Begin typing your search above and press return to search.

హైదరాబాద్ మెట్రో ఉదయం 5 గంటల కే మొదలు కానుందా?

By:  Tupaki Desk   |   9 Nov 2021 6:42 AM GMT
హైదరాబాద్ మెట్రో ఉదయం 5 గంటల కే మొదలు కానుందా?
X
అనుకుంటాం కానీ సామాన్యుడు పవర్.. సగటు జీవికి అర్థం కాదు. తాజాగా ఒక సామాన్యుడు సంధించిన ఒక ప్రశ్న.. ఒక వేదన.. హైదరాబాద్ మెట్రో టైమింగ్స్ ను మార్చేలా చేస్తున్న పరిస్థితి. ఇంత కీ ఆ సామాన్యుడు ఎవరు? అతడేం ట్వీట్ చేశారు? దానికి ఎందుకంత ప్రాధాన్యత లభించింది? మెట్రో టైమింగ్స్ మారే అవకాశం ఎంత? హైదరాబాద్ మెట్రోలో ఇప్పుడీ ట్వీట్ మీద ఏం జరుగుతుందన్న విషయాల్లో కి వెళితే..

హైదరాబాద్ కు చెందిన అభినవ్ సుదర్శి అనే ప్రయాణికుడు ఒక ట్వీట్ చేశారు. ఉదయం వేళ హైదరాబాద్ మెట్రో రైలు పని చేస్తే బాగుంటుందన్నది అతగాడి సూచన. ఎందుకంటే.. హైదరాబాద్ మెట్రో ఉదయం ఏడు గంటలకు పని చేయటం మొదలు పెట్టి రాత్రి 11 గంటల వరకు సాగుతుంది. హైదరాబాద్ మహానగరంలో ఉదయం నాలుగు గంటలకే ఒళ్లు విరుచుకుంటుంది.. రాత్రి ఒంటి గంట వరకు సందడిగానే ఉంటుంది. కరోనా.. అనంతర లాక్ డౌన్ కారణంగా సైబరాబాద్ లోని ఐటీ కంపెనీలు తమ ఉద్యోగుల్ని ఇంటి నుంచే పని చేయిస్తున్న వేళ.. నగరం ఆ మాత్రం అయినా నిద్ర పోయే పరిస్థితి. లేనిపక్షంలో 24 గంటలు నగరంలో ఏదో ఒక మూల ఏదో ఒక యాక్టివిటీ జరుగుతుండేది.

పెట్రోల్.. డీజిల్ ధరలు పెరగటం.. ఆటోలు.. క్యాబ్ ల ధరలు చుక్కల్ని తాకుతున్న వేళ.. సామాన్యుడికి ఇబ్బందికరంగా మారింది. ప్రజా రవాణా అయిన బస్సులు.. ఎంఎంటీఎస్ లతో పాటు మెట్రో రైళ్లు సైతం పరిమిత సమయానికి మాత్రమే అందుబాటులో ఉండటంతో హైదరాబాద్ లోని లక్షలాది మంది తెగ ఇబ్బంది పడుతున్నారు. అందరికి సొంతవాహనాలు లేకపోవటం.. ఉన్న వారు పెరిగిన పెట్రోల్.. డీజిల్ ధరలతో కిందా మీదా పడిపోతున్నారు.

ఇలాంటి వేళ.. మెట్రో రైలును తెల్లవారుజామునే మొదలు పెట్టాలన్న సూచనతో ఒక ట్వీట్ చేశారు. ఉదయాన్ను రైళ్ల ద్వారా హైదరాబాద్ కు వచ్చే వేలాది మందికి మెట్రో సేవలు అందుబాటులో ఉండటం లేదని.. దీనికి బదులుగా దాని టైమింగ్స్ ను మార్చగలిగితే ప్రయోజనకరంగా ఉంటుందని పేర్కొన్నారు. తన సూచనను మంత్రి కేటీఆర్ కు ట్యాగ్ చేశారు. దీనికి స్పందించిన కేటీఆర్.. ఆలోచన బాగుందని.. అభినవ్ మాటలతో తాను ఏకీభవిస్తున్నట్లుగా రీట్వీట్ చేశారు. మెట్రో ఎండీ దీని పై స్పందించి నిర్ణయం తీసుకోవాలని సూచన చేశారు. దీంతో.. హైదరాబాద్ మెట్రో లో ఒక్క సారిగా ఈ అంశం హాట్ టాపిక్ గా మారింది.

లెక్కలు డొక్కల తో బిజీ బిజీగా మారారు. మంత్రి కేటీఆర్ స్వయంగా స్పందించటం.. ఆలోచన బాగుందని చెప్పటం తో అందుకు తగ్గట్లు గా నిర్ణయాన్ని తీసుకునేలా కసరత్తు మొదలు పెట్టారు. విశ్వ సనీయ సమాచారం ప్రకారం త్వర లోనే హైదరాబాద్ మెట్రో ఉదయం ఆరు గంటలకు లేదంటే.. మరో అరగంట ముందుగా మొదలై.. రాత్రి పన్నెండు గంటల వరకు పెంచే వీలుందని చెబుతున్నారు. ఒకవేళ లాజిస్టిక్స్ ఇష్యూస్ ఎదురైతే.. రాత్రి వేళలు అలానే ఉంచి.. పగటి వేళల్ని మాత్రం ఒక గంట ముందుకు జరపటం ఖాయమని.. అందుకు సంబంధించిన ప్రకటన అతి తొందర్లోనే అధికారికం గా వెలువడుతుందన్న మాట వినిపిస్తోంది.