Begin typing your search above and press return to search.

బాబు హామీని జగన్ అమలు చేయాలా?

By:  Tupaki Desk   |   17 July 2019 4:30 AM GMT
బాబు హామీని జగన్ అమలు చేయాలా?
X
కాపులకు రిజర్వేషన్లపై టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు సీఎం హోదాలో ఇచ్చిన హామీని అమలు చేసే బాధ్యత ఇప్పుడు ఏపీకి కొత్త సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిదా? అదెలా సాధ్యపడుతుంది? అంటే... సాధ్యపడాల్సిందేనన్నది ఏపీ అసెంబ్లీలో విపక్ష హోదాను దక్కించుకున్న టీడీపీ వాదన. ఈ వాదనను టీడీపీ వాదన అనేకంటే... కాపులకు రిజర్వేషన్లు కేటాయిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చి మరీ దానిని ఐదేళ్ల పాటు అటకెక్కించేసి... ఇప్పుడు నింపాదిగా తానిచ్చిన హామీ అయినా కూడా జగన్ అమలు చేయాల్సిందేనని స్వయంగా చంద్రబాబే పట్టుబుతున్నారని చెబితే బాగుంటుందేమో. మంగళవారం నాటి అసెంబ్లీ సమావేశాలను పరిశీలించిన వారికి ఎవరికైనా ఇదే భావన వస్తుంది.

సభలో కాపులకు రిజర్వేషన్లపై జరిగిన చర్చలో జగన్, చంద్రబాబుల మధ్య మాటల యుద్దం నడిచింది. కాపులకు రిజర్వేషన్లు ఇస్తానని తాము గతంలో హామీ ఇచ్చిన మాట వాస్తవమేనని చెప్పిన చంద్రబాబు... ఆ హామీ అమలులో భాగంగానే అధ్యయనం కోసం కమిటీ వేశామని చెప్పారు. కమిటీ నివేదిక ఇచ్చేసిన తర్వాత కాపులకు రిజర్వేషన్ల అమలుకు తాము సిద్ధంగా ఉన్నామని, దానికి ఆమోద ముద్ర వేయాలంటూ కేంద్రానికి నివేదించామని ఆయన పేర్కొన్నారు. అయితే కేంద్రం ఆ ప్రతిపాదనను పట్టించుకున్న దాఖలానే లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాము పంపిన ప్రతిపాదనను పట్టించుకోని కేంద్రం... ఎన్నికలకు ముందు అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్లను కల్పిస్తూ నిర్ణయం తీసుకుందని చెప్పారు. ఆ 10 శాతంలో 5 శాతం రిజర్వేషన్లను కాపులకు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నామన్నారు.

ఈ లోగా ఎన్నికల నోటిపికేషన్ రావడంతో అది వాయిదా పడిపోయిందని, ఇప్పుడు ఎన్నికలు ముగిసిపోయాయి... గతంలో తాము అధికారంలో ఉండగా కాపులకు 5 శాతం రిజర్వేషన్లపై తాము తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేయాలని చంద్రబాబు పట్టుబట్టారు. అసలు తాము తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేస్తారా? లేదా? అని కూడా చంద్రబాబు డిమాండ్ చేశారు. దీనికి కౌంటర్ ఇచ్చిన జగన్... అగ్రవర్ణ పేదలకు కేంద్రం కేటాయించిన రిజర్వేషన్లను మనమెలా విడగొడతామని తనదైన శైలి సమాదానాన్ని ఇచ్చారు. కాపులకు రిజర్వేషన్లు అంటూ అమలు కాని హామీ ఇచ్చి, కాపులను మోసం చేశారని జగన్ ఆరోపించారు. రిజర్వేషన్ల అంశం కేంద్రం పరిధిలో ఉందన్న విషయాన్ని కూడా మరిచి హామీలిస్తారా? అంటూ బాబును నిలదీశారు.

ఈ సందర్బంగా కాపులకు రిజర్వేషన్లు ఇస్తామని దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి కూడా హామీ ఇచ్చి అమలు చేయని విషయాన్ని ప్రస్తావించిన చంద్రబాబు... తాను కాపులను మోసగిస్తే, వైఎస్ చేసిందేమిటని ప్రశ్నించారు. అయినా కాపులకు రిజర్వేషన్లపై ఎప్పుడో 15 ఏళ్ల క్రితం ఇచ్చిన హామీలను ఇప్పటికీ ప్రస్తావించడం ఎంతవరకు సబబని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా కాపులకు రిజర్వేషన్ల అంశం కేంద్రం పరిధిలోనిదన్న విషయాన్ని తాను గతంలోనే తేల్చి చెప్పానని, ఇందులో మరో మాట లేదన్నట్లుగానే జగన్ తన వైఖరిని స్పష్టం చేశారు. అంతేకాకుండా కాపులకు అమలు సాధ్యం కాని హామీలిచ్చి, వాటిని అధికారంలో ఉండగా అమలు చేయకుండా... తమను అమలు చేయాలని చెప్పడమేమిటంటూ జగన్ సంధించిన ప్రశ్నలకు టీడీపీ శిబిరం నుంచి సైలెన్స్ సమాధానమైందన్న వాదన వినిపించింది. అయినా తాము ఇచ్చిన హామీలను అమలు చేయాలంటూ వైరి వర్గంపై బాబు విరుచుకుపడటం ఏమిటో కూడా అర్థం కావడం లేదన్న వాదన కూడా వినిపిస్తోంది. మొత్తంగా కాపులకు రిజర్వేషన్లపై మంగళవారం నాటి సభలో ఆసక్తికర సంవాదం జరిగిందనే చెప్పాలి.