Begin typing your search above and press return to search.

వామ్మో.. ఈ చలేంది?

By:  Tupaki Desk   |   27 Dec 2015 5:30 AM GMT
వామ్మో.. ఈ చలేంది?
X
నవంబరుతో మొదలయ్యే చలి ఈసారి.. డిసెంబరు మూడో వారం దాటిని చలిపులి దాఖలాలే లేవు. ఈసారికి చలి లేనట్లేనా? అని అనుకుంటున్న వేళ.. వాతావరణంలో అనూహ్య మార్పులు చోటు చేసుకున్నాయి. క్రిస్మస్ పండక్కి సరిగ్గా ఒక్కరోజు ముందు మొదలైన మార్పు.. కేవలం మూడు రోజుల వ్యవధిలో మొత్తంగా మారిపోయింది. నిన్నటివరకూ కనిపించని చలిజాడ.. ఈ రోజున చంపేస్తోంది. ఈ ఏడాది ఇప్పటివరకు బయటకు తీయని స్వెట్టర్లు.. కోట్లు.. రగ్గులు ఇప్పుడు ఒక్కసారిగా బయటకు తీయాల్సి వస్తోంది.

చలికాలంలో ముఖం పేలటం.. పెదవులు చిట్లటం లాంటివి మామూలే. ఈసారి అలాంటి పరిస్థితి కనిపించలేదన్న దిగులు పోగొడుతూ.. మూడు రోజుల నుంచి చలిగాలులు చంపేస్తున్నాయి. హైదరాబాద్ మహానగరాన్నే తీసుకుంటే.. కేవలం మూడు రోజుల వ్యవధిలో 5 డిగ్రీల మేర ఉష్ణోగ్రత పడిపోయి.. చలిగుప్పిట్లో మహానగరం గజగజలాడుతోంది. ఉదయం ఆరున్నర గంటలకు కూడా చీకట్లు పోకపోవటం.. కనుచూపు మేర మంచుతో కప్పబడి ఉండటంతో ఎదుట ఏం ఉందో అర్థం కాని పరిస్థితి.

హైదరాబాద్ మహానగరంలోనే కాదు.. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ చలిపులి చంపేస్తోంది. ఈ సీజన్లో తొలిసారి అదిలాబాద్ లో 4.. విశాఖ ఏజెన్సీ లంబసింగిలో 7.. మెదక్.. రంగారెడ్డి జిల్లా తాండూరులో 8.. రామగుండంలో 9.. చింతపల్లి.. నిజామాబాద్ లలో 10.. హకీంపేటలో 11.. నందిగామలో 12 డగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదయ్యింది.

ఉన్నట్లుండి ఒక్కసారిగా ఇంత పెద్దఎత్తున వాతావరణంలో చోటు చేసుకున్న మార్పులతో ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని.. అస్మా రోగులు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. చిన్న పిల్లల విషయంలో మరింత కేర్ అవసరం. ఇక.. రోజువారీగా తాగే నీటిని తీసుకోవటం తగ్గిపోతుంది. అదే జరిగితే శరీరం పొడిబారటం ఎక్కువ అవుతుంది.అందుకే.. చలి తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో.. గుర్తు చేసుకొని మరీ నీళ్లు తరచూ తాగాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.

ఇక.. ఇప్పటివరకూ జాడ లేని చలి.. ఒక్కసారిలా ఎందుకు చంపేస్తుందన్న ప్రశ్న వేసుకుంటే.. ఎల్ నినో పుణ్యమేనని చెప్పక తప్పదు. దీని ప్రభావంతో ఈ సారి విపరీతమైన ఎండలు.. ఏ మాత్రం వర్షాలు లేకపోవటం (తెలంగాణలో మరీ ముఖ్యంగా).. చలి గాలులు కూడా మొదట లేకుండా ఉండటం.. ఒక్కసారిగా విరుచుకుపడటం లాంటివి చోటు చేసుకున్నట్లు చెబుతున్నారు. ఈ చలి తీవ్రత నెలాఖరు వరకూ ఉంటుందన్న అంచనా వేస్తున్నారు. సైబీరియా నుంచి అధికపీడనంతో వస్తున్న చలిగాలులు ఉత్తరాదికి రావటం.. ఈ గాలుల్లో తేమ శాతం తక్కువగా ఉండటంతో.. చలి తీవ్రత ఎక్కువగా ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏది ఏమైనా.. అల్మారాల్లో దాచిన స్వెట్టర్లు నిండుగా కప్పుకునే సమయం వచ్చేసినట్లే.