Begin typing your search above and press return to search.

మ‌న‌కి మండుతోంది.. పెద్ద‌న్న‌కు వ‌ణుకు

By:  Tupaki Desk   |   8 March 2018 1:06 PM GMT
మ‌న‌కి మండుతోంది.. పెద్ద‌న్న‌కు వ‌ణుకు
X
ప్ర‌పంచానికి పెద్ద‌న్న ట్యాగ్ ఉన్న అమెరికాకు ఇటీవ‌ల కాలంలో ప్ర‌కృతి చుక్క‌లు చూపిస్తోంది. ఆగ్రరాజ్యంగా త‌మ‌కు తిరుగులేద‌ని చెప్పుకున్నా.. అక్క‌డి వాతావ‌ర‌ణ ప‌రిస్థితు మ‌హా ఇబ్బందిగా మారాయి. ఆ మ‌ధ్య‌న విరుచుకుప‌డిన హ‌రికేన్లు అమెరికాలోని కొన్ని రాష్ట్రాల వారికి చుక్క‌లు చూపిస్తే.. తాజాగా విప‌రీతంగా ప‌డుతున్న మంచుతో కొత్త క‌ష్టాలు మొద‌లైన‌ట్లుగా చెబుతున్నారు.

అమెరికాలోని న్యూయార్క్.. న్యూజెర్సీల్లో ఉష్ణోగ్ర‌త‌లు తీవ్రంగా ప‌డిపోయాయ‌ని... మంచు కార‌ణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర‌వుతోంది. ఎటు చూసినా మంచు కుప్ప పోసిన‌ట్లుగా ఉండ‌టం.. ఎంత క్లియ‌ర్ చేసినా నిమిషాల‌ వ్య‌వ‌ధిలో మంచు పేరుకుపోవ‌టంతో తీవ్ర ఇబ్బందుల‌కు గురి అవుతున్నారు.

న్యూయార్క్ లో అయితే ఆరు నుంచి ప‌ది అంగుళాల మేర‌.. న్యూజెర్సీ.. క‌నెక్టిక‌ట్ ల‌లో అయితే 20 అంగుళాల మేర మంచు పేరుకుపోయింది. మంచుతుఫాన్ తో ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందుల‌కు గురి అవుతున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే మంచు తుఫానుతో పాటు బ‌ల‌మైన గాలులు వీస్తుండ‌టంతో స‌హాయ‌క చ‌ర్య‌ల‌కు తీవ్రంగా విఘాతం క‌లుగుతున్న‌ట్లుగా తెలుస్తోంది.

గాలుల నేప‌థ్యంలో విద్యుత్ స‌ర‌ఫ‌రా కొన్ని ప్రాంతాల‌కు ఆగిపోయింది. ఒక అంచ‌నా ప్ర‌కారం దాదాపు ల‌క్ష ఇళ్ల‌కు విద్యుత్ స‌ర‌ఫ‌రా నిలిచిపోయిన‌ట్లు చెబుతున్నారు. దీంతో వారంతా తీవ్ర ఇబ్బందుల‌కు గురి అవుతున్నారు. వ‌ణికించే చ‌లిలో.. విద్యుత్ స‌ర‌ఫ‌రా నిలిచిపోవ‌టంతో క‌ష్టాలు మ‌రింత రెట్టింపు అయ్యాయి. మంచుతుఫాను ప్ర‌భావం విమాన స‌ర్వీసుల మీదా ప‌డింది. రాక‌పోక‌ల‌కు తీవ్ర అంత‌రాయం చోటు చేసుకుంది. ఇప్ప‌టికే న్యూయార్క్.. న్యూజెర్సీ ఎయిర్ పోర్టులలో వేలాది విమాన రాక‌పోక‌ల్ని అధికారులు నిలిపివేశారు. దాదాపు 2600 విమానాలు ర‌ద్దు అయిన‌ట్లుగా ప్ర‌క‌టించారు.

దీంతో.. ప్ర‌యాణాల కోసం ఏర్పాట్లు చేసుకున్న‌వారు తీవ్రంగా ఇబ్బంది ప‌డుతున్నారు. రాక‌పోక‌లు నిలిచిపోవ‌టంతో ప్ర‌యాణికులంతా ఎయిర్ పోర్టుల‌లోనే ఉండిపోవాల్సి వ‌స్తోంది. వాతావ‌ర‌ణం ఎప్ప‌టికి మారుతుందో అర్థం కాని ప‌రిస్థితి నెల‌కొంది. మొత్తంగా మంచుతుఫాను అగ్ర‌రాజ్యాన్ని వ‌ణికిస్తోంది.