Begin typing your search above and press return to search.

అదే నిజమైతే.. ఈసారి దసరాతో నిజమైన పండుగే

By:  Tupaki Desk   |   27 Jun 2020 6:00 AM IST
అదే నిజమైతే.. ఈసారి దసరాతో నిజమైన పండుగే
X
ప్రపంచానికి నిద్ర లేకుండా చేస్తున్న మహమ్మారికి చెక్ చెప్పాలంటే దాని వేగానికి కళ్లెం వేసే ముకుతాడు చాలా అవసరం. కంటికి కనిపించని అతి సూక్ష్మజీవి మానవ సమాజాన్ని ఎంతలా అతలాకుతలం చేసిందో తెలిసిందే. ఆధునిక మనిషి జీవితంలో కలలో కూడా ఊహించని సిత్రమైన ప్రపంచం కళ్ల ముందుకు రావటమే కాదు.. భవిష్యత్తు మీద బోలెడంత దిగులు కలిగేలా చేసింది. మానవాళికి సంబంధించిన ఏ అంశమైనా సరే.. ఇక నుంచి బీసీ (బిఫోర్ కరోనా).. ఏసీ (ఆఫ్టర్ కరోనా) పేరిట పోల్చటం ఖాయం.

కిక్కిరిసిపోయే రైళ్లలో ప్రయాణం చేయటం.. రద్దీగా ఉండే మార్కెట్లకు వెళ్లటం.. అర్థరాత్రి వేళ.. రోడ్డు పక్కన ఉన్న ఇడ్లీ సెంటర్ లో పొగలు కక్కే ఇడ్లీ మీద నెయ్యి..కారప్పొడి వేసుకు తినే రోజులు ఇకపై వస్తాయా? అంటే ఇప్పట్లో కనిపించని పరిస్థితి. ఎన్ని మందులు వచ్చినా.. మరెన్ని వైరస్ లు వచ్చినా ఒకప్పటి ధీమా.. భరోసా అయితే సాధ్యం కాదన్న మాట వినిపిస్తోంది.

ప్రపంచ వ్యాప్తంగా మహమ్మారికి చెక్ పెట్టే పరిశోధనలు పెద్ద ఎత్తున జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ ప్రయోగాల్లో అత్యధికులు ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు చేస్తున్న వ్యాక్సిన్ ప్రయోగం మీద పెద్ద ఎత్తున ఆశలుపెట్టుకోవటం తెలిసిందే.ఇదిలా ఉంటే.. ఈ రీసెర్చ్ కు సంబంధించి కీలకమైన అడుగు ఒకటి ముందుకు పడింది. చింపాంజీల మీద జరిపిన ప్రయోగాలు ప్రోత్సాహకరమైన ఫలితాలు ఇస్తున్నట్లు చెబుతున్నారు.
అన్ని అనుకున్నట్లు జరిగితే ఈ దసరా (అక్టోబరు) నాటికి వచ్చేస్తుందనిచెబుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా పన్నెండు సంస్థలు వ్యాక్సిన్ తయారు చేసే పనిలో ఉండగా.. ఆక్స్ ఫర్డ్ వర్సిటీ రూపొందిస్తున్న టీకా గేమ్ ఛేంజర్ గా మారుతుందన్న మాట వినిపిస్తోంది. దీనికి తగ్గట్లే ఇప్పటివరకూ జరిపిన క్లినికల్ టెస్టులు సైతం బాగున్నట్లు చెబుతున్నారు.

వివిధ దేశాల్లో ఇప్పటికే ఈ వ్యాక్సిన్ ను పలువురి మీద ప్రయోగించి.. ఫలితాలు ఎలా వస్తున్నాయన్న విషయంపై అధ్యయనం చేస్తున్నారు. అన్ని అనుకున్నట్లు జరిగితే మాత్రం ఈ దసరా డబుల్ థమాకా అని చెప్పక తప్పదు. ప్రతి ఏటా ఈ పెద్ద పండక్కి బోనస్ ఇస్తారు. అయితే.. ఈసారి ఇవ్వకున్నా.. అసలుసిసలు పండగా ప్రతిఒక్కరూ ఫీల్ కావటం ఖాయం.