Begin typing your search above and press return to search.

జగన్ సర్కారు తీరు మరోలా ఉంటే బాబు - పవన్ కలిసేవారా?

By:  Tupaki Desk   |   19 Oct 2022 1:59 AM GMT
జగన్ సర్కారు తీరు మరోలా ఉంటే బాబు - పవన్ కలిసేవారా?
X
రాజకీయాల్లో తొండి ఆడటం కొత్తేం కాదు. తమకు అనుకూలంగా లేని విషయాలను ఎలా ప్రచారం చేస్తారన్న విషయం ఏపీ అధికార పక్షాన్ని చూస్తే ఇట్టే అర్థమవుతుంది. తాము చేయాల్సిందంతా చేసి.. తమ తప్పుల్ని కప్పిపుచ్చుకుంటూ మాట్లాడే మాటలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. కోట్లాది మంది చూస్తున్న విషయాన్ని తమకు తగ్గట్లుగా వండి వార్చే వైనం చూస్తే అవాక్కు అవ్వాల్సిందే. తమ తీరుతోనే అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయన్న విషయాన్ని వదిలేసి.. బాబు - పవన్ భేటీని ముసుగు తొలగిందంటూ విరుచుకుపడటం గమనార్హం. మొత్తంగా చూస్తే.. 2024లోజరిగే సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన కీలక పరిణామం మంగళవారం (అక్టోబరు 18) చోటు చేసుకుంది.

గడిచిన కొంతకాలంగా టీడీపీ - జనసేనలు కలుస్తాయని.. వారిద్దరూ కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తారన్న ప్రచారం సాగుతున్నప్పటికీ.. అందుకు తగిన సందర్భం ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పుణ్యమా అని దొరికినట్లుగా చెప్పాలి.

శనివారం జనసేన అధినేతపవన్ కల్యాణ్ విశాఖపట్నానికి వెళ్లటం తెలిసిందే. ఆయనకు స్వాగతం పలికేందుకు ఎయిర్ పోర్టుకు భారీగా వచ్చిన జనసైనికులు.. ఏపీ మంత్రుల్ని చూసి వారిపై నిరసన వ్యక్తం చేశారు. ఈ ఎపిసోడ్ లో ఏపీ మంత్రి ఆర్కే రోజా జనసైనికుల్ని వేలితో చూపిన వైనం రెచ్చగొట్టటమే కాదు.. వారి దాడికి కారణమైందన్నట్లుగా వీడియో బయటకు రావటం తెలిసిందే.

ఇదంతా విశాఖ ఎయిర్ పోర్టుకు పవన్ కల్యాణ్ చేరుకోవటానికి ముందు జరిగాయి. అయినప్పటికీ విశాఖ పోలీసులు పవన్ కల్యాణ్ విషయంలో వ్యవహరించిన తీరు.. వారి వైఫల్యాలకు జనసేనాని మీద వేసేందుకు చేసిన ప్రయత్నాలపై విమర్శలు వెల్లువెత్తాయి. పవన్ బస చేసిన నొవాటెల్ హోటల్ కు వచ్చిన పోలీసులు.. అధికారులు ఆయనపై ఆంక్షలు విధించటం.. పలువురు జనసైనికుల్ని అరెస్టు చేసి.. రిమాండ్ కు తరలించటం లాంటివి చోటు చేసుకున్నాయి.

పవన్ విషయంలో జగన్ సర్కారు వ్యవహరించిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ లోకేశ్.. చంద్రబాబులు సంఘీభావం తెలియజేయటం.. విశాఖ నుంచి వెనక్కి తిరిగి వచ్చిన పవన్ టీడీపీ అధినేతతో భేటీ కావటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. జరిగిన పరిణామాన్ని సాపేక్షంగా చూసినప్పుడు వైసీపీ నేతలు ఆరోపిస్తున్నట్లుగా ముసుగు తొలిగిందంటూ చేసే ప్రచారంలో అర్థం లేదనే చెప్పాలి. నిజానికి విశాఖలో చోటు చేసుకున్న పరిస్థితులపై సోషల్ మీడియాలో తొలుత నారా లోకేశ్ సంఘీభావాన్ని ప్రకటిస్తే.. ఆ తర్వాత చంద్రబాబు ఎంటర్ అయ్యారు.

తన పట్ల అభిమానాన్ని ప్రదర్శించిన వారికి తగ్గట్లు స్పందించటం మర్యాదస్తుల లక్షణం. కానీ.. ఆ విషయాన్ని పక్కన పెట్టేసి.. రాజకీయ కాంక్షతో భేటీ అయ్యారని.. ఇంతకాలం చంద్రబాబు -పవన్ మధ్య రహస్య సంబంధం ఉందంటూ చేస్తున్న ప్రచారంలో అర్థం లేదు. ఒకవేళ.. విశాఖలో జరిగిన పరిణామాలు ఏవీ జరగకపోయి ఉంటే.. చంద్రబాబు - పవన్ లు భేటీ అయ్యే వారా? అన్నది ప్రాథమిక ప్రశ్న. దీన్ని వేసుకోకుండా నోటికి వచ్చినట్లుగా మాట్లాడటంలో అర్థం లేదనే చెప్పాలి. చేయాల్సిందంతా చేసి.. దానికి కొనసాగింపుగా చోటు చేసుకున్న పరిణామాలపై విరుచుకుపడటం వైసీపీ నేతలకే చెల్లుతుందన్న మాట వినిపిస్తోంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.