Begin typing your search above and press return to search.

ఈ 12 మంది ఎంపీల‌కు ఈసారి సీట్లు హుళ‌క్కేనా?

By:  Tupaki Desk   |   25 Aug 2022 2:30 AM GMT
ఈ 12 మంది ఎంపీల‌కు ఈసారి సీట్లు హుళ‌క్కేనా?
X
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో 175కి 175 అసెంబ్లీ సీట్లు, 25కి 25 ఎంపీ సీట్లు సాధించాల‌ని వైఎస్సార్సీపీ అధినేత, ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ఆకాంక్షిస్తున్నారు. వివిధ స‌మావేశాల్లోనూ పార్టీ ముఖ్య నేత‌ల‌కు, ఎమ్మెల్యేల‌కు, ఎంపీల‌కు ఈ దిశ‌గా క‌ర్త‌వ్య బోధ చేస్తున్నారు. గ‌డ‌ప గ‌డ‌ప‌కు మ‌న ప్ర‌భుత్వం పేరుతో ఇప్ప‌టికే ఎమ్మెల్యేలు, పార్టీ నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జులు ప్ర‌తి ఇంటికీ వెళ్తున్నారు. ఈ మూడేళ్ల‌లో రాష్ట్ర ప్ర‌భుత్వం చేసిన ల‌బ్ధిని వారికి వివ‌రించి.. మ‌రోమారు త‌మ‌ను గెలిపించాల‌ని కోరుతున్నారు.

మ‌రోవైపు ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ కూడా త‌న సొంత స‌ర్వేల‌తోపాటు ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిషోర్ ఇస్తున్న నివేదిక‌ల ఆధారంగా వ్యూహాలు ర‌చిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో 12 మంది లోక్‌స‌భ ఎంపీల‌కు ఈసారి సీట్లు హుళ‌క్కేన‌ని గాసిప్స్ వినిపిస్తున్నాయి. ప్ర‌జ‌ల‌తో స‌న్నిహిత సంబంధాలు లేనివారు, ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీ కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హించ‌నివారు, అవినీతి ఆరోప‌ణ‌లు ఉన్న‌వారు, పార్టీ కార్య‌క‌ర్త‌ల‌కు అందుబాటులో లేనివారికి ఈసారి సీట్లు ఇవ్వ‌ర‌ని చెబుతున్నారు.

ఇలాంటివారు ప్ర‌స్తుతానికి 12 మంది ఎంపీలు తేలారని.. వీరంద‌రికీ వ‌చ్చే ఎన్నిక‌ల్లో సీట్లు హుళ‌క్కేన‌ని పేర్కొంటున్నారు. అయితే వీరిలో కొంద‌రిని అసెంబ్లీకి పోటీ చేయిస్తార‌ని అంటున్నారు. త‌ద్వారా ప్ర‌జా వ్య‌తిరేక‌త‌ను కొంత‌వ‌ర‌కు తగ్గించుకునే వీలుంటుంద‌ని భావిస్తున్నారు.

వినిపిస్తున్న గాసిప్స్ ప్రకారం.. హిందూపురం (గోరంట్ల మాధ‌వ్), అనంత‌పురం (రెడ్డెప్ప‌), నెల్లూరు (ఆదాల ప్రభాక‌ర్‌రెడ్డి), బాప‌ట్ల (నందిగం సురేష్‌), ఏలూరు (కోట‌గిరి శ్రీధ‌ర్), న‌ర‌సాపురం (ర‌ఘురామ‌కృష్ణ‌రాజు), అమ‌లాపురం (చింతా అనురాధ‌), అన‌కాప‌ల్లి (స‌త్య‌వ‌తి), విజ‌య‌న‌గ‌రం (బెల్లాన చంద్ర‌శేఖ‌ర్‌), విశాఖ‌ప‌ట్నం (స‌త్య‌నారాయ‌ణ‌)ల‌కు ఈసారి సీట్లు ఇవ్వ‌ర‌ని చెబుతున్నారు.

వీరిలో ర‌ఘురామ‌కృష్ణ‌రాజు మొద‌టి నుంచీ రెబ‌ల్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఇక గోరంట్ల మాధ‌వ్‌పై ఇటీవ‌ల న్యూడ్ వీడియో కాల్ చేశార‌నే ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. ఇక బాప‌ట్ల ఎంపీ నందిగం సురేష్.. పోలీసుల‌పై ప‌లుమార్లు దౌర్జ‌న్యం చేశార‌నే విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. విశాఖ ఎంపీ స‌త్య‌నారాయ‌ణ ఏకంగా ఒక ఐఏఎస్ అధికారి స్థ‌లాన్నే క‌బ్జా చేశార‌ని విమ‌ర్శ‌లు ఎదుర్కొన్నారు.

ఇక మిగిలిన‌వారు పార్టీ క్యాడ‌ర్‌కు అందుబాటులో ఉండ‌క‌పోవ‌డం, పార్టీ కార్యక్ర‌మాలు నిర్వ‌హించ‌క‌పోవ‌డం వంటివి చేస్తున్నార‌ని టాక్. వీరిలో బెల్లాన చంద్ర‌శేఖ‌ర్ (విజ‌య‌న‌గ‌రం), స‌త్య‌వ‌తి (అనకాప‌ల్లి), కోట‌గిరి శ్రీధ‌ర్ (ఏలూరు), రెడ్డ‌ప్ప (అనంత‌పురం), ఆదాల ప్ర‌భాక‌ర్‌రెడ్డి (నెల్లూరు), నందిగం సురేష్ (బాప‌ట్ల‌) అసెంబ్లీకి పోటీ చేయిస్తార‌నే వార్త‌లు వ‌స్తున్నాయి.

ఇప్పటికే ముఖ్య‌మంత్రి జగన్ మదిలో కొంత‌మంది అభ్య‌ర్థులు ఉన్నార‌ని అంటున్నారు. అయితే ప్ర‌స్తుతానికి ఆయ‌న ఎవ‌రి పేర్ల‌నూ బ‌య‌ట‌పెట్ట‌కుండా గుంభ‌నంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని చెబుతున్నారు. కొంద‌రు ఎంపీల‌ను అసెంబ్లీకి, కొంద‌రు ఎమ్మెల్యేల‌ను పార్ల‌మెంటుకు పోటీ చేయిస్తే మంచి ఫ‌లితాలు ఉంటాయ‌ని పీకే టీమ్ కూడా జ‌గ‌న్‌కు సూచించిన‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది.