Begin typing your search above and press return to search.

హుజూరాబాద్ సీనే రిపీటవుతుందా ?

By:  Tupaki Desk   |   11 Oct 2022 12:30 AM GMT
హుజూరాబాద్ సీనే  రిపీటవుతుందా ?
X
మునుగోడు అసెంబ్లీ ఉపఎన్నికలో రిజల్టు సంగతి పక్కనపెట్టేస్తే డబ్బులు ఖర్చుచేసే విషయంలో హుజూరాబాద్ ఉపఎన్నిక సీనే రిపీటయ్యేట్లుంది. హుజూరాబాద్ లో టీఆర్ఎస్, బీజేపీలు పోటీపడి కోట్లరూపాయలు మంచినీళ్ళలా ఖర్చుచేశాయి. తనను థిక్కరించి బీజేపీ అభ్యర్ధిగా పోటీచేసిన ఈటల రాజేందర్ ను ఎలాగైనా ఓడించాలని కేసీయార్ కంకణం కట్టుకున్నారు. అందుకనే నియోజకవర్గంలో ప్రభుత్వం తరపున అనేక అభివృద్ధి కార్యక్రమాలు+సంక్షేమ పథకాలు అమలుచేశారు.

ఇవి సరిపోవన్నట్లుగా అభ్యర్ధి తరపున ఎన్ని కోట్లరూపాయలు ఖర్చుచేశారో లెక్కేలేదు. ఇదే సమయంలో కేసీయార్ ను ఎలాగైనా దెబ్బకొట్టాలనే పంతంతో ఈటల కూడా కోట్ల రూపాయలు ఖర్చుచేశారు. పోటీలు పడీ మరి ఓటర్లకు వేలాది రూపాయలు ముట్టచెప్పారు. ఇపుడు మునుగోడులో కూడా అలాంటి సీనే రిపీట్ అయ్యేట్లుంది. హుజూరాబాద్ కన్నా ఇక్కడ ఇంకా ఎక్కువే డబ్బులు ఖర్చవటం ఖాయం.

ఎందుకంటే హుజూరాబాద్ ఫేస్ టు ఫేస్ డైరెక్టు ఫైట్ అయితే మునుగోడులో త్రిముఖ పోటీ. టీఆర్ఎస్-బీజేపీ-కాంగ్రెస్ దేనికదే తమ అభ్యర్ధిని గెలిపించుకునేందుకు ఎత్తుకు పై ఎత్తులు వేసుకుంటున్నాయి. తమ సకల శక్తులను మునుగోడులో మోహరిస్తున్నాయి. టీఆర్ఎస్ అధికారంలో ఉందికాబట్టి నిధుల సమస్య లేదు. ఇక బీజేపీ తరపున పోటీచేస్తున్న అభ్యర్ధి కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి వ్యక్తిగతంగా ఆర్ధికంగా ఎంతో బలవంతుడు కాబట్టి డబ్బుకు ఎలాంటి డోకా లేదు.

కాకపోతే సమస్యల్లా కాంగ్రెస్ అభ్యర్ధి పాల్వాయి స్రవంతికే. ఇందుకనే బీజేపీ ఓటుకు రు. 30 వేలు ఇవ్వటానికి రెడీగా ఉందని టీఆర్ఎస్ నేతలు గోలచేస్తున్నారు. ఇదే సమయంలో టీఆర్ఎస్ అభ్యర్ధి ఓటుకు రు. 40 వేల చొప్పున బేరాలు మాట్లాడుకుంటున్నట్లు కమలనాదులు మండిపడుతున్నారు.

పోలింగ్ కు చాలారోజులుండగానే ఓటుకు ఇంత ధరైతే ఇక పోలింగ్ దగ్గరపడే కొద్దీ ఈ ధర మరింత పెరిగి పోవటం ఖాయం. ఇప్పటికే పంపిణీకి పార్టీలు కార్లు, మోటారుబైకులు కూడా రెడీ చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరి కాంగ్రెస్ డబ్బులు పంచటంలో వీళ్ళని ఏమేరకు తట్టుకుంటుందో ఏమో చూడాల్సిందే.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.