Begin typing your search above and press return to search.

విజ‌య‌శాంతి బీజేపీలో క‌రివేపాకేనా?

By:  Tupaki Desk   |   6 July 2021 9:30 AM GMT
విజ‌య‌శాంతి బీజేపీలో క‌రివేపాకేనా?
X
పొలిటిక‌ల్ ఫైర్ బ్రాండ్ రాముల‌మ్మ క‌థేంటి? ఆమెకు ఫ్యూచర్ ఉందా? రాజ‌కీయాల్లో ఏదో సాధించాల‌నే ఆమె త‌పన ఎప్ప‌టికి తీరుతుంది? అస‌లు ఇప్పుడున్న రాజ‌కీయాల్లో రాణింపు ఎంత ఉంటుంది? ఇవీ.. ఇప్పుడు బీజేపీ నాయ‌కురాలిగా ఉన్న లేడీ అమితాబ్ విజ‌య‌శాంతి గురించి రాజ‌కీయ వ‌ర్గాల్లో జ‌రుగుతున్న హాట్ హాట్ చ‌ర్చ‌. సినీ ఫీల్డ్ నుంచి రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన హీరోలు ఉన్నారు కానీ.. హీరోయిన్లు చాలా చాలా త‌క్కువ మంది ఉన్నారు. ఇలాంటి వారిలో విజ‌య‌శాంతి ఒక‌రు. తెలంగాణ ఉద్య‌మ స‌మ‌యానికి ముందుగానే ఆమె రాజకీయ రంగువేసుకున్నారు.

ఈ క్ర‌మంలో తొలుత బీజేపీతో ఆమె రాజ‌కీయ ప్ర‌స్థానం ప్రారంభ‌మైంది. అయితే.. త‌ర్వాత‌.. తెలంగాణ ఉద్య‌మం ప్ర‌భావంతో సొంత పార్టీ పెట్టుకున్నారు. ఇది వ‌ర్క‌వుట్ కాక‌పోవ‌డంతో అప్ప‌ట్లోనే టీఆర్ ఎస్‌లో పార్టీని విలీనం చేసి.. మెద‌క్ నుంచి ఎంపీగా టీఆర్ ఎస్ టికెట్‌పై పోటీ చేసి విజ‌యం ద‌క్కించుకున్నారు. ప్ర‌స్తుత సీఎం, టీఆర్ ఎస్ అధినేత‌.. కేసీఆర్ ను దేవుడిచ్చిన అన్న‌గా పేర్కొంటూ.. ఆయ‌న వెనుక ఉద్య‌మ బాట‌లో దూకుడు ప్ర‌ద‌ర్శించారు. పార్ల‌మెంటులోనూ ఉద్య‌మాన్ని చేసి.. గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే.. త‌ర్వాత త‌లెత్తిన విభేదాల‌తో కొన్నాళ్లు.. రాజ‌కీయాల‌కు దూరంగా ఉన్నారు.

అయితే.. ఆ త‌ర్వాత‌.. మ‌ళ్లీ కాంగ్రెస్ బాట ప‌ట్టారు. కాంగ్రెస్‌లో గుర్తింపు కొరుకున్నారు.కానీ, అంత‌ర్గ‌త ప్ర‌జాస్వామ్యం ఎక్కువ‌గా ఉన్న కాంగ్రెస్‌లో ఆమెను ప‌ట్టించుకునే నాథుడు క‌నిపించ‌లేదు. కొన్నాళ్ల కింద‌ట జ‌రిగిన దుబ్బాక ఉప ఎన్నిక‌లో టికెట్ కోసం ప్ర‌య‌త్నించారు. కానీ,ద‌క్క‌లేదు. దీంతో మ‌ళ్లీ బీజేపీ వైపు అడుగులు వేశారు. ఇటీవ‌లే బీజేపీ కండువా క‌ప్పుకొన్నారు. కానీ, విజ‌య‌శాంతి ఇక్క‌డ కూడా ఇమిడే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు. దీనికి ప్ర‌ధాన కార‌ణం.. ఆమె దూకుడుగా లేక‌పోవడం.. స‌బ్జెక్ట్‌పై ప‌ట్టు అంత‌క‌న్నా లేక పోవ‌డ‌మ‌న‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

ప్ర‌స్తుతం తెలంగాణ బీజేపీలో పార్టీ రాష్ట్ర‌చీఫ్ బండి సంజ‌య్‌, కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డిల మ‌ధ్యే వార్ జోరుగా న‌డుస్తోంది. ఒక‌రిపై ఒక‌రు స‌త్తా చూపించుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్నార‌నే వాద‌న వినిపిస్తోంది. అదేస‌మ‌యంలో ఎంపీ అర్వింద్‌, ఎమ్మెల్యే ర‌ఘునంద‌న్‌రావు వంటివారి దూకుడు ఎక్కువ‌గా ఉండ‌డంతో విజ‌య‌శాంతిని బీజేపీలో ఎవ‌రూ లెక్క‌చేయ‌డం లేద‌నే టాక్ వినిపిస్తోంది. ఏదో ఆవేశంతో .. రెండు డైలాగులు పేల్చ‌డ‌మే త‌ప్ప‌.. విజ‌య‌శాంతికి స‌బ్జెక్టు లేద‌ని అంటున్నారు. చివ‌ర‌కు బీజేపీ క‌ర్రీలో విజ‌య‌శాంతి క‌రివేపాకు కావ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు. అయిన‌ప్ప‌టికీ.. రాజ‌కీయాల్లో మ‌హిళ‌లు రాణించాల‌ని మ‌నం కోరుకుందాం!!