Begin typing your search above and press return to search.

విశాఖ... రాజకీయ రాజధాని...?

By:  Tupaki Desk   |   14 Oct 2021 11:30 AM GMT
విశాఖ... రాజకీయ రాజధాని...?
X
విశాఖకు ఎన్నో పేర్లు ఉన్నాయి. ఐటీ రాజధాని, టూరిజం సిటీ, కల్చలర్ సిటీ, ఆర్ధిక రాజధాని ఇలా ఎన్నో రకాలుగా పిలుచుకుంటూ వచ్చారు. అయితే జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏకంగా పరిపాలనా రాజధానిగా చేశారు. సరే అది న్యాయ సమీక్షలో ఉంది కాబట్టి ఇంకా అమలు కాలేదు కానీ ఇపుడు విశాఖను మాత్రం అంతా కలసి ఒక విధంగా రాజధానిగా గుర్తిస్తున్నారు అనే చెప్పాలి. ఒక మాటలో చెప్పుకుంటే వైసీపీ వచ్చాక విశాఖ మీద రాజకీయ పార్టీల ఫోకస్ బాగా పెరిగింది.

ఏదోనాడు విశాఖ రాజధాని తప్పకుండా అవుతుంది అన్న నమ్మకమో, ఏపీలో అతి పెద్ద సిటీగా ఉందన్న ఆలోచనో, లేక ఉత్తరాంధ్రా జిల్లాలు ఏపీలో అధికారానికి అతి కీలకం అన్న లెక్కలు చూసుకుంటున్నారో తెలియదు కానీ విశాఖ అంటే అన్ని రాజకీయ పార్టీలు తెగ మోజు పడుతున్నాయి. విశాఖ టీడీపీకి కంచుకోట అని చంద్రబాబు భావిస్తున్నారు. దాన్ని రుజువు చేసుకోవడానికి, ఈ ప్రాంతంలో పసుపు పరిమళాలు మరింతగా గుభాళింపచేయడానికి ఆయన ఏకంగా వచ్చే ఎన్నికల్లో విశాఖ నుంచి పోటీ చేయడానికి రెడీ అవుతున్నారని ఇప్పటికే వార్తలు వచ్చాయి. కుప్పం సీటుని ఉంచుకుంటూనే రెండవ సీటుగా విశాఖ నుంచి బాబు పోటీ చేస్తారని అంటున్నారు. ఆ విధంగా బాబు రంగంలో ఉంటే టీడీపీకి అది ప్లస్ అవుతుంది అన్నది తమ్ముళ్ళ ఆలోచనగా చెబుతున్నారు.

ఇక ఇంకో వైపు చూసుకుంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా పోయిన చోటనే వెతుక్కోవాలని అనుకుంటున్నారు. ఆయన గత ఎన్నికల్లో విశాఖ లోని గాజువాక నుంచే పోటీ చేశారు. అయితే ఓడిపోయారు. ఇపుడు మరోసారి తన అదృష్టాన్ని విశాఖ నుంచే పరీక్షించుకుందామని పవన్ ఆలోచిస్తున్నారులా ఉంది. ఆయన చేస్తే గాజువాక లేకపోతే పెందుర్తి, భీమిలీ అన్న ఆలోచనలో ఉన్నారని టాక్. ఇవన్నీ ఈ మధ్య వస్తున్న వార్తలే. అయితే అన్నింటి కంటే సెన్సేషనల్ న్యూస్ ఏంటి అంటే ముఖ్యమంత్రి జగన్ కూడా ఉత్తరాంధ్రా వైపు చూడడం, ఇది నిజంగా సంచలనమైన న్యూసే. ఎందుకంటే పులివెందుల జగన్ కి గట్టి కంచు కోట. ఆయన అక్కడ నుంచి ఇప్పటికి రెండు సార్లు పోటీ చేశారు. ఇక ఆయన తండ్రి వైఎస్సార్ ఎన్నో సార్లు ఎమ్మెల్యేగా నెగ్గిన చోటు అది. అలాంటి పులివెందులలో పోటీ చేస్తూనే ఉత్తరాంధ్రాలోని ఎఓ జిల్లాలో ఒక సీటు నుంచి అసెంబ్లీకి పోటీ చేయాలని జగన్ భావిస్తున్నారు అన్నది వైసీపీ వర్గాల టాక్. నిజంగా ఇదే నిజమైతే ఉత్తరాంధ్రా రాజకీయ కార్యక్షేత్రం అవుతుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

ఈ విషయం మీద జగన్ పట్టుదలగా ఉన్నారని చెబుతున్నారు. ఈ మేరకు ఆయన తన పార్టీ నేతలతో మాట్లాడారని చెబుతున్నారు. 2019 ఎన్నీక్లో వైసీపీ ఉత్తరాంధ్రా జిల్లాల్లాలను దాదాపుగా స్వీప్ చేసింది. ఈసారి కూడా ఆ మ్యాజిక్ కంటిన్యూ చేయాలి అంటే మాత్రం జగన్ ఉత్తరాంధ్రా నుంచి బరిలో ఉండడమే బెటర్ అని కూడా వైసీపీ నేతలు భావిస్తున్నారుట. అంతే కాదు విశాఖను క్యాపిటల్ సిటీగా ప్రకటించిన జగన్ తన పట్టుదల, చిత్తశుద్ధిని నిరూపించుకోవడానికి ఉత్తరాంధ్రా వస్తున్నట్లుగా చెబుతున్నారు. మొత్తానికి మూడు ప్రధాన పార్టీలు, ముగ్గురు కీలక నేతలు ఉత్తరాంధ్రా మీద ఫోకస్ పెట్టారు అంటే రాజకీయ రాజధానిగా విశాఖను వారు అంతా ఓకే చేశారనే అంతా అంటున్నారు.