Begin typing your search above and press return to search.

ఇప్పటికైనా వీళ్ళు మారుతారా?

By:  Tupaki Desk   |   29 Sep 2022 4:53 AM GMT
ఇప్పటికైనా వీళ్ళు మారుతారా?
X
చాలామందిలో నమ్మకమైతే పెద్దగా లేదు. ఎందుకంటే మంత్రులు, ఎంఎల్ఏలందరు ప్రతి గడపదగ్గరకు వెళ్ళాల్సిందే అని జగన్మోహన్ రెడ్డి పదే పదే చెబుతున్నా వీళ్ళు పెద్దగా ఆసక్తి చూపటంలేదంటే ఏమిటర్ధం ? జగన్ ఆదేశాలు లెక్కచేయాల్సిన అవసరం లేదని అనుకునైనా ఉండాలి, లేదా వచ్చే ఎన్నికల్లో టికెట్ వస్తుందనే విషయంలో నమ్మకమైనా లేకుండాలి. ఇదేమీకాదంటే తమకు కాదని జగన్ టికెట్ ఎవరికిస్తారులే అన్న ధీమా అయినా ఉండుండాలి.

ఇంతకీ విషయం ఏమిటంటే గడపగడపకు వైసీపీ అనే కార్యక్రమంపై జగన్ సమీక్షించారు. ఈ సమీక్షకు మంత్రులు, ఎంఎల్ఏలు, ఎంఎల్సీలంతా హాజరయ్యారు. వీరిలో మంత్రులు, ఎంఎల్ఏలు కలిపి 27 మంది పనితీరుపైన జగన్ తీవ్రమైన అసంతృప్తి వ్యక్తంచేశారు. మంత్రులు తానేటివనిత, బుగ్గన రాజేంద్రనాధరెడ్డి, రోజా, దాటిశెట్టి రాజా, మాజీ మంత్రులు ఆళ్ళనాని, బాలినేని శ్రీనివాసులరెడ్డితో పాటు మరికొందరు ఎంఎల్ఏలు కూడా ఉన్నారు.

ఇక్కడ విషయం ఏమిటంటే వీళ్ళందరికీ జగన్ ఫుల్లు క్లాస్ పీకటం ఇదే మొదటిసారి కాదు. గతంలో జరిగిన సమీక్షల్లో కూడా వీళ్ళల్లో చాలామందికి జగన్ ఫుల్లుగా క్లాస్ పీకారు.

అయినా వీళ్ళ పనితీరు మారలేదంటే అర్ధమేంటి ? ఈ కార్యక్రమంలో పాల్గొనటం వీళ్ళకి ఇష్టం లేదని అర్ధమైపోతోంది. గడపగడపకు వైసీపీ అనే కార్యక్రమాన్ని తానెంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నది జగన్ ఇప్పటికే చాలాసార్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న వాళ్ళ ఫీడ్ బ్యాక్ ఆధారంగానే వచ్చే ఎన్నికల్లో టికెట్ కేటాయింపు ఉంటుందని కూడా చెప్పారు.

ఇంత గట్టిగా చెప్పినా 27 మంది కార్యక్రమంలో సరిగా పాల్గొనటం లేదంటనే ఆశ్చర్యంగా ఉంది. భవిష్యత్తులో కూడా వీళ్ళు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని చాలామంది అనుకోవటం లేదు.

ఎన్నిసార్లు చెప్పినా, వార్నింగ్ ఇచ్చినా పాల్గొననివారు ఇకముందు పాల్గొంటారా ? వారంలో నాలుగురోజులు కార్యక్రమంలో పాల్గొనాల్సిందే అని జగన్ చెప్పారు. వచ్చే నవంబర్లో మళ్ళీ సమీక్షిస్తానని అప్పటికీ పనితీరు మెరుగ్గా లేకపోతే ప్రత్యామ్నాయం చూసుకోవటం ఖాయమని చెప్పేశారు. మరి నిజంగానే జగన్ ఆపని చేయగలరా ?



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.