబట్టి. పంజాబ్ కు మొదటిసారి ఒక దళితుడు సీఎం అయ్యారు. అందుకనే చన్నీ కూడా ప్రత్యేకించి పోలింగ్ తేదీ మార్పు కోసం ప్రయత్నించారట. పోలింగ్ తేదీ మారిందంటే కేవలం చన్నీ తీసుకున్న ప్రత్యేకమైన చొరవ వల్లే అని యావత్ దళిత సంఘాలు భావిస్తున్నాయట. అందుకనే రాబోయే ఎన్నికల్లో దళితుల ఓట్లు కాంగ్రెస్ కే పడతాయని ప్రచారం మొదలైంది.

ఈ ఒక్క కారణంతోనే దళితులందరు రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఓట్లేస్తారా అనేదే డౌటు. ఒకవైపు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జనాల్లో దూసుకుపోతోంది. ప్రజాధరణ ఉన్న ఎంపీ భగవంత్ మాన్ ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించింది. ఇంకే పార్టీ కూడా ఇలాంటి సాహసం చేయలేకపోతున్నాయి. పంజాబ్ లో మొత్తం 32 శాతం దళితులున్నారు. ఇప్పటివరకు మెజారిటీ ఓట్లు కాంగ్రెస్ కే పడుతున్నాయి. మొదటిసారి దళితుల ఓట్ల విషయంలో ఆప్ పోటీకి వచ్చింది. మరి కాంగ్రెస్ వ్యూహం ఎంతవరకు వర్కవుటవుతుందో చూడాలి.