Begin typing your search above and press return to search.

కేసీఆర్ మంత్రివర్గ విస్తరణ.. ఆ నలుగురికీ చోటు?

By:  Tupaki Desk   |   10 Jun 2019 10:07 AM GMT
కేసీఆర్ మంత్రివర్గ విస్తరణ.. ఆ నలుగురికీ చోటు?
X
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు అయ్యాకా మంత్రివర్గ ఏర్పాటుకు బాగా సమయం తీసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్, ఇప్పుడు విస్తరణ మాత్రం వెను వెంటనే చేపట్టనున్నారనే వార్తలు వస్తున్నాయి. కేసీఆర్ తన కేబినెట్ లోకి కొత్త నేతలను తీసుకోబోతున్నారనే వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే నలుగురి పేర్లు కూడా ఖరారు అయినట్టుగా సమాచారం అందుతోంది.

విశేషం ఏమిటంటే.. ఈ సారి కేబినెట్ విస్తరణలో కేసీఆర్ కాంగ్రెస్ తరఫున నెగ్గిన వారికి కూడా అవకాశం ఇవ్వనున్నారట. ఇది వరకూ ఫిరాయింపు ఎమ్మెల్యే గా ఉండిన తలసాని శ్రీనివాసయాదవ్ కు కేబినెట్లో చోటు కల్పించిన కేసీఆర్ ఇప్పుడు కూడా ఫిరాయింపుదారులకు అవకాశం ఇవ్వనున్నారట.

అయితే ఇప్పుడు ఫిరాయింపు అంకమే లేదు, సీఎల్పీని టీఆర్ ఎస్ ఎల్పీలోకి విలీనం చేసేసినట్టుగా కేసీఆర్ ప్రకటించుకుంటున్నారనుకోండి. ఆ విలీనం జరిగిపోయిందని అంటున్నారు. కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేలుగా నెగ్గిన వారు తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యేలు అయిపోయినట్టుగా ప్రకటించుకుంటున్నారు. ఈ క్రమంలో కేబినెట్ విస్తరణలో వారికి అవకాశం లభించనుందట.

ఆ విషయంలో సబితా ఇంద్రా రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తూ ఉంది. ఆమెకు మంత్రి పదవి ఖరారు అయినట్టేనట కేసీఆర్ కేబినెట్లో. ఇక కేబినెట్ ఏర్పాటు చేస్తున్నప్పుడు అటు కేటీఆర్ కు, ఇటు హరీష్ రావుకు స్థానం కల్పించని కేసీఆర్ ఇప్పుడు మాత్రం వారిద్దరినీ కేబినెట్లోకి తీసుకోనున్నారని సమాచారం. మారిన రాజకీయ పరిస్థితుల్లో వారికి కేబినెట్లో చోటును ఖరారు చేశారట తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత. వీరితో పాటు వనమా వెంకటేశ్వరావు కు కూడా మంత్రి పదవి ఖరారు అయినట్టుగా వార్తలు వస్తున్నాయి.