Begin typing your search above and press return to search.

అక్క‌డ గాలి మ‌ర‌లు చేతులు మారాయి, టీడీపీ బాధ అంతా ఇంతా కాదు!

By:  Tupaki Desk   |   6 March 2020 4:30 PM GMT
అక్క‌డ గాలి మ‌ర‌లు చేతులు మారాయి, టీడీపీ బాధ అంతా ఇంతా కాదు!
X
గాలి మ‌ర‌లు.. అనంత‌పురం జిల్లాలో ఈ ప‌వ‌న విద్యుత్ భారీ ప‌రిశ్ర‌మ‌గానే మారింది. క‌ర్ణాట‌క స‌రిహ‌ద్దు ప్రాంతంలోని అనంత‌పురం జిల్లా లో పవ‌న్ విద్యుత్ త‌యారీకి భారీ ఎత్తున గాలిమ‌ర‌ల‌ను ఏర్పాటు చేశారు. అక్క‌డ అందుకు అనువైన వాతావ‌ర‌ణం ఉండ‌టంతో గ‌త ప‌దిహేనేళ్ల‌లో గాలిమ‌ర‌ల సంఖ్య గ‌ణ‌నీయంగా పెరిగింది. ఈ క్ర‌మంలో అదో పెద్ద వ్యాపారంగా మారింది. దీనిపై రాజ‌కీయ నేత‌ల దృష్టి స‌హ‌జంగానే ప‌డింది.

మొన్న‌టి వ‌ర‌కూ తెలుగు దేశం పార్టీ వాళ్లు ఈ గాలిమ‌ర‌ల ఏర్పాటు విష‌యం లో భారీగా గ‌డించారు. క‌ల్యాణ‌దుర్గం నియోజ‌క‌వ‌ర్గంలో ఇలాంటి దందా భారీ ఎత్తున సాగింది. గాలి మ‌ర‌ల ఏర్పాటు కు వివిధ కంపెనీలు ఆ ప్రాంతంలోకి ఎంట‌ర్ కావ‌డంతోనే రాజ‌కీయ నేత‌లు వారిపై క‌న్నేశాయి. ప్ర‌తి గాలి మ‌ర ఏర్పాటుకూ ఇంత అంటూ క‌మిష‌న్ చెల్లించుకోవాల్సి వ‌చ్చింది స్థానిక తెలుగు దేశం నేత‌లు. అప్ప‌ట్లో వారి వ‌సూళ్లు మూడు పువ్వులు ఆరు కాయ‌లు అన్న‌ట్టుగా సాగాయి. కోట్ల రూపాయ‌లు గ‌డించార‌నే పేరును తెచ్చుకున్నారు టీడీపీ నేత‌లు.

అలాంటి చోట్ల తెలుగుదేశం పార్టీ చిత్తు అయ్యింది. గాలి మ‌ర‌ల ఏర్పాటులో వ‌సూళ్ల దందా తో పాటు.. అనేక దందాలు అక్క‌డ విశృంఖ‌లంగా సాగ‌డంతో చెడ్డ‌ పేరు బాగా వ‌చ్చింది. ఇక గాలి మ‌ర‌ల నిర్వ‌హ‌ణ అంశం కూడా రాజ‌కీయ నేత‌ల క‌నుస‌న్న‌ల్లోనే సాగింది. అక్క‌డ ప‌ని చేసేందుకు త‌మ పార్టీ వాళ్ల‌నే పెట్టించ‌డం కూడా అప్ప‌ట్లోనే మొద‌లైంది.

క‌ట్ చేస్తే.. గ‌త ఏడాది అసెంబ్లీ సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో తెలుగుదేశం చిత్తు అయిన నేప‌థ్యంలో.. టీడీపీ వాళ్ల దందాకు చెక్ ప‌డింది. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్లు గాలి మ‌ర‌ల మీద దృష్టి సారించిన‌ట్టుగా ఉన్నారు. గాలి మ‌ర‌ల్లో ప‌ని చేస్తున్న టీడీపీ వాళ్ల‌ను వీరు సాగ‌నంపారు. అక్క‌డ త‌మ వారిని పెట్టుకోవ‌డం మొద‌లు పెట్టారు. ఈ ఉద్యోగాల‌కు ఫ‌ర్వాలేద‌నే స్థాయిలో జీతాలున్నాయ‌ట‌. ఈ నేప‌థ్యంలో టీడీపీ వాళ్ల స్థానంలో వైసీపీ వాళ్లు చేరిపోతున్న‌ట్టుగా స‌మాచారం.

త‌మ‌ను పార్టీ పేరుతో వెన‌క్కు పంపిస్తున్నార‌ని ఇన్నాళ్లూ ప‌ని చేసిన వారు వాపోతున్నార‌ని తెలుస్తోంది. అయితే తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి ఉద్యోగాల విష‌యంలో దుష్ట సంప్రదాయం మొద‌లై ఇప్ప‌టికే చాలా యేళ్లు అయ్యాయి. ఏ పార్టీ అధికారం లో ఉంటే.. వారికే ఈ దందా సొంతం అయ్యే ప‌రిస్థితి కొన‌సాగుతూ ఉంది.

విశేషం ఏమిటంటే.. కొత్త నియ‌మాకాల విష‌యంలో వైసీపీ నేత‌లు వ‌సూళ్ల దందా సాగిస్తున్నార‌నేది. త‌మ వారికే ఉద్యోగాలు ఇప్పించుకుంటున్నా.. నేత‌లు క‌మిష‌న్లు కోరుతున్నార‌ట‌. త‌మ వాళ్ల నుంచినే తమ వాటా కోరుతున్నార‌ట వైసీపీ ప్ర‌జాప్ర‌తినిధులు. క‌ల్యాణ‌దుర్గం నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలో ఇలాంటి ప‌రిస్థితి కొన‌సాగుతోంద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ఎన్నిక‌ల స‌మ‌యంలో తాము భారీగా ఖ‌ర్చు పెట్టిన‌ట్టుగా, దాన్ని రాబ‌ట్టుకునేందుకు ఇవే మార్గాల‌ని అంటున్నార‌ట వైసీపీ స్థానిక నేత‌లు!