Begin typing your search above and press return to search.
విప్రోపై బయో దాడి హెచ్చరిక...హై అలర్ట్
By: Tupaki Desk | 6 May 2017 4:58 PM GMTదేశీయ ఐటీ దిగ్గజం విప్రోకు అనూహ్యమైన హెచ్చరిక వచ్చింది. సాధారణంగా సైబర్ దాడులు ఎదుర్కునే ఐటీ సంస్థకు భిన్నంగా విప్రోకు బయో బాంబు దాడి హెచ్చరిక వచ్చింది. కంపెనీ కార్యాలయాలపై బయోదాడి చేస్తానని ఈ మెయిల్ ద్వారా వార్నింగ్ వచ్చింది. అయితే ఎందుకు ఈ హెచ్చరిక అంటే...రూ.500 కోట్లను బిట్ కాయిన్ల(డిజిటల్ మనీ) రూపంలో చెల్లించాలని లేకపోతే కంపెనీ కార్యాలయాలపై బయోదాడి తప్పదని మెయిల్ లో సదరు అగంతకుడు డిమాండ్ పెట్టాడు. తనకు కావాల్సిన డబ్బును ఇరవై రోజుల్లో చెల్లించకపోతే ఈ దాడి తప్పదని హెచ్చరించాడు.
క్యాస్టర్ ఆయిల్ ప్లాంట్ లలో దొరికే ప్రాణాంతకమైన ``రిజిన్`` పదార్థాన్ని బయోదాడిలో భాగంగా ఉపయోగించనున్నట్లు మెయిల్ లో సదరు అగంతకుడు వెల్లడించాడు. ఈ ప్రమాదకరమైన పదార్థాన్ని విప్రో కేఫ్ లో వినియోగిస్తామని లేకపోతే డ్రోన్ ద్వారా కంపెనీ ఆవరణలో వెదజల్లుతామని లేదా టాయిలట్ పేపర్ ద్వారా ఇలా ఏ రూపంలోనైనా తమ దాడి జరగొచ్చని మెయిల్ లో అగంతకుడు వివరించాడు. అయితే తన హెచ్చరిక కేవలం బెదిరింపుతోనే ఆగిపోదని శాంపిల్ గా రెండు గ్రాముల రెజిన్‌ను బెంగుళూరులోని విప్రో బ్రాంచ్ లకు కొద్ది రోజుల్లో పంపుతానని సదరు ఈమెయిల్ లో అగతంకుడు హెచ్చరించాడు. ఈ సందర్భంగా తన గత చరిత్ర గురించి అగంతకుడు వివరణ ఇచ్చాడు. తన వద్ద మొత్తం ఒక కిలో రెజిన్ ఉందని ప్రకటిస్తూ ఈ ఏడాది జనవరిలో కోల్ కతాలో 22 వీధి కుక్కలు మరణించడానికి తానే కారణమని చెప్పాడు. రెజిన్ ను వాటిపై ప్రయోగించడం వల్లే అవి మరణించాయని పేర్కొంటూ ఇందుకు సంబంధించిన న్యూస్ పేపర్ క్లిప్పింగ్ ను కూడా ఈ-మెయిల్‌కు జత చేయడం గమనార్హం.
కాగా, ఈ మెయిల్ బెదిరింపుపై విప్రో ఉద్యోగులు సైబర్ సెక్యూరిటీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదును తీసుకున్న పోలీసులు సైబర్ టెర్రరిజం కింద కేసును నమోదు చేశారు. అదే సమయంలో బెదిరింపు మెయిల్ తో అప్రమత్తమైన విప్రో.. దేశంలోని అన్ని బ్రాంచ్ లలో భద్రతను కట్టుదిట్టం చేసింది. రాబోవు రోజుల్లో కంపెనీ ఆపరేషన్లు యధావిధిగా కొనసాగుతాయని తెలిపింది. ఉద్యోగులు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/