Begin typing your search above and press return to search.

తొందరలోనే జగన్ షిఫ్టయిపోతారా ?

By:  Tupaki Desk   |   11 Feb 2022 4:13 AM GMT
తొందరలోనే జగన్ షిఫ్టయిపోతారా ?
X
తాజాగా సినీ పరిశ్రమలోని ప్రముఖులతో భేటీ తర్వాత అందరికీ ఇదే అనుమానం మొదలైంది. ప్రస్తుతం హైదరాబాద్ లో కేంద్రీకృతమైన ఫీల్డును ఏపీకి రావాలంటూ జగన్మోహన్ రెడ్డి ఆహ్వానించారు. సినీ ఫీల్డ్ ఏపికి వచ్చేట్లయితే వైజాగ్ లో అవసరమైన భూములిస్తానంటు బంపరాఫర్ ఇచ్చారు. స్టూడియోలు కట్టుకోవటానికి ఎకరాలు, ఇంటి స్థలాలు తదితర ప్రోత్సాహకాలన్నీ అందిస్తానని జగన్ హామీ ఇచ్చారు.

ఇదే విషయమై భేటీలో జగన్ మాట్లాడుతూ తొందరలోనే అందరం వైజాగ్ కు షిఫ్టయిపోదాం వచ్చేయమని అన్నారట. తొందరలోనే వైజాగ్ షిఫ్టయిపోదాం అంటే అర్థమేంటి ? అనే పాయింట్ మీదే చర్చలు పెరిగిపోతున్నాయి. రాబోయే ఉగాదికి కొత్త జిల్లాల ఏర్పాటు ఖాయం. దాంతో పాటే తాను కూడా వైజాగ్ కు వెళ్ళిపోవాలని జగన్ డిసైడ్ అయినట్లు పార్టీ వర్గాల టాక్. మూడు రాజధానుల ఏర్పాటుపై జగన్ ఒకపుడు చాలా పట్టుదలగా ఉండేవారు.

ఇందులో భాగంగానే వైజాగ్ కు బాగా ప్రాధాన్యత ఇస్తున్నారు. అయితే కోర్టులో దాఖలైన కేసుల కారణంగా గందరగోళంగా తయారైంది. ఈ నేపధ్యంలోనే ప్రభుత్వం ఈ మధ్యనే మూడు రాజధానుల ప్రతిపాదతో పాటు సీఆర్డీయే చట్టం రద్దు ను కూడా ఉపసంహరించుకుంది.

తొందరలోనే కొత్త చట్టాన్ని సమగ్రంగా తీసుకొస్తానని అప్పట్లోనే జగన్ ప్రకటించారు. సమగ్ర చట్టం ఎప్పుడొస్తుందో తెలీదు. కొత్త చట్టం ఎప్పుడు తెచ్చినా మళ్ళీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టుల్లో కేసులు, విచారణ తప్పదు.

అందుకనే ముందుగా ముఖ్యమంత్రి కార్యాలయాన్ని వైజాగ్ తరలించేయాలని జగన్ డిసైడ్ అయ్యారట. ముఖ్యమంత్రి ఇక్కడే కూర్చుని పనిచేయాలని ఏ కోర్టు కూడా నిర్దేశించలేదు. కాబట్టి సీఎం ఎక్కడుంటే అదే రాజధాని అవుతుంది.

ఈ పద్దతిలోనే ముందు జగన్ వైజాగ్ వెళిపోవటానికి నిర్ణయించుకున్నట్లు సమాచారం. అందుకనే సినీ పరిశ్రమను కూడా వైజాగ్ కు రమ్మంటు జగన్ ఆహ్వానించినట్లున్నారు. చూద్దాం ఉగాది నాటికి ఎన్ని డెవలప్మెంట్లుంటాయో.