Begin typing your search above and press return to search.

ఈ రోజుతో విక్రమ్ పై ఆశలు వదులుకోవాల్సిందే..

By:  Tupaki Desk   |   20 Sep 2019 5:11 AM GMT
ఈ రోజుతో విక్రమ్ పై ఆశలు వదులుకోవాల్సిందే..
X
ఇస్రో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్ 2 ప్రయోగంలో భాగంగా విక్రమ్ ల్యాండర్ సాఫ్ట్ ల్యాండింగ్ లో ఇబ్బందులు ఎదురు కావటం.. సంకేతాలు అందకపోవటం తెలిసిందే. దీనికి సంబంధించి ఎన్ని ప్రయత్నాలు చేసినా.. ఇప్పటివరకూ ఫలించలేదు. ఈ ప్రయత్నాలకు ఇవాళే ఆఖరు రోజు. ఈ నెల 7న చంద్రుడికి అత్యంత సమీపంలోకి వెళ్లిన విక్రమ్ ల్యాండర్ ఆఖరి నిమిషాల్లో తేడా కొట్టటం.. సంకేతాలు ఆగిపోవటం తెలిసిందే.

ఇదిలా ఉంటే నాసాకు చెందిన లూనార్ రికానిసెన్స్ ఆర్బిటర్ విక్రమ్ పడిన ప్రాంతాన్ని ఫోటోలు తీసింది. అయితే.. అందులో విక్రమ్ జాడ లభించలేదు. అయితే.. మరికొన్ని వార్తా సంస్థలు మాత్రం విక్రమ్ ల్యాండర్ ను నాసా పసిగట్టిందని.. ఇందుకు సంబందించిన ఫోటోల్ని విడుదల చేసినట్లుగా వార్తలు ఇచ్చాయి.

ఏది ఏమైనా విక్రమ్ ల్యాండర్ నుంచి సంకేతాలు అందుకోవటానికి ఈ రోజు (శుక్రవారం) మాత్రమే మిగిలి ఉందని చెప్పాలి. ఈ రోజుతో విక్రమ్ తో సంబందాలకు అవకాశం లేకపోగా.. శాశ్వితంగా దాని మీద ఆశలు వదిలేసుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే.. చంద్రుడిపై 14 రోజులు పగలు ఉంటే.. మరో 14 రోజులు రాత్రి ఉంటుంది. అది ఇవాల్టితో ముగుస్తుంది. పగటి వేళ ఉండే ఉష్ణోగ్రతలకు రాత్రిళ్లు ఉండే ఉష్ణోగ్రతకు ఏ మాత్రం సంబంధం ఉండదు. చంద్రుడి దక్షిణాదిన చీకటి సమయంలో ఉష్ణోగ్రత మైనస్ 240 డిగ్రీల సెల్సియస్ వరకూ పడిపోతుంది. విక్రమ్ ల్యాండర్ ను అంత చలిని తట్టుకునేలా తయారు చేయలేదు. దీంతో.. విక్రమ్ ల్యాండర్ పాడైపోవటం ఖాయం. ఈ నేపథ్యంలో సంకేతాలు అందుకోవటానికి ఇదే ఆఖరు రోజుగా చెప్పాలి.