Begin typing your search above and press return to search.

ఆఖరుకు పెన్షనర్లనూ వదలరా... ?

By:  Tupaki Desk   |   22 Jan 2022 5:30 PM GMT
ఆఖరుకు పెన్షనర్లనూ వదలరా... ?
X
ఏపీ సర్కార్ తీసుకుంటున్న నిర్ణయాల మీద ఇప్పటికే ఉద్యోగ వర్గాలు భగ్గుమంటున్నాయి. కొత్తగా ఇచ్చేది తగ్గించారు. సరేననుకుంటే పాత వాటిని కూడా రద్దు చేస్తున్నారు, ఇదేమి అన్యాయమని కూడా ప్రశ్నిస్తున్నారు. గతంలో ఉన్న హెచ్ ఆర్ ఏ స్లాబ్స్ ని మార్చేసి కోత పెట్టారు, అలాగే ఇతర ప్రయోజనాలను రద్దు చేశారని వారు గోడుమంటున్నారు. ఇక జగన్ అధికారంలోకి వచ్చాక ప్రకటించిన ఇంటీరియం రిలీఫ్ 27 శాతాన్ని గత రెండేళ్ళుగా ఉద్యోగులు పెన్షనర్లు ఇప్పటిదాకా అనుభవిస్తున్నారు.

అయితే కొత్త పీయార్సీని 23 శాతానికే ఇస్తున్నందువల్ల ఆ నాలుగు శాతం మొత్తాన్ని ఉద్యోగుల నుంచి రికవరీ చేయడానికి ప్రభుత్వం చర్యలు చేపడుతోందని ఉద్యోగ వర్గాలు పెద్ద ఎత్తున నిరసన తెలియచేస్తున్నాయి.ఈ నేపధ్యంలో పదవీ విరమణ చేసి పెన్షనర్లుగా ఉన్న వారికి 27 ఐ ఆర్ రూపంలో ఇచ్చిన దానిలో నాలుగు శాతాన్ని రికవరీ చేయడానికి ప్రభుత్వం చూస్తోంది అన్న ప్రచారం సాగుతోంది. దాంతో ఉద్యోగులతో పాటు పెన్షనర్లు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తామేమి పాపం చేశామని ఇలా తమకు ఇచ్చిన దాన్ని వెనక్కి తీసుకుంటున్నారు అని మండిపడుతున్నారు. ఈ విధంగా రకవరీ చేస్తే ప్రతీ పెన్షనర్ ఏకంగా డెబ్బై వేల రూపాయల నుంచి లక్ష రూపాయల దాకా నష్టపోతారు అంటున్నారు.

ఇక కొత్త వేతన సవరణ ఉత్తర్వులు వృద్ధ పెన్షనర్ల పాలిట శాపంగా మారుతున్నాయని అంటున్నారు. డెబ్బై ఏళ్ళు దాటిన ఎనభై ఏళ్ళు మధ్యన ఉన్న వారికి ఇచ్చే అదనం క్వాంటమ్ పెన్షన్ లో కూడా కోత పెట్టడంతో వారు గగ్గోలు పెడుతున్నారు. ఇలా జీవన సంధ్య సమయంలో తమ మీద ఎందుకీ కక్ష అని అంటున్నారు. తమకు చెల్లించే దాన్ని కోత పెట్టడం, తిరిగి రికవరీ చేస్తామని చెప్పడం పట్ల అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు. ఈ మేరకు వారంతా కూడా తాము కూడా ఉద్యమంలో పాలుపంచుకుంటామని చెబుతున్నారు.

ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా విశ్రాంతి ఉద్యోగులు కూడా రోడ్డెక్కుతారని అంటున్నారు. మరి పండు వయసులో నీడ పట్టన ఉండి విశ్రాంతి తీసుకోవాల్సిన తమను వీధుల పాలు చేస్తున్న సర్కార్ పెద్దలు తీరు మార్చుకోవాలని కూడా అంటున్నారు. ఉద్యోగుల విషయంలో అయితే జనాల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి కానీ వయో వృద్ధులైన పెన్షనర్లకు కోత పెట్టడం కానీ వారిని ఇబ్బందులకు గురి చేయడం కానీ చేస్తే మాత్రం జనాల నుంచి ప్రభుత్వానికే పెద్ద ఎత్తున వ్యతిరేకత వస్తుందని కూడా అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.