Begin typing your search above and press return to search.

వీవీఎస్ లక్ష్మణ్ పోటీచేసేది ఆ నియోజకవర్గం నుంచేనా?

By:  Tupaki Desk   |   29 Oct 2021 3:30 AM GMT
వీవీఎస్ లక్ష్మణ్ పోటీచేసేది ఆ నియోజకవర్గం నుంచేనా?
X
ప్రముఖ మాజీ క్రికెటర్.. హైదరాబాదీ వీవీఎస్ లక్ష్మణ్ త్వరలోనే ఓ పార్టీ వాడు కాబోతున్నట్టు తెలిసింది. ఆయన రాజకీయాల్లోకి రాబోతున్నట్టు సమాచారం. దేశంలో అధికారంలో ఉన్న బీజేపీలో చేరనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఈ విషయమై బీజేపీ జాతీయ నేతలతో చర్చలు జరిపినట్లు సమాచారం. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో ఎలాగైనా అధికారం దక్కించుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ అందివచ్చిన ఏ అవకాశాన్ని విడిచిపెట్టడం లేదు. ఈ నేపథ్యంలోనే ప్రజా బలం ఉన్న నేతలతోపాటు ప్రముఖులు, క్రీడాకారులపైనా కన్నేసింది. ఈ నేపథ్యంలోనే వీవీఎస్ లక్ష్మణ్ ను బీజేపీలోకి ఆహ్వానించినట్లుగా తెలుస్తోంది.

వీవీఎస్ లక్ష్మణ్ చేరికకు అమిత్ షా సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా పార్టీ నేతలు చెబుతున్నారు. అంతర్జాతీయంగా ఎన్నో వన్డేలు, టెస్టు మ్యాచ్ లు ఆడిన టీమిండియాకు అద్భుత విజయాలు అందించిన లక్ష్మణ్ 2012లో రిటైర్ మెంట్ ప్రకటించాడు. ఆయన ఐపీఎల్ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు మెంటార్ గా వ్యవహరిస్తున్నారు.

ప్రస్తుతం దుబాయ్ లో జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ లో కామెంటేటర్ గా వీవీఎస్ లక్ష్మణ్ పనిచేస్తున్నారు. ఈ క్రమంలోనే రాజకీయాల్లోకి రావాలన్న ఆసక్తి కనబరిచారు. బీజేపీ నేతలు ఆయనను సంప్రదించడంతో ఓకే చెప్పినట్లు సమాచారం. ఇప్పటికే ప్రముఖ క్రికెటర్లు గౌతం గంభీర్, సిద్దూ, సహా చాలా మంది రాజకీయాల్లో రాణిస్తున్నారు. లక్ష్మణ్ కూడా ఇప్పుడు రాజకీయాల బాటపట్టారు.

వచ్చే ఎన్నికల్లో లక్ష్మణ్ హైదరాబాద్ పరిధిలోని క్రికెటర్లు, సంపన్నులు ఎక్కువగా ఉన్న జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి పోటీచేస్తారని చెబుతున్నారు. అక్కడంతా క్లాస్ ఏరియా కావడం.. క్రీడాకారులకు గుర్తింపు ఉండడంతో లక్ష్మణ్ కు అదే నియోజకవర్గం సరైందని ఎంపిక చేసినట్టు సమాచారం.