Begin typing your search above and press return to search.

చైనాపై సర్జికల్ స్ట్రైక్స్ చేసే ఉద్దేశం ఉందా?

By:  Tupaki Desk   |   6 Nov 2016 4:04 AM GMT
చైనాపై సర్జికల్ స్ట్రైక్స్ చేసే ఉద్దేశం ఉందా?
X
ఉడీ ఉగ్రవాద దాడి అనంతరం పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ (పీఓకే) లోని ఉగ్రవాద శిబిరాలపై భారత సైన్యం వీరోచితంగా సర్జికల్‌ స్ట్రైక్స్‌ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో భారత్ సర్జికల్ స్ట్రైక్స్ చేసిన విషయాన్ని కూడా పాక్ ఒప్పుకోలేని స్థాయిలో భారత సైన్యం, పాక్ అప్రకటిత సైన్యం (ఉగ్రవాదులు)పై దాడిచేసింది. అయితే తాజాగా చైనా కూడా సరిహద్దుల్లో దుందుడుకుగా వ్యవహరిస్తోంది. ఈమధ్య కాలంలో లడఖ్‌ లో చైనా సైన్యం చొచ్చుకొని వచ్చినట్టు కథనాలు వచ్చాయి. భారత భూభాగంలోకి చొచ్చుకొచ్చిన చైనా అక్కడ తమ జెండా పాతేసే ప్రయత్నం చేయడం... ఆ విషయాలపై ప్రశ్నించినప్పుడు అలాంటివేమీ తాము చేయలేదని బొంకడం తెలిసిందే. ఈ నేపథ్యంలో చైనాపై కూడా సర్జికల్‌ స్ట్రైక్స్‌ చేసే ఉద్దేశం కేంద్ర ప్రభుత్వానికి ఉందా? అని ప్రశ్నిస్తోంది బీజేపీ మిత్రపక్షం శివసేన!

ఈమేరకు ప్రభుత్వాన్ని ఎప్పుడు ప్రశ్నించాలన్నా, విమర్శించాలన్నా తన అధికార పత్రిక "సామ్నా"లో ఎడిటోరియల్ రాసే శివసేన... తాజాగా సర్జికల్ స్ట్రైక్స్ పై కేంద్ర రక్షణమంత్రి మనోహర్ పరీకర్ పై స్పందించింది. ఈ సందర్భంలో రక్షణమంత్రి మనోహర్‌ పరీకర్‌ పై ఎన్నో ప్రశ్నలను సంధించిన సామ్నా... ఆయన సొంత డబ్బా కొట్టుకునే వ్యక్తి అని విమర్శించింది.

ఈ విషయాలపై సామ్నా సంపాదకీయంలోని మరికొన్ని విషయాలు ఇలా ఉన్నాయి... "పీఓకే లో జరిగిన సర్జికల్‌ స్ట్రైక్స్‌ తో మేం గర్వంగా ఉన్నాం.. పాకిస్థాన్‌ లో జరిగిన తరహాలోనే చైనాలోనూ సర్జికల్‌ స్ట్రైక్స్‌ జరిగే అవకాశముందా..? చైనా చొరబాటుకు వ్యతిరేకంగా మన సైనికులు ఇప్పటివరకూ ఏమి చర్యలు తీసుకున్నారో రక్షణమంత్రి వెల్లడించాలి.. కేవలం పాకిస్థాన్‌ కు హెచ్చరికలు జారీచేస్తే సరిపోదు.. రక్షణమంత్రిగా చైనాతో మన సరిహద్దులను భద్రంగా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఆయనపైనే కదా ఉంది.. ర్యాలీల్లో పాకిస్థాన్‌ కు వ్యతిరేకంగా మాట్లాడితే హర్షాతిరేకాలు లభిస్తాయి. రాజకీయ హర్షాతిరేకాల కోసం కాకుండా దేశ సమగ్ర భద్రతపై దృష్టి పెట్టాల్సిన తరుణమిది.. కేవలం పాకిస్థాన్‌ తో ఉన్న సరిహద్దులపైనా దృష్టి పెట్టి, ఇతర సరిహద్దుల్లో భద్రతను గాలికొదిలేసినట్టు కనిపిస్తోంది.. చైనా పట్ల మనం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరముంది.. పాకిస్థాన్‌ కు ఒక్క అంగుళం కూడా విడిచిపెట్టే ప్రసక్తి లేదని చెప్పే కేంద్రం లడఖ్‌, అరుణాచల్‌ ప్రదేశ్‌ లో చైనా, భారత భూభాగంలోకి చొచ్చుకొచ్చిన విషయంపై కూడా మాట్లాడాలి.. ఇప్పటివరకూ ఆ విషయంపై మాట్లాడకపోవడం సరికాదు" అని పేర్కొంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/