Begin typing your search above and press return to search.

మంత్రి సారీ చెబుతారా ?

By:  Tupaki Desk   |   11 Feb 2022 4:06 AM GMT
మంత్రి సారీ చెబుతారా ?
X
శ్రీకాకుళం జిల్లాలో మంత్రి సీదిరి అప్పలరాజు వ్యవహారం బాగా ముదురుతోంది. బందోబస్తు డ్యూటీలో ఉన్న ఒక ఇన్ స్పెక్టర్ ను పట్టుకుని వెనక్కు తోసేయటమే కాకుండా నా కొడకా అంటు దురుసుగా మాట్లాడారు. అది కూడా జనులందరి ముందు బహిరంగంగా సీఐని తిట్టడం సంచలనమైంది.

దీనిపై పోలీసు అధికారుల సంఘం మంత్రి బహిరంగ క్షమాపణలు చెప్పాలంటు డిమాండ్ చేసింది. మామూలుగా అయితే మునుపు ఎన్నడూ మంత్రి అప్పలరాజు ఇంతగా దురుసుగా వ్యవహరించలేదు.

అయితే చరిత్రతో సంబంధం లేదు కాబట్టి ఇప్పటి ప్రవర్తనకు మంత్రి క్షమాపణ చెప్పాల్సిందే. ప్రతిపక్షంలో నేతలు పోలీసులపైన ఇలా దురుసుగా ప్రవర్తిస్తున్నారంటే వెంటనే చర్యలు తీసుకుంటున్నది ప్రభుత్వం. మరి స్వయంగా మంత్రే పోలీసు అధికారిని నోటికొచ్చినట్లు మాట్లాడినపుడు చర్యలు తీసుకోకపోతే ఎలా ? జగన్మోహన్ రెడ్డి అయినా మంత్రిపై చర్యలు తీసుకోవాలి లేదా పోలీసు అధికారుల సంఘం డిమాండ్ చేసినట్లు క్షమాపణ అయినా చెప్పాలి.

టీడీపీ నేత కూన రవికుమార్ కూడా ప్రభుత్వాధికారులను నోటికొచ్చినట్లు తిట్టిన సంఘటనలు చాలా ఉన్నాయి. ఎంఆర్వోలు, ఎస్సైలు, వీఏవోలను కూన బూతులు తిట్టిన ఆడియో, వీడియోలు ఇప్పటికీ వైరల్ అవుతునే ఉన్నాయి. అంటే అధికార యంత్రాంగాన్ని ఇటు అధికార పార్టీ అటు ప్రతిపక్ష పార్టీ కూడా టార్గెట్ చేయటమే విచిత్రంగా ఉంది. ఎవరైనా సంయమనం పాటించాల్సిందే అనటంలో సందేహం లేదు.

రాజకీయంగా ఒకరిపై మరొకరు ఎన్ని ఆరోపణలు, ప్రత్యారోపణలైనా చేసుకోవచ్చు. ఎందుకంటే నేతలకు ఇవన్నీ చాలా సహజం. కానీ అధికార యంత్రాంగాన్ని తమ రాజకీయాల్లోకి లాగటం ఎంతమాత్రం మంచిది కాదు.

అధికారులపై బహిరంగంగా దురుసుగా వ్యవహరిస్తే ఇక పబ్లిక్ మాత్రం వాళ్ళకు ఏమి గౌరవం ఇస్తుంది ? పబ్లిక్ లో వాళ్ళకు మర్యాద, గౌరవం పోయిన తర్వాత వాళ్ళను ఎవరు లెక్కచేయరు. అది వ్యక్తులకే కాదు ప్రభుత్వానికే అవమానం. ఈ విషయం గ్రహించి అప్పలరాజు సదరు పోలీసు అధికారికి క్షమాపణ చెబితే అందరికీ మంచిది.