Begin typing your search above and press return to search.

కేసీఆర్ కామెంట్లకు ఓట్లు ప‌డ‌తాయా? సాగ‌ర్ స‌మ‌రంలో కీల‌క‌ఘ‌ట్టం!

By:  Tupaki Desk   |   14 April 2021 5:30 PM GMT
కేసీఆర్ కామెంట్లకు ఓట్లు ప‌డ‌తాయా? సాగ‌ర్ స‌మ‌రంలో కీల‌క‌ఘ‌ట్టం!
X
తెలంగాణ‌లోని నాగార్జున సాగ‌ర్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గానికి ఈ 17న జ‌ర‌గ‌నున్న ఉప ఎన్నిక నేప‌థ్యంలో అధికార పార్టీ టీఆర్ ఎస్ నిర్వ‌హించ ద‌ల‌చిన హాలియా బ‌హిరంగ స‌భ ముగిసింది. ఇదో కీల‌క ఘ‌ట్ట‌మ‌ని.. ప్ర‌జ‌ల‌ను త‌మ‌వైపు తిప్పుకొనేందుకు దీనికి మించింది లేద‌ని ఇప్ప‌టి వ‌ర‌కు భావించిన అధికార పార్టీకి ఇది ఏమేర‌కు ప్ర‌యోజ‌నం చేకూర్చుతుంద‌నేది ఇప్పుడు ప్ర‌ధానంగా చ‌ర్చ‌కు వ‌స్తున్న విష‌యం. వాస్త‌వానికి సాగ‌ర్ స‌మరం ఏక‌ప‌క్షంగా మారుతుంద‌ని అధికార పార్టీ భావించింది. సెంటిమెంటు పండుతుంద‌ని అనుకుంది. పైగా బీజేపీ నుంచి ఎస్టీ వ‌ర్గానికి చెందిన అభ్య‌ర్థిని ఇక్క‌డ నిల‌బెట్ట‌డం కూడా త‌మ‌కు క‌లిసి వ‌స్తుంద‌ని అనుకుంది.

కానీ, ఇక్క‌డ అంత‌ర్గ‌తంగా అధికార పార్టీ నిర్వ‌హించిన స‌ర్వేలో.. కాంగ్రెస్ అభ్య‌ర్థి, సీనియ‌ర్ పొలిటీషియ‌న్‌, మాజీమంత్రి జానా రెడ్డికి ఎడ్జ్ ఉంద‌ని.. గ‌త ఎన్నిక‌ల్లో ఆయ‌న ఓడిపోయిన తీరుకు సింప‌తీ పెరిగింద‌ని పెద్ద ఎత్తున వ్యాఖ్య‌లు వినిపించాయి. దీంతో ఏకంగా రంగంలోకి కేసీఆర్ దిగిపోయారు. హాలియా స‌భ‌ను ల‌క్ష‌మందితో నిర్వ‌హించేందుకు ప్లాన్ చేసుకున్నారు. అయితే.. ఆదిలో పురుటి నొప్పులు ఎదురైనావాటిని అధిగ‌మించి స‌భ పెట్టారు. ఇక‌, త‌న ప్ర‌సంగంలో ఆసాంతం .. కాంగ్రెస్‌ను టార్గెట్ చేసుకున్నారు. అదేస‌మ‌యంలో తెలంగాణ సెంటిమెంటును.. న‌ల్ల‌గొండ‌కు జోడించి మ‌రీ వ్యాఖ్య‌లు సంధించారు. న‌ల్ల‌గొండ‌మీద త‌న‌కు అపార‌మైన ప్రేమ ఉంద‌ని.. అందుకే న‌ల్ల‌గొండ క‌ష్టాలు నేప‌థ్యంగా తాను గీతాలు సైతం ర‌చించాన‌ని చెప్పుకొచ్చారు.

ఇక‌, నోముల భ‌గ‌త్‌కు ఇప్పుడు వ‌స్తున్న ఆద‌ర‌ణ ఓట్ల రూపంలో క‌నిపించాల‌ని పిలుపునిస్తూనే.. జానాను మైన‌స్ చేసే ప్ర‌య‌త్నం చేశారు. ఇక‌, అధికార పార్టీ నుంచి కీల‌క ఘ‌ట్టం ముగిసిన నేప‌థ్యంలో ఇప్పుడు ఏం జ‌రుగుతుంది? సాగ‌ర్ స‌మ‌రంలో ప్ర‌జ‌లు ఎలాంటి తీర్పు ఇవ్వ‌నున్నారు? ఈ రెండు మూడు రోజుల్లో ఎలాంటి వ్యూహాలు మారిపోతున్నాయి? అనేది కీల‌కంగా మారింది. జానా వైపు ఎడ్జ్ ఉంద‌ని స‌ర్వేలు దాదాపు తేల్చేసిన నేప‌థ్యంలో కేసీఆర్ రంగంలోకి దిగారు. అంటే.. ఇక్క‌డ ఓడిపోతే.. కేసీఆర్‌కు పెద్ద న‌ష్ట‌మే జ‌రుగుతుంది. పైగా ఆయ‌న చెప్పుకొచ్చిన ప‌థ‌కాలు, తెలంగాణ రాష్ట్రం కోసం తాను ప‌డ్డ క‌ష్టాలు అన్నీ కూడా ప్ర‌జ‌లు మ‌రిచిపోయార‌నే భావించాల్సి ఉంటుంది.

మ‌రో వైపు కాంగ్రెస్ కూడా ఇదే రేంజ్‌లో అధికార పార్టీపై విరుచుకుప‌డుతోంది. కేసీఆర్ ప్ర‌భుత్వం ఏర్ప‌డి ఏడు సంవ‌త్సరాలు..(రెండు ద‌ఫాలు క‌లిపి) దాటుతోంద‌ని.. మ‌రి ఆయ‌నేం చేశార‌ని ఇక్క‌డి నేత‌లు ప్ర‌తి విమ‌ర్శ‌లు ప్రారంభించారు. అంతేకాదు.. జానా పై కేసీఆర్ చేసిన విమ‌ర్శ‌లు భ‌గ‌త్ ఓట‌మిని అంగీక‌రిస్తున్న‌ట్టుగానే ఉన్నాయ‌క‌ని చెప్ప‌డం కూడా గ‌మ‌నార్హం. ఏదేమైనా అధికార పార్టీ అత్యంత కీల‌కంగాతీసుకున్న సాగ‌ర్ ఎన్నిక‌లు ఏమేర‌కు ఫ‌లిస్తాయో చూడాల‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.