Begin typing your search above and press return to search.

మెగాస్టార్ మీద సీబీఐ, ఈడీ, ఐటి రైడ్స్ జరుగుతాయా ?

By:  Tupaki Desk   |   15 March 2021 3:51 PM GMT
మెగాస్టార్ మీద సీబీఐ, ఈడీ, ఐటి రైడ్స్ జరుగుతాయా ?
X
ప్రభుత్వాన్ని తప్పుపడితే దాడులు జరగటమేనా ? ఇపుడిదే అంశం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. కేంద్ర ప్రభుత్వ వైఖరిని విమర్శిస్తు లేదా ఆరోపణలు చేసిన సెలబ్రిటీలపై వెంటనే కేంద్ర దర్యాప్తు సంస్ధలు సీబీఐ, ఈడీ, ఐటి దాడులు మామూలైపోయాయి. ఢిల్లీ శివార్లలో ఉద్యమాలు చేస్తున్న రైతుసంఘాలకు మద్దతు పలికిన సెలబ్రిటీల్లో కొందరిపై వెంటనే జరిగిన దాడులే దీనికి సాక్ష్యంగా నిలుస్తున్నాయి.

మరి తాజాగా విశాఖపట్నంలో జరుగుతున్న ఆందోళనకు మద్దతుగా మెగాస్టార్ చిరంజీవి మద్దతు ప్రకటించారు. విశాఖ ఉక్కును ప్రైవేటీకరించాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. కేంద్రం నిర్ణయాన్ని చిరంజీవి తప్పు పడుతు ఆందోళనకారులకు మద్దతుగా మాట్లాడారు. విశాఖ ఉక్కు ఉద్యమం జరిగిన రోజులను గుర్తు చేసుకున్నారు.

ఎప్పుడైతే విశాఖ ఆందోళనలకు మెగాస్టార్ మద్దతుగా నిలిచారో వెంటన ఆయనపై దాడులు జరుగటం ఖాయమనే ప్రచారం పెరిగిపోతోంది. తనకు ఎదురు తిరుగుతున్న లేదా నిలదీస్తున్న సెలబ్రిటీలను దాడులతో కంట్రోల్ చేయాలని కేంద్రం నిర్ణయించుకున్నట్లు ప్రచారంలో ఉంది. ఇలాంటి కారణాల వల్లే దేశంలో ఎన్ని సంస్ధలను ప్రైవేటుపరం చేస్తున్నా సెలబ్రిటీలు, మేథావులు మౌనంగా ఉన్నట్లు అనుమానంగా ఉంది.

ఒకపుడు ఇదే ఆరోపణలను కాంగ్రెస్ పార్టీపై బీజేపీ విపరీతంగా చేసేది. కానీ ఇపుడు కాంగ్రెస్ నే బీజేపీ మించిపోయిందనే చెప్పాలి. గిట్టని వారిపై దాడులు చేయిస్తున్న కేంద్రం తనకు లొంగిపోయిన వారిపైన మాత్రం ఈగ వాలన్నియటం లేదు. మొన్నటి ఎన్నికల తర్వాత టీడీపీలో నుండి బీజేపీలోకి ఫిరాయించిన రాజ్యసభ ఎంపిలు సుజనాచౌదరి, సీఎం రమేష్ ను దర్యాప్తు సంస్ధలు అస్సలు పట్టించుకోవటం లేదు. వాళ్ళు టీడీపీలో ఉన్నంత వరకు వాళ్ళపై అనేకసార్లు దాడులు జరిగిన విషయం తెలిసిందే.