Begin typing your search above and press return to search.

మూన్ లైటింగ్.. టెక్ దిగ్గ‌జం మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం!

By:  Tupaki Desk   |   6 Oct 2022 1:30 PM GMT
మూన్ లైటింగ్.. టెక్ దిగ్గ‌జం మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం!
X
ఇటీవ‌ల మూన్ లైటింగ్ (ఒకేసారి రెండు ఉద్యోగాలు చేస్తుండ‌టం) వ్య‌వ‌హారం తీవ్ర చ‌ర్చ‌నీయాంశం అవుతున్న సంగ‌తి తెలిసిందే. ముఖ్యంగా టెక్ దిగ్గ‌జ కంపెనీలు ఈ వ్య‌వ‌హారంపై గ‌ట్టిగా దృష్టి సారించాయి. ఇప్ప‌టికే టెక్ దిగ్గ‌జం.. ఇన్ఫోసిస్‌.. ఒకేసారి రెండు ఉద్యోగాలు చేస్తున్న‌వారిని తొల‌గిస్తామ‌ని త‌మ ఉద్యోగుల‌కు గ‌ట్టి హెచ్చ‌రిక‌లు జారీ చేసిన సంగ‌తి తెలిసిందే.

అలాగే ఇప్ప‌టికే మ‌రో టెక్ దిగ్గ‌జం విప్రో మూన్ లైటింగ్ చేస్తున్న 300 మంది ఉద్యోగులను తొల‌గించింది. మార్కెట్‌లో తమ పోటీదారుల‌తో కలిసి వర్క్‌ చేయడంపై విప్రో 300 మంది ఉద్యోగులపై వేటు వేసింది. విప్రోలో పనిచేస్తున్న ఉద్యోగులు ప్రత్యర్ధి కంపెనీల్లో సైతం పనిచేస్తుండడాన్ని విప్రో చైర్మన్ రిషద్ ప్రేమ్‌జీ ఇటీవ‌ల‌ తీవ్రంగా తప్పుబట్టిన సంగ‌తి తెలిసిందే.

మ‌ళ్లీ ఇప్పుడు సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ఈ తరుణంలో విప్రో వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌కు స్వస్తి పలికి ఉద్యోగుల్ని ఆఫీసుకు రావాలని పిలుపునివ్వడంతో రెండేసి ఉద్యోగాలు చేస్తున్న ఉద్యోగుల్లో ఆందోళన మొదలైంది. అక్టోబ‌ర్ 10 నుంచి సోమ‌, మంగ‌ళ‌, గురు, శుక్ర‌వారాల్లో ఏవైనా మూడు రోజులు త‌మ ఉద్యోగులు ఆఫీసుకు రావాల్సిందేనంటూ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేర‌కు త‌మ ఉద్యోగుల‌కు విప్రో మెయిల్ పెట్టింది.

విప్రో ఉద్యోగులకు పంపిన ఇ - మెయిల్స్‌లో..హైబ్రిడ్ పని విధానాన్నికొనసాగిస్తూ ఉద్యోగుల మధ్య స్నేహపూర్వక ప‌ని వాతావరణాన్ని కల్పించే ఈ ఉద్దేశంతో ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు విప్రో పేర్కొంది. 'మా రిటర్న్ టు ఆఫీస్ పాలసీలో సౌకర్యవంతమైన, హైబ్రిడ్ విధానాన్ని విప్రో అనుస‌రిస్తోంది. అక్టోబర్ 10 నుంచి నాయ‌క‌త్వ బాధ్య‌త‌ల్లో ఉన్న ఉద్యోగులు వారానికి మూడు ప‌ర్యాయాలు తిరిగి కార్యాలయాలకు రావాలి. సోమ, మంగళ, గురు, శుక్రవారాల్లో ఆఫీసులు ఉద్యోగులకు అందుబాటులో ఉంటాయని త‌న ఈ మెయిల్ లో విప్రో వెల్ల‌డించింది.

అయితే విప్రో తీసుకున్న ఈ నిర్ణయంపై ఐటీ రంగ ఉద్యోగుల సంఘం (నైట్స్‌) అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఆఫీసుకు రావాలంటూ ఉద్యోగులకు విప్రో పెట్టిన మెయిల్‌పై ఐటీ రంగ ఉద్యోగుల సంఘం నాసెంట్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ ఎంప్లాయిస్‌ సెనేట్‌ (ఎన్‌ఐటీఈఎస్‌) ప్రెసిడెంట్‌ హర్‌ప్రీత్‌ సలూజ స్పందించారు.

విప్రో ఉద్యోగులకు అకస్మాత్తుగా ఈ-మెయిల్‌ పంపింద‌ని ఆయ‌న త‌ప్పుబ‌ట్టారు. ఆ కంపెనీ నెల క్రితమే మెయిల్ పంపి ఉండాల్సింద‌ని అభిప్రాయప‌డ్డారు. ఉద్యోగులకు వెళ్లాల్సిన‌ ప్రాంతాలకు చేరుకునే వెసులుబాటు ఉండేద‌ని తెలిపారు. అలాగే, ఉద్యోగుల అనుమతి, వారి అభిప్రాయాలను కూడా విప్రో ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుని ఉండే బాగుండేద‌న్నారు.

కాగా విప్రో, ఇన్ఫోసిస్ బాట‌లోనే గ‌త‌ సెప్టెంబర్‌లో మరో ఐటీ రంగ సంస్థ.. టీసీఎస్ కూడా ఉద్యోగులు వారానికి మూడు రోజులు ఆఫీసుకు రావాలని తేల్చిచెప్పింది. రిటర్న్‌ టూ ఆఫీస్‌ పాలసీలో భాగంగా టీం లీడర్లు హెచ్‌ ఆర్‌ టీం విభాగంతో చర్చలు జరిపి నిర్ణయం తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.

ఐటీ కంపెనీల్లో మూన్‌లైటింగ్‌ వివాదం దుమారం రేపుతోంది. ఒకే సమయంలో రెండు ఉద్యోగాలు చేస్తున్న ఐటీ ఉద్యోగులకు కంపెనీలు హెచ్చరికలు జారీ చేసిన విషయం తెలిసిందే.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.