Begin typing your search above and press return to search.

ఎమ్మెల్యేలు, ఎంపీల‌పై వ్య‌తిరేక‌త‌ను వైఎస్సార్సీపీ ఇలా అధిగ‌మించ‌నుందా?

By:  Tupaki Desk   |   23 Aug 2022 11:30 AM GMT
ఎమ్మెల్యేలు, ఎంపీల‌పై వ్య‌తిరేక‌త‌ను వైఎస్సార్సీపీ ఇలా అధిగ‌మించ‌నుందా?
X
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో మ‌రోమారు విజ‌య ఢంకా మోగించాల‌ని వైఎస్సార్సీపీ ఉవ్విళ్లూరుతోంది. లెక్క‌కు మిక్కిలిగా అమ‌లు చేస్తున్న సంక్షేమ ప‌థ‌కాలే త‌మ‌ను విజ‌య తీరాల‌కు చేరుస్తాయ‌ని ముఖ్య‌మంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి నుంచి చోటా నేత‌ల వ‌ర‌కు గ‌ట్టిగా న‌మ్ముతున్నారు. 175కి 175 అసెంబ్లీ సీట్లు సాధించాల‌ని వైఎస్ జ‌గ‌న్.. త‌న పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ నేత‌లు, కార్య‌క‌ర్త‌ల‌కు ఉద్భోదిస్తున్నారు. ఇప్ప‌టికే గ‌డ‌ప గ‌డ‌ప‌కు మ‌న ప్ర‌భుత్వం పేరుతో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, నియోజ‌క‌వ‌ర్గాల ఇన్‌చార్జులు ఇంటి ఇంటికీ తిరుగుతున్నారు.

అయితే ఐదేళ్లు ప‌రిపాలించిన‌ప్పుడు ప్ర‌భుత్వంపై ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త కూడా స‌హ‌జం. అలాగే కొంత‌మంది ఎమ్మెల్యేలు, అలాగే ఎంపీల‌పైన ర‌క‌ర‌కాల ఆరోప‌ణ‌లు వైఎస్సార్సీపీ ప్ర‌భుత్వాన్ని ఇర‌కాటంలో ప‌డేశాయ‌ని అంటున్నారు. ముఖ్యంగా ఎంపీ గోరంట్ల మాధ‌వ్, ఎమ్మెల్సీ అనంత్ బాబుల వ్య‌వ‌హారాల‌తో వైఎస్సార్సీపీ ప్ర‌తిష్ట కొంత మ‌స‌క‌బారింద‌ని చెప్పుకుంటున్నారు. ఈ నేప‌థ్యంలో దీనికి వైఎస్సార్సీపీ విరుగుడు వ్యూహం ర‌చించింద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.

ప్ర‌స్తుతం ఎమ్మెల్యేలుగా ఉన్న‌వారిని ఎంపీలుగా పోటీ చేయించ‌డం, అదేవిధంగా ఎంపీలుగా ఉన్న‌వారిని ఎమ్మెల్యేలుగా పోటీ చేయించ‌డం వంటి వ్యూహాల‌ను వైఎస్సార్సీపీ అమ‌లు చేయ‌నుంద‌ని గాసిప్స్ వినిపిస్తున్నాయి.

అదేవిధంగా కొన్ని చోట్ల ఎమ్మెల్యేల‌ను ప్ర‌స్తుతం వారు ప్రాతినిధ్యం వ‌హిస్తున్న నియోజ‌క‌వ‌ర్గాల నుంచి కాకుండా వేరే నియోజ‌క‌వ‌ర్గాల నుంచి కూడా పోటీ చేయించే యోచ‌న‌లో వైఎస్సార్సీపీ అధిష్టానం ఉంద‌నే చ‌ర్చ న‌డుస్తోంది. ఇలా అయితేనే ప్ర‌జల్లో వ్య‌తిరేక‌త‌ను కొంత‌వ‌ర‌కు అధిగ‌మించ‌గ‌ల‌మ‌ని ఆ పార్టీ భావిస్తోంద‌ని అంటున్నారు.

అదేవిధంగా ఇంకో ప్ర‌త్యామ్నాయ ఆలోచ‌న కూడా వైఎస్ జ‌గ‌న్ మ‌దిలో ఉంద‌ని చెబుతున్నారు. ప్ర‌జా వ్య‌తిరేక‌త ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీల‌కు వచ్చే ఎన్నిక‌ల్లో సీట్లు ఇవ్వ‌కుండా వారి వార‌సులు.. అంటే కుమార్తెలు లేదా కుమారుల‌కు సీట్లు ఇచ్చే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. లేదంటే వ్య‌తిరేక‌త ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీల భార్య‌ల‌కు సీట్లు ఇవ్వవ‌చ్చ‌నే వాద‌న వినిపిస్తోంది. అలాగే దాదాపు 40 నియోజ‌క‌వ‌ర్గాల్లో మాత్రం పూర్తిగా కొత్త అభ్య‌ర్థులు వైఎస్సార్సీపీ త‌ర‌ఫున అసెంబ్లీకి పోటీ చేస్తార‌ని పేర్కొంటున్నారు.

ఈ విష‌యంలో జ‌గ‌న్‌.. దివంగ‌త సీఎం ఎన్టీఆర్‌ను ఆద‌ర్శంగా తీసుకోబోతున్నార‌ని తెలుస్తోంది. ఎన్టీఆర్ 1982లో టీడీపీ ఏర్పాటు చేసినప్పుడు ఎంతో మంది వైద్యులు, విద్యావంతులు, ప్ర‌భుత్వ టీచ‌ర్లు, ప్రొఫెస‌ర్ల‌కు సీట్లు ఇచ్చి ఎన్నిక‌ల్లో పోటీ చేయించిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో జ‌గ‌న్ కూడా ఇదే మాదిరిగా చేయొచ్చ‌ని అంటున్నారు.