Begin typing your search above and press return to search.

పాకిస్తాన్ నాటకాలు.. అందుకే ఈ వీడియోలు

By:  Tupaki Desk   |   27 Feb 2019 4:48 PM GMT
పాకిస్తాన్ నాటకాలు.. అందుకే ఈ వీడియోలు
X
నిన్నటి బాలాకోట్ మెరుపు దాడి తరువాత పాకిస్తాన్ ఈ రోజు భారత్‌ను వ్యూహాత్మకంగా తమ ఉచ్చులో పడేలా చేసి మన పైలట్ ఒకరిని అదుపులోకి తీసుకుంది. ఆ తరువాత ప్రపంచ దేశాల ముందు మంచితనం నటిస్తూ కపట నాటకాలు ఆడుతోంది. మనల్ని కవ్విస్తూ మన గగనతలంలోకి చొరబడింది. మన వాయు సేన ఆ విమానాలను తరిమికొట్టడానికి వెళ్లినప్పుడు అందులోని మిగ్ విమానం సాంకేతిక సమస్యతో కూలిపోగా అందులోని పైలట్ ‌ను పాక్ తమ అదుపులోకి తీసుకుంది. అతనికి సంబంధించిన వీడియోను తొలుత పాక్ మిలటరీ డీజే గఫూర్ తొలుత ట్వీట్ చేసినా ఆ తరువాత దాన్ని డిలీట్ చేశారు.

అలాగే తొలుత ఇద్దరు పైలట్లు తమ అదుపులో ఉన్నారని చెప్పి ఇప్పుడు ఒక్కరే ఉన్నారని చెబుతోంది. పాకిస్తాన్ అదుపులో ప్రస్తుతం ఉన్నది ఒకే ఒక పైలట్ అని .. అతను వింగ్ కమాండర్ అభినందన్ అని పాక్ సైన్యం పేర్కొంది. ఇవన్నీ ఒకెత్తయితే పట్టుబడిన మన వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్‌ను విచారిస్తూ ఎంతో జాగ్రత్తగా చూసుకుంటున్నట్లు ఆయనతో చెప్పించడం పాక్ నాటకాలకు అద్దం పడుతోంది.

నిజానికి అభినందన్ పాక్ భూభాగంలో పడిన తరువాత అక్కడ స్థానికులో, ఉగ్రవాదులో, సైన్యమో ఆయనపై దాడి చేసి కొట్టడానికి సంబంధించిన వీడియోలు పాక్ ప్రజల సోషల్ మీడియా అకౌంట్లలో కనిపిస్తోంది. కానీ, విచారణ సమయంలో అభినందన్‌కు టీ ఇచ్చి ఆయనకు ప్రశ్నలడగడంతో పాటు తనను పాక్ సైన్యం చాలా బాగా చూసుకుంటోందని చెప్పించిన వీడియోను పాక్ బయట సమాజం కోసం షేర్ చేసింది.

నిజానికి భారత్ పాక్‌లోని ఉగ్రస్థావరంపై మాత్రమే దాడి చేయగా పాక్ మాత్రం మన సైన్యంపై దాడి చేసినట్లుగానే భావించాలి. ఈ విషయంలో అంతర్జాతీయ సమాజం నుంచి పాక్‌పై ఒత్తిడి వస్తుంది కాబట్టి తాము పట్టుకున్న వింగ్ కమాండర్‌ను చాలా బాగా చూసుకుంటున్నాం.. శాంతి కోరుకుంటున్నాం అని దొంగ సంకేతాలు పంపించే ఉద్దేశంతో ఇలాంటి వీడియోలు షేర్ చేస్తోందని నిపుణులు చెబుతున్నారు. అమెరికా, బ్రిటన్ వంటి దేశాలన్నీ పాక్‌నే తప్పుపడుతుండడం... పాక్ మిత్ర దేశం చైనా కూడా పాక్‌ను వెనకేసుకుని రాలేని పరిస్థితిలో ఉండడంతో ఇలాంటి నాటకాలకు తెరతీస్తోంది.

మరోవైపు పాక్ సైన్యం తనను ఎన్ని రకాలుగా ప్రశ్నించినా కూడా మన వింగ్ కమాండర్ అభినందన్ మాత్రం ఎక్కడా భయం లేకుండా తాను చెప్పదలచుకున్న సాధారణ సమాచారం మాత్రమే చెప్పి.. మిగతావి తాను చెప్పబోనని స్పష్టంగా చెప్పేశారు. తాను వాడిన ఎయిర్ క్రాఫ్ట్ ఏమిటి? ఆయన మిషన్ ఏంటనేది పాక్ ప్రశ్నించినా కూడా తాను చెప్పనని అభినందన్ సున్నితంగానే తిరస్కరించారు.