Begin typing your search above and press return to search.

ప్ర‌త్యేక హోదాపై కోర్టు క‌ల‌గ‌జేసుకుంటుందా?

By:  Tupaki Desk   |   23 July 2021 9:30 AM GMT
ప్ర‌త్యేక హోదాపై కోర్టు క‌ల‌గ‌జేసుకుంటుందా?
X
ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఓ సంచ‌ల‌న తీర్పు దేశ రాజ‌కీయాల్లో ప్ర‌కంప‌న‌ల‌కు కార‌ణ‌మైంది. బ‌హిరంగంగా సీఎం ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన హామీల‌ను నెర‌వేర్చ‌క‌పోతే జ‌నాలు కోర్టును ఆశ్ర‌యించ‌వ‌చ్చని ఆ తీర్పు సారాంశం. ఈ తీర్పు ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశమైంది. అంతే కాకుండా ఎన్నో ఏళ్లుగా మ‌గ్గుతున్న ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు ప్ర‌త్యేక హోదా అంశాన్ని మ‌రోసారి తెర‌పైకి వ‌చ్చింది. ఈ కోర్టు తీర్పు కేవ‌లం ముఖ్య‌మంత్రుల‌కే ప‌రిమిత‌మా? లేదా ప్ర‌ధాన‌మంత్రికి కూడా వ‌ర్తిస్తుందా అన్న‌ది ఇక్క‌డ పాయింట్‌. ఒక‌వేశ ప్ర‌ధాన‌మంత్రికి కూడా వ‌ర్తిస్తే ఏపీకీ ప్ర‌త్యేక హోదా అంశంపై విచారించాల‌ని తిరిగి సుప్రీం కోర్టును ఆశ్ర‌యించే అవ‌కాశం ఉంద‌ని విశ్లేష‌కులు అంటున్నారు.

ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ విభ‌జ‌న స‌మ‌యంలో పార్ల‌మెంటు సాక్షిగా అప్ప‌టి ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ సింగ్ ఏపీకి అయిదేళ్ల పాటు ప్ర‌త్యేక హోదా కొన‌సాగుతుంద‌ని హామీ ఇచ్చారు. కానీ అది అమ‌ల్లోకి రాలేదు. కేంద్రంలో ప్ర‌భుత్వం మారిన‌ప్ప‌టికీ ప్ర‌త్యేక హోదా దిశ‌గా ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోలేదు. దీనిపై ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌శ్నిస్తూనే ఉంది. ఈ ప్ర‌త్యేక హోదా అంశంపై కొంత‌మంది గ‌తంలో సుప్రీం కోర్టును ఆశ్ర‌యించ‌గా ఈ విష‌యంలో జోక్యం చేసుకోలేమ‌ని అప్పుడు కోర్టు చెప్పింది.

కానీ ఇప్పుడు ముఖ్య‌మంత్రుల ఇచ్చిన హామీలు అమ‌లు చేయ‌క‌పోతే ప్ర‌జ‌లు కోర్టుకెక్క‌వ‌చ్చ‌ని ఢిల్లీ పేర్కొన్న నేప‌థ్యంలో మ‌రోసారి ప్ర‌త్యేక హోదా హామీని తీర్చ‌లేదంటూ సుప్రీం కోర్టును ఆశ్ర‌యించే అవ‌కాశాలు ఉన్నాయా? అని నిపుణులు ఆలోచ‌న‌లు చేస్తున్నారు. ఒక‌వేళ సుప్రీం కోర్టు మ‌రోసారి తిర‌స్క‌రిస్తే మాత్రం దేశంలో న్యాయం వ్య‌క్తుల‌ను బ‌ట్టి వ‌ర్గాల‌ను బ‌ట్టి మారుతుంద‌నే చెడు ఉద్దేశాన్ని చాటిచెప్పే ప్ర‌మాదం ఉంది.

క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా ప్ర‌జ‌లెంతో ఇబ్బందులు ప‌డ్డారు. ఢిల్లీలో లాక్‌డౌన్ స‌మ‌యంలో సొంతూర్ల‌కు వెళ్లిపోతున్న వ‌ల‌స కూలీల‌ను ఆపేందుకు అక్క‌డి సీఏం అరవింద్ కేజ్రీవాల్ ప‌లు హామీలు ఇచ్చారు. ఇళ్ల అద్దెలు క‌ట్టుకోలేక‌పోతున్న కార్మికుల‌కు ప్ర‌భుత్వ‌మే అద్దె చెల్లిస్తుంద‌ని ప్ర‌క‌టించారు. కానీ ఆ త‌ర్వాత హామీని ప‌ట్టించుకోలేదు.

దీంతో సీఏం హామీని అమ‌లు చేయ‌లేద‌ని కొంత‌మంది ఢిల్లీ కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచార‌ణ జ‌రిపిన హైకోర్టు సీఏం ఇచ్చిన హామీల అమ‌లు కోరుతూ ప్ర‌జ‌లు కోర్టుకెక్క‌వ‌చ్చ‌ని స్ప‌ష్టం చేసింది. ఒక‌వేశ ప్ర‌భుత్వం ఇచ్చిన హామీల‌ను అమ‌లు చేయ‌లేక‌పోతే ఆ విషయాన్ని నేరుగా ప్ర‌జ‌ల‌కు చెప్పాలి అంతే కానీ ఏమీ చెప్ప‌కుండా వాదించ‌డం స‌రికాద‌ని న్యాయ‌స్థానం పేర్కొంది.

ఇప్పుడీ తీర్పు దేశంలో హాట్ టాపిక్ అయింది. ఎందుకంటే ఎన్నిక‌ల్లో విజ‌యం కోసం నాయ‌కులు ఎన్నో హామీలు గుప్పిస్తూనే ఉంటారు. వాటిలో ఆచ‌ర‌ణ సాధ్యం కానివీ ఉంటాయి. కానీ అధికారం కోసం ప్ర‌జ‌ల‌ను న‌మ్మించ‌డానికి ఎన్నో మాట‌లు చెప్తారు. ఎప్ప‌టిక‌ప్పుడు స‌మ‌స్య‌ల నుంచి గ‌ట్టెక్క‌డానికి హామీలు ఇస్తారు. ఆ త‌ర్వాత మ‌రిచిపోతారు. ఇప్పుడు ఈ హామీల‌న్నీ ముఖ్య‌మంత్రులు తీర్చ‌లేద‌ని వివిధ రాష్ట్రల్లోని కోర్టుల్లో పిటిష‌న్లు దాఖ‌ల‌య్యే అవ‌కాశం ఉంది. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.