Begin typing your search above and press return to search.

బీజేపీ నేతలకు మోడీ దిశానిర్దేశంతో వైసీపీకి చిక్కులేనా?

By:  Tupaki Desk   |   12 Nov 2022 4:44 AM GMT
బీజేపీ నేతలకు మోడీ దిశానిర్దేశంతో వైసీపీకి చిక్కులేనా?
X
ప్రధాని నరేంద్ర మోడీ విశాఖపట్నంలో రెండు రోజుల పర్యటనకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఆయన బీజేపీ ఏపీ నాయకులతో భేటీ అయ్యారు. ఏపీలో పార్టీ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.

వైసీపీ ప్రభుత్వ అవినీతి, వైఫల్యాలపై మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు చార్జిషీట్లు రూపొందించాలని పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. మోడీతో జరిగిన భేటీలో ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పురందేశ్వరి, ఎంపీలు జీవీఎల్‌ నరసింహారావు, సీఎం రమేష్, మాజీ ఎంపీలు సుజనా చౌదరి, టీజీ వెంకటేష్, ఎమ్మెల్సీ మాధవ్, బీజేపీ ఏపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్దన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ప్రధాని మోడీ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై సంతకాల సేకరణ చేయాలని నేతలకు సూచించారు. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధికి కేటాయిస్తున్న నిధులు, అందిస్తున్న పథకాలను ప్రజలకు వివరించాలని ఆదేశించారు.

ఒకప్పుడు గుజరాత్, కర్ణాటక, ఏపీల్లో పార్టీ పరిస్థితి ఒకేలా ఉండేదని.. ఆ రెండు రాష్ట్రాల్లో పార్టీ అధికారంలో ఉందని మోడీ గుర్తు చేశారు. ఏపీలో మాత్రం రాష్ట్రంలో పార్టీ పరిస్థితి బాలేదని.. పార్టీ పటిష్టానికి కృషి చేయాలని ఆదేశించినట్టు తెలుస్తోంది.

పక్షపాతం లేకుండా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధికి ఎంతో కృషి చేస్తోందని మోడీ తెలిపారు. వీటిని ప్రజలకు వివరించాలని సూచించారు. అదేవిధంగా మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వ అవినీతి, లోపాలు తీవ్రస్థాయిలో ఎండగట్టాలని కోరారు. రాజకీయాల్లో నిత్యం వేగంగా ఉండకపోతే మన స్థానాన్ని మరొకరు ఆక్రమించేస్తారని హెచ్చరించారు. సమస్య చిన్నదా పెద్దదా అని చూడకుండా స్థానిక సమస్యలు, పరిష్కారం కోసం నిత్యం గళమెత్తుతూనే ఉండాలని బీజేపీ శ్రేణులకు స్పష్టమైన కార్యాచరణను సూచించారు.

ఉప ప్రధానిగా ఎల్‌కే అద్వానీ ఉన్నప్పుడు రోడ్డు ప్రారంభానికి పిలిస్తే ఆయన వెళ్లడానికి తొలుత సంకోచించారని మోడీ ఆసక్తికర సంఘటను నేతలతో పంచుకున్నారు. రోడ్డు ప్రారంభానికి వెళ్లి వచ్చాక సంతృప్తి వ్యక్తం చేశారన్నారు.

అలాగే ప్రస్తుతం తాను వందే భారత్‌ రైళ్లను స్వయంగా జెండా ఊపి ప్రారంభిస్తున్న విషయాన్ని కూడా మోడీ గుర్తు చేశారు. ఈ కార్యక్రమానికి తాను వెళ్లాల్సిన అవసరం లేదన్నారు. అయితే.. మనం చేస్తున్న పని గురించి నలుగురికీ చెప్పుకోవాలి కాబట్టే వెళ్తున్నానని తెలిపారు. అలాగే మీరు కూడా కేంద్రం అందిస్తున్న పథకాల గురించి ప్రజలకు వివరించాలన్నారు.

అంగన్‌వాడీల దగ్గర పిల్లలకు పోషకాహారం సక్రమంగా అందుతుందో, లేదో బీజేపీ మహిళా మోర్చా నేతలు పరిశీలించాలని కోరారు. యువకులకు కబడ్డీ, వాలీబాల్‌ పోటీలను నిర్వహించాలని సూచించారు. ఇలాంటి కార్యక్రమాల ద్వారా పార్టీని ప్రజలకు చేరువ చేయొచ్చని సూచించారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.