Begin typing your search above and press return to search.

ఏపీ మూడు రాజధానుల వ్యవహారం ఫిబ్రవరిలో తేలిపోనుందా?

By:  Tupaki Desk   |   21 Jan 2023 3:30 PM GMT
ఏపీ మూడు రాజధానుల వ్యవహారం ఫిబ్రవరిలో తేలిపోనుందా?
X
ఏపీలో మూడు రాజధానుల వ్యవహారంపై జగన్‌ ప్రభుత్వం ముందుకే వెళ్తున్న విషయం తెలిసిందే. మూడు రాజధానులు ఏర్పాటు చేస్తూ తెచ్చిన చట్టాన్ని, సీఆర్‌డీఏ చట్టాన్ని రద్దు చేస్తూ తెచ్చిన చట్టాన్ని ఏపీ హైకోర్టు కొట్టేసిన సంగతి తెలిసిందే. మూడు రాజధానులు ఏర్పాటు చేయడానికి ఏపీ ప్రభుత్వానికి అధికారం లేదని కోర్టు సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో జగన్‌ ప్రభుత్వం హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. సుప్రీంకోర్టులో ఇప్పుడు ఈ వ్యవహారం ఉంది.

మరోవైపు కోర్టు తీర్పు ఎలా ఉన్నా జగన్‌ ప్రభుత్వం మూడు రాజధానులవైపే వడివడిగా కదులుతోంది. ఇందులో భాగంగా త్వరలోనే విశాఖపట్నం నుంచి ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పరిపాలన సాగిస్తారని వైసీపీ మంత్రులు, ముఖ్య నేతలు చెబుతున్నారు. తాజాగా మీడియాతో మాట్లాడిన విశాఖ కలెక్టర్‌ మల్లికార్జున సైతం విశాఖ కార్వనిర్వాహక రాజదాని అవుతుందని వ్యాఖ్యానించారు. త్వరలోనే ఇందుకు సంబంధించిన ప్రకటన కూడా వస్తుందన్నారు.

ఈ నేపథ్యంలో విశాఖ రాజధాని వ్యవహారం మరోమారు వేగం పుంజుకుంది. ఇప్పటికే ఉత్తరాంధ్ర మంత్రులు బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, గుడివాడ అమరనాథ్‌ తదితరులు విశాఖ నుంచి అతి త్వరలో జగన్‌ పరిపాలిస్తారని కుండబద్దలు కొడుతున్నారు. వైసీపీలో నెంబర్‌ టూ, త్రీగా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి వంటివారు కూడా విశాఖే రాజధాని అనే విషయాన్ని నొక్కి వక్కాణిస్తున్నారు.

ఈ ఉగాది తర్వాత సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి విశాఖపట్నం వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మొన్నటి వరకు రాజధాని ప్రస్తావన లేకుండానే జగన్‌ వైజాగ్‌ కి షిఫ్ట్‌ అవుతారని వార్తలు వచ్చాయి. న్యాయపరంగా వివాదాలు తలెత్తకుండా ఉండటానికి ఇలా చేయాలనుకున్నారు.

అయితే ఫిబ్రవరిలో జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం మరోసారి కొత్తగా మూడు రాజధానుల బిల్లును తిరిగి తీసుకువస్తుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఫిబ్రవరిలో దాదాపు 25 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు జరగనున్నాయి. అయితే, మూడు రాజధానుల వ్యవహారం సుప్రీంకోర్టులో ఉన్నందున ప్రభుత్వం మళ్లీ కొత్తగా బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టే ధైర్యం చేస్తుందా అనే సందేహాలున్నాయి.

మరోవైపు సుప్రీంకోర్టు మూడు రాజధానుల వ్యవహారంపై విచారణను త్వరగా తేల్చేయాలనే కృతనిశ్చయంతో ఉంది. ఎలాగైనా, వచ్చే ఫిబ్రవరి నెలలో రాజధాని సమస్యకు సంబంధించి కీలకమైన పరిణామాలను ప్రజలు చూడబోతున్నారని అంటున్నారు. ఈ పరిణామాలే వచ్చే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వ నుదిటి రాతను నిర్దేశిస్తాయని చెబుతున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.