Begin typing your search above and press return to search.

ఒకే ఒక్కడుగా.. ‘జగన్’ సాధించాడు..

By:  Tupaki Desk   |   21 Dec 2020 6:15 AM GMT
ఒకే ఒక్కడుగా.. ‘జగన్’ సాధించాడు..
X
తల్లి తోడుగా రాజకీయాల్లోకి ఒకే ఒక్కడుగా బయలు దేరాడు. నాడు కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ అధినేత్రిని ఎదురించాడు. 16 నెలలు జైలు పాలయ్యాడు. మరో నేత అయితే ఈ కష్టాలు ఎందుకని రాజకీయాలు వదిలేసేవాడే.. కానీ అక్కడున్నది జగన్. విసిరిన రాళ్లతోనే పార్టీని కట్టాడు. ఒకసారి ఓడిపోయి 5 ఏళ్లు ప్రతిపక్షంలో ఉండి.. పాదయాత్ర చేసి ప్రజలకు చేరువై ఏపీ చరిత్రలోనే 151 ఎమ్మెల్యే సీట్లతో గొప్ప విజయాన్ని సాధించి విజయతీరాలకు చేరాడు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ 47వ పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ ఫోకస్..

ఒక్కడిగా ప్రారంభమైన వైఎస్ జగన్ ప్రస్థానం ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎదగడానికి తిరుగులేని శక్తిగా అవతరించడం వెనుక అలుపెరగని పోరాటం ఉంది. అంతులేని కష్టం ఉంది. జగన్ రాజకీయ జర్నీ ఎందరికో ఆదర్శం అనడంలో ఎలాంటి సందేహం లేదు.

*వైఎస్ మరణంతో క్రియాశీలం..
2009లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం ఏపీని శోకసంద్రంలోకి నెట్టింది. వైఎస్ఆర్ మరణం తట్టుకోలేక వందలాది మరణించారు. వారిని ఓదార్చేందుకు కదిలిన జగన్ కు కాంగ్రెస్ అధిష్టానం అడ్డుపడింది. అంతే అక్కడి నుంచి కాంగ్రెస్ తో జగన్ యుద్ధం మొదలైంది. తండ్రిలాగే మాట తప్పని మడమ తిప్పని నైజాన్ని పుణికిపుచ్చుకొని కాంగ్రెస్ ను ఎదురించి జగన్ ఓదార్పుయాత్ర నిర్వహించారు. ఆగ్రహించిన కాంగ్రెస్ అధిష్టానం జగన్ ను అక్రమాస్తుల కేసు పెట్టించి జైలుకు పంపింది.

*తలవంచని జగన్
వైఎస్ఆర్ ఉండగా రాని ఆరోపణలు ఆయన మరణం తర్వాత ఆయన కుమారుడిపై వచ్చాయంటే దాని వెనుక ఎన్ని కుట్రలు చేశారన్న జగన్ మాట ప్రజల్లోకి బాగా వెళ్లింది. అయినా జగన్ కాంగ్రెస్ కు లొంగలేదు. సంవత్సరన్నర పాటు జైలు జీవితం అనుభవించినా జగన్ తలవంచలేదు. అదే పోరాట పటిమతో కాంగ్రెస్ ను ఎదురిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించి ముందుకు సాగారు.

*తల్లితోడుగా.. బలమైన శక్తిగా..
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించినప్పుడు జగన్ వెంట ఉన్నది కేవలం ఆయన తల్లి విజయమ్మ మాత్రమే. ఇద్దరితో మొదలైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రస్థానం నేడు 151 మంది ఎమ్మెల్యేలు.. 22 మంది ఎంపీలు గెలుచుకునే స్థాయికి చేరింది. ఇది ఏపీలోనే కాదు దేశంలోనే అతిపెద్ద విజయాల్లో ఒకటిగా నిలిచిపోయింది.

*మలుపుతిప్పిన పాదయాత్ర
దేశంలో ఏ రాజకీయ సాహసించని విధంగా ప్రజల కష్టాలు తెలుసుకునేందుకు జగన్ చేసిన 3600 కిలోమీటర్ల పాదయాత్రనే ఆయనను ప్రజలకు చేరువ చేసింది. ప్రజానాడిని పసిగట్టేలా చేసింది. అధికారం దక్కేలా చేసింది.

*హ్యాపీ బర్త్ డే జగన్
ఉద్యమాలే ఊపిరిగా.. జనమే తన హృదయ స్పందనగా.. జనం మెచ్చిన జననేతగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎదిగారు.. ఈ క్రమంలో ఎన్నో చీకటి రాత్రులు గడిపారు. జైలుకు వెళ్లారు. అవమానాలు కత్తిపోట్లు.. వెన్నుపోట్లు అయినా చెక్కుచెదరని ఆయన సంకల్పం చివరకు విజయ తీరాలకు చేర్చింది. అనితర సాధ్యమైన పట్టుదలతో అందరినీ ఎదురించి ఏపీకి ముఖ్యమంత్రిగా ఎదిగిన తీరు నిజంగా అద్భుతమనే చెప్పాలి. అందుకే ఈ పోరాట యోధుడు పుట్టిన రోజు ఇప్పుడు ఏపీ వైసీపీ శ్రేణులకు పండుగైంది. అందరూ ఆయన పుట్టిన రోజును ఘనంగా జరుపుకుంటున్నారు. సినీ, రాజకీయ సెలబ్రెటీ నుంచి జగన్ కు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.