Begin typing your search above and press return to search.

మునుగోడుపై టీఆర్ఎస్ బ్రహ్మాస్త్రం.. వర్కవుట్ అయ్యేనా..?

By:  Tupaki Desk   |   31 Oct 2022 4:12 AM GMT
మునుగోడుపై టీఆర్ఎస్ బ్రహ్మాస్త్రం.. వర్కవుట్ అయ్యేనా..?
X
మునుగోడు ఉప ఎన్నికను ఎలాగైనా గెలవాలని అధికార టీఆర్ఎస్ భావిస్తోంది. తగని ఎన్నికను తమ నెత్తిన పెట్టిన బీజేపీకి బుద్ధి చెప్పాలని.. ఆ పార్టీ అహంకారం అణచాలని కేసీఆర్ పట్టుదలగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకు తగ్గట్లే ఆ పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. మునుగోడులో బలంగా ఉన్న కమ్యూనిస్టులను కలుపుకోవడంలోనే మొదటి విజయం సాధించింది. ముందునుంచే అక్కడ మంత్రి జగదీశ్ రెడ్డికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చి మరో విజయం సాధించింది. ప్రచార భారాన్ని మొత్తం ఆయనే పర్యవేక్షిస్తున్నారు.

ఇపుడు తాజాగా మరో బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాలని టీఆర్ఎస్ చూస్తోంది. దీని ద్వారా ప్రచార సరళిని పతాకస్థాయికి తీసుకెళ్లాలని యోచిస్తోంది. స్వయంగా కేసీఆర్ సమక్షంలోనే ఇది జరగాలని.. మునుగోడుపై పట్టు బిగించాలని భావిస్తోంది. అదేమిటో కాదు.. కేసీఆర్ సభకు కేవలం ఓటర్లను మాత్రమే రప్పించాలనే ఆలోచన. కనీసం ఓటర్లలో సగం లక్ష మందినైనా సభకు తీసుకొచ్చేలా ప్రయత్నాలు చేస్తున్నారట.

30న చండూరు మున్సిపాలిటీ పరిధిలోని బంగారుగడ్డ వద్ద భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నారు. నియోజకవర్గంలో మొత్తం 71 ఎంపీటీసీ స్థానాలు ఉండడంతో ప్రతీ ఎంపీటీసీ పరిధికి ఒక ఎమ్మెల్యే లేదా మంత్రిని కేటాయించారు. ఒక్కో స్థానం నుంచి కనీసం 1500 మంది ఓటర్లను కేసీఆర్ సభకు తరలించేలా వాహనాల కేటాయింపు ఏర్పాట్లు చేసుకున్నారు. వీటి పరిధిలో ప్రతి మండలానికి ఒక ఇన్చార్జిని నియమించారు.

వాహనాల ఏర్పాట్లు.. ఓటర్ల తరలింపు.. అంతా వీరి పర్యవేక్షణలోనే జరుగుతుంది. ఒక్కో ఓటరుకు వెయ్యి నుంచి రెండు వేలు ఇచ్చే అవకాశం ఉందట. ఈ సభ విజయవంతం ద్వారా గులాబీ పార్టీ గెలుపు అవకాశాలు మెరుగుపరుచుకోవాలని చూస్తోందట. సభకు తరలించిన లక్ష మంది ఓటర్లలో కనీసం 70 శాతం ఓట్లు పడినా తమ పార్టీ గెలుపు నల్లేరుపై నడకే అవుతుందని ఆ పార్టీ ధీమాగా ఉంది.

త్రిముఖ పోరులో కనీసం 70 వేల ఓట్లు సాధించినా సరిపోతుందని టీఆర్ఎస్ భావిస్తోంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు బీజేపీ, కాంగ్రెస్ మధ్య చీలిపోతుందని.. ఎంత లేదన్నా 10 వేట్ల మెజారిటీతో బయటపడతామని ఆశాభావం వ్యక్తం చేస్తోంది.

అయితే ఇక్కడే అసలైన ట్విస్టు నెలకొంది. నిజంగానే ముక్కోణపు పోటీ జరిగితే గులాబీ పార్టీకి తిరుగేలేదు. కానీ.. వ్యతిరేక ఓటు ఎక్కువగా బీజేపీ చీల్చితే.. కాంగ్రెస్ అభ్యర్థికి మెజారిటీ కూడా రాకుండా పోతే హుజూరాబాద్ సీన్ రిపీట్ అవుతుంది. అపుడు కేసీఆర్ నోట్లో పచ్చి వెలక్కాయ పడక తప్పదు. చూడాలి మరి ఏం జరుగుతుందో..!



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.