Begin typing your search above and press return to search.

దసరాకు ముందే వ్యాక్సిన్ వచ్చేయనుందా?

By:  Tupaki Desk   |   9 Jun 2020 4:00 AM GMT
దసరాకు ముందే వ్యాక్సిన్ వచ్చేయనుందా?
X
ప్రపంచాన్ని చుట్టేసిన మాయదారి మహమ్మారికి చెక్ పెట్టేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నాలు సాగుతున్నాయి. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా వ్యాక్సిన్ తయారీలో సక్సెస్ కావాలంటూ రాత్రిపగలు అన్న తేడా లేకుండా ప్రయత్నాలు సాగుతున్నాయి. ఇదిగో వచ్చేసింది.. అదిగో వచ్చేసిందంటూ ఇప్పటివరకూ వచ్చిన వార్తలకు భిన్నమైన న్యూస్ తాజాగా బయటకు వచ్చింది. బ్రిటిష్ ఫార్మా దిగ్గజ సంస్థ ఆస్ట్రాజెనెకా తాజాగా ఒక ప్రకటన చేస్తూ ఏజెడ్ డీ 1222 జేఏబీ అనే వ్యాక్సిన్ ను తయారీని ప్రారంభించినట్లుగా పేర్కొంది.

అన్ని పరీక్షలు విజయవంతమైతే ఆగస్టు చివరి నాటికి.. లేదంటే సెప్టెంబరులో మార్కెట్లోకి తెచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది. ఈ సంస్థ అంచనాల ప్రకారం సెప్టెంబరు నాటికి పది కోట్ల డోసుల వ్యాక్సిన్ అందుబాటులోకి రానున్నట్లు చెప్పింది. కంపెనీ ప్రకటనను చూస్తే.. దసరాకు ముందే వ్యాక్సిన్ వచ్చేస్తున్నట్లుగా చెప్పాలి. మాహమ్మారి అంతు చూసేందుకు ప్రపంచ వ్యాప్తంగా సీరియస్ గా పరిశోధనలు చేస్తున్న వారు దాదాపు పన్నెండు మంది వరకు ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించింది. అలా గుర్తింపు పొంది.. తొలినాళ్ల నుంచి వ్యాక్సిన్ తయారీ రేసులో అగ్రభాగాన నిలుస్తోంది ఆక్స్ ఫర్డ్వర్సిటీ.

ఈ సంస్థ ఇప్పటికే18-55 ఏళ్ల మధ్య ఉన్న వారి పైన పరీక్షలు జరిపింది. ఇవి కాస్తా సక్సెస్ కావటంతో వివిధ వయసులకు చెందిన 10,260 మంది వాలంటీర్లను ఎంపిక చేసుకొని వారిపై ప్రయోగాల్ని చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ పరీక్షలు విజయవంతమయ్యే దాని ఆధారంగానే మార్కెట్లోకి వ్యాక్సిన్ ను విడుదల చేయనున్నారు. అంటే.. ప్రపంచ గమనాన్ని ఈ పదివేల మంది డిసైడ్ చేయనున్నట్లు చెప్పారు.

ప్రయోగం సక్సెస్ అయితే.. ఈ ఫార్మా సంస్థ బ్రిటన్ తో పాటు.. భారత్.. నార్వే.. స్విట్జర్లాండ్ దేశాల్లో తయారీని షురూ చేస్తుంది. సెప్టెంబరు నాటికి పది కోట్ల డోసులు.. 2021 జూన్ నాటికి 20 కోట్ల డోసుల్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నారు. ఆ రోజు ఎంత త్వరగా వస్తుందో కదూ?