Begin typing your search above and press return to search.

ఈటల వ్య‌వ‌హారం నేడు తేలిపోతుందా? బీజేపీలో టెన్ష‌న్ టెన్ష‌న్

By:  Tupaki Desk   |   12 Sep 2022 5:46 AM GMT
ఈటల వ్య‌వ‌హారం నేడు తేలిపోతుందా?  బీజేపీలో టెన్ష‌న్ టెన్ష‌న్
X
తెలంగాణ రాజ‌కీయాల్లో నేడు కీల‌క ఘ‌ట్టం తెర‌మీద‌కి రానుంది. ఐదు రోజుల విరామం త‌ర్వాత‌.. తెలంగాణ అసెంబ్లీ.. తిరిగి ప్రారంభం అవుతోంది. ఈ క్ర‌మంలో ఒక‌వైపు .. అధికార పార్టీ వివిధ బిల్లుల‌ను ప్ర‌వేశ పెట్టి మూకుమ్మ‌డిగా అయినా.. స‌రే.. ఆమోదించుకునేందుకు ప్ర‌య‌త్నిస్తోంది. అయితే.. అదేస‌మ‌యంలో బీజేపీలో మాత్రం టెన్ష‌న్ పూరిత వాతావ‌ర‌ణం క‌నిపిస్తోంది. ఎందుకంటే.. పార్టీకి ఉన్న ఫైర్‌బ్రాండ్ నాయ‌కుడు.. హూజూరాబాద్ ఎమ్మెల్యే.. మాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్‌పై వేటు వేసే విష‌యాన్ని ఈ రోజు తేల్చేస్తార‌ని.. అధికార పార్టీ నేత‌లు చెబుతున్నారు.

ఇటీవ‌ల అసెంబ్లీ ప్రారంభం రోజున స్పీక‌ర్ పోచారం శ్రీనివాస‌రెడ్డిని ఈట‌ల రాజేంద‌ర్ 'మ‌ర‌మ‌నిషి' అని వ్యాఖ్యానించ‌డం.. దుమారానికి దారితీసింది. దీంతో అధికార ప‌క్షం నుంచి ఏకంగా.. రాజేంద‌ర్‌పై అన‌ర్హ‌త వేటు వేయాల‌నే డిమాండ్ తెర‌మీదికి వ‌చ్చింది. ఈ ప‌రిణామాన్నిసీరియ‌స్‌గా తీసుకున్న బీజేపీ.. ఎదురు దాడిని ముమ్మ‌రం చేసింది. బీజేపీ ఎమ్మెల్యేలపై వివక్ష చూపెడుతున్నారని రఘునందన్ రావు తాజాగా ఆరోపించారు. సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డిని మరమనిషి అని ఈటల రాజేందర్‌ వ్యాఖ్యానించడంపై.. నోటీసులు ఇవ్వడమేంటని ప్రశ్నించారు. సభాపతి బీఏసీ నిబంధనలు పాటించడం లేదని రఘునందన్‌రావు అన్నారు.

అంతేకాదు.. మరమనిషి అనేది నిషిద్ధ పదమా అని రఘునందన్ రావు ప్రశ్నించారు. బల్లాలు ఎక్కి, మైకులు విసిరి, గవర్నర్ కుర్చీనే తన్నినప్పుడు ఈ సభా సంప్రదాయం ఎక్కడికి పోయిందని మంత్రి ప్రశాంత్ రెడ్డిని రఘునందన్ ప్రశ్నించారు.

మరమనిషి అంటే సభా సంప్రదాయాలను అగౌరవపరిచి నట్లా అని అడిగారు. అసెంబ్లీ సమావేశాలకు బీజేపీని రానీయకుండా చేసేందుకు మంత్రులు ఈ కుట్ర పన్నారని ఆరోపించారు. ఇక‌, ఈట‌ల ఈ విష‌యంలో కొంత మేర‌కు దిగివ‌చ్చారు. స‌భాప‌తి.. పోచారం త‌న‌కు తండ్రి లాంటి వార‌ని.. ఆయ‌న‌కు పాద‌న‌మస్కారం చేసేందుకు కూడా తాను రెడీయేన‌ని చెప్పారు.

అంటే.. ఒక‌ర‌కంగా ఈట‌ల 'త‌ప్పు' ఒప్పుకొన్న‌ట్టుగా.. టీఆర్ ఎస్ నేత‌లు చెబుతున్నారు. ఈ ప‌రిణామాల క్ర‌మంలో నేటి అసెంబ్లీలో మంత్రి జ‌గ‌దీష్ రెడ్డి దీనిపైఎలాంటి తీర్మానం ప్ర‌వేశ పెడ‌తారో అనే టెన్ష‌న్‌.. బీజేపీలో అయితే ఉంది. ఇప్ప‌టికిప్పుడు ఈట‌ల‌ను స‌స్పెండ్ చేస్తే..

న్యాయ పోరాటం చేయాల‌ని ఉన్న‌ప్ప‌టికీ.. ఇది సుదీర్ఘంగా సాగే ప్ర‌క్రియ కావ‌డంతో.. కాల హ‌రణం త‌ప్ప‌ద‌ని నాయ‌కులు భావిస్తున్నారు. దీంతో ఒకింత ఆవేద‌న క‌నిపిస్తోంది. మ‌రి దీనిపై అధికార పార్టీ ర‌చ్చ చేస్తుందో.. లేక వ‌దిలేస్తుందో చూడాలి. ఏదేమైనా.. నేటి అసెంబ్లీలో మ‌ళ్లీ టెన్ష‌న్ పూరిత వాతావ‌ర‌ణం చోటు చేసుకోవ‌డం ఖాయ‌మ‌నే సంకేతాలు అయితే.. వ‌చ్చాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.