Begin typing your search above and press return to search.

నెల్లూరు జిల్లాలో ఆ సీనియర్ ఎమ్మెల్యేకు ఈసారి టికెట్ లేనట్లేనా?

By:  Tupaki Desk   |   3 Oct 2021 8:30 AM GMT
నెల్లూరు జిల్లాలో ఆ సీనియర్ ఎమ్మెల్యేకు ఈసారి టికెట్ లేనట్లేనా?
X
కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. మారిన పరిస్థితులకు తగ్గట్లు మారకుంటే.. మనమే మారిపోవాల్సి ఉంటుందన్న మాట తరచూ వినిపిస్తూ ఉంటుంది. అయితే.. ఈ విషయాన్ని తలపండిన నేతలు సైతం ఒక్కోసారి మర్చిపోతుంటారు. నెల్లూరు జిల్లాలో సీనియర్ నేతగా సుపరిచితుడు.. వైఎస్ హయాంలో ఒక వెలుగు వెలిగిన మాజీ మంత్రి కమ్ వెంకటగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి తీరు ఇప్పుడు హాట్ హాట్ చర్చకు దారి తీస్తోందని చెబుతున్నారు. తరచూ గతాన్ని ప్రస్తావిస్తూ అప్పట్లో తానెంతలా చక్రం తిప్పానన్న విషయాన్ని చెప్పుకోవటం మినహా ఇప్పుడు మరేం చేయలేకపోతున్నట్లుగా చెప్పాలి.

ఎవరు తనను లెక్క చేయటం లేదన్న వేదన ఆయన తన సన్నిహితుల వద్ద వ్యక్తం చేస్తుంటారని చెబుతారు. మారిన సమీకరణాల్ని అర్థం చేసుకోకుండా.. పాత రోజుల్లోనే ఉంటూ ఇంకా తన మాట చెల్లాలని.. తనదే పైచేయిలా ఉండాలనే మొండితనం ఇప్పుడు ఆయనకు శాపంగా మారుతుందని చెబుతున్నారు. స్వేచ్ఛగా ఉంటానన్న పేరుతో పార్టీ లైను దాటేసే ఆయన తీరుపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. వైఎస్ హయాంలో మంత్రిగా ఉన్న ఆయన.. రాష్ట్ర విభజన తర్వాత ఆనం బ్రదర్స్ ఇద్దరూ టీడీపీలో చేరటం తెలిసిందే. ఆ సమయంలో ఆనం రామనారాయణ రెడ్డి వైసీపీలో చేరేందుకు ప్రయత్నించినా.. సానుకూలత వ్యక్తం కాలేదు. దీంతో ఆయన తన సోదరుడితో పాటు టీడీపీలో చేరక తప్పింది కాదు.

అనారోగ్యంతో ఆనం వివేకా మరణించటం.. ఆ తర్వాత నుంచి టీడీపీకి దూరంగా ఉంటూ వచ్చిన ఆయన 2019 ఎన్నికల్లో నానా పాట్లు పడి.. పలువురి చేత చెప్పించుకొని వైసీపీలో చేరారని చెబుతారు. అనంతరం జగన్ సూచనతో వెంకటగిరి నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. అనంతరం జగన్ ప్రభుత్వంలో మంత్రి పదవి కోసం విపరీతంగా ప్రయత్నాలు చేశారు. తనదైన టీం ఉండాలన్న జగన్ ఆలోచనతో ఆయనకు మంత్రి పదవి దక్కలేదు.

అదే సమయంతో తన కంటే చాలా జూనియర్లు అయిన తన జిల్లాకు చెందిన అనిల్ కుమార్ .. మేకపాటి గౌతంకు మంత్రిపదవి దక్కటంతో ఆయన జీర్ణించుకోలేని పరిస్థితి. జిల్లాకు ఇద్దరు మంత్రులు ఉన్నా.. వారంతా తన కంటే చాలా చిన్నవారన్న పేరుతో వారి మీద అధిక్యతను ప్రదర్శించే ప్రయత్నం చేయటం.. ఆనం తీరుకు విసిగిపోయిన వారు తమ సత్తా చాటటంతో ఆయన పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారింది. అయినప్పటికీ తన ప్రస్తుత స్థాయిని గుర్తించకుండా.. అదే పనిగా వ్యవహరిస్తున్న తీరు పార్టీకి ఇబ్బందికరంగా మారిందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో ఆయనకు జగన్ టికెట్ ఇచ్చే అవకాశం కూడా తక్కువన్న మాట వినిపిస్తోంది. అదే జరిగితే.. అది పూర్తిగా చేతులారా చేసుకున్నదే తప్పించి మరొకటి కాదన్న మాట వినిపిస్తోంది.